అమరావతిలో కలకలం

తాత్కాలిక సచివాలయ ప్రాంతంలో నిర్మాణ పనులు - Sakshi


అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో తాత్కాలిక సచివాలయం పనుల్లో కలకలం రేగింది. సెక్రటేరియట్ నిర్మాణం జరుగుతున్న ప్రాంతంలో కొంతమేర నేల కుంగిపోయింది. మూడు అడుగులు వరకు నేల కుంగడంతో రెండు బ్లాకుల్లో ఫ్లోరింగ్ దెబ్బతింది. దీంతో అక్కడి పనిచేస్తున్న వారు ఆందోళనకు గురయ్యారు. లూజ్ సాయిల్ వల్లే నేల కుంగివుండొచ్చని అనుమానిస్తున్నారు. నిర్మాణ ప్రాంతంలో నేల కుంగిపోవడంతో పనులు ఏవిధంగా సాగించాలనే దానిపై అధికారులు సమాలోచనలు జరుపుతున్నారు. మంత్రులకు, ప్రిన్సిపాల్ కార్యదర్శలకు కేటాయించనున్న బ్లాకులో నిర్మాణ లోపాలు బయట పడడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది.



ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు హైదరాబాద్ వదిలి జూన్ 27కల్లా వెలగపూడికి తరలి రావాల్సిందేనని చంద్రబాబు ఆదేశించడంతో తాత్కాలిక సచివాలయం పనులు హడావుడిగా చేస్తున్నారన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. తమకు కొంత సమయం కావాలని ఉద్యోగులు కోరినా చంద్రబాబు ససేమిరా అంటున్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఉద్యోగులు వచ్చి తీరాల్సిందేనని సీఎం స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో జూన్ నెలాఖరుకు తాత్కాలిక సచివాలయం పనులు పూర్తి చేయాలని భావించారు. కాగా ఈ వార్తల్ని ఏపీ సీఆర్డీఏ అదనపు కమిషనర్ మల్లికార్జున ఖండించారు.


ఆ వార్తల్లో వాస్తవం లేదు



అమరావతి రాజధాని నగర పరిధిలో తుళ్లూరు మండలం వెలగపూడి దగ్గర నిర్మిస్తున్న ప్రభుత్వ భవనాల కాంప్లెక్సు ప్రాంతంలో నేల కుంగినట్టు సాక్షి టీవీ ఛానల్ లో ప్రసారం అవుతున్న వార్తలో వాస్తవం లేదని ఏపీ సీఆర్డీఏ అదనపు కమిషనర్ డాక్టర్ ఎ. మల్లికార్జున

 తెలిపారు. నిర్మాణ పనులు చేపట్టే ముందుగానే సాయిల్ టెస్టింగ్ చేసి అనుకూలమైన చోటే పనులు చేపట్టామన్నారు.


రెండో బ్లాకులో ఫ్లోరింగ్ దెబ్బతిన్నదని సాక్షి చానల్ ఇచ్చిన వార్త అవాస్తవమన్నారు. నిర్మాణ పనులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు మల్లికార్జున పేర్కొన్నారు. నేల కుంగడంతో మళ్లీ పనులు చేస్తున్నట్టు ఇచ్చిన వార్తలోనూ వాస్తవం లేదని ఆయన తెలిపారు. ప్రభుత్వ భవనాల  కాంప్లెక్సులో ఎక్కడా నేల కుంగలేదన్నారు. కొత్తగా ఎటువంటి పనులు ప్రారంభించలేదని, లూజ్ సాయిల్ వల్లే అలా జరిగి ఉండవచ్చని అనుమానం సరికాదన్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top