చీకట్లో కోడుమూరు | Sakshi
Sakshi News home page

చీకట్లో కోడుమూరు

Published Sat, Jul 26 2014 3:38 AM

చీకట్లో కోడుమూరు

- కరెంట్ బకాయి చెల్లించలేదని పట్టణానికి విద్యుత్ సరఫరా నిలిపివేత
- అప్పుల్లో మేజర్ పంచాయతీ
- జీతాలు చెల్లించలేని దుస్థితి
- భారమైన నిర్వహణ

  కోడుమూరు: పట్టణంలో వీధిలైట్లు వెలగక ప్రజలు చీకట్లో మగ్గిపోతున్నారు. విద్యుత్ బకాయిలు చెల్లించలేదని ఈ నెల 23న ట్రాక్స్‌కో అధికారులు పంచాయతీ కార్యాలయానికి, వీధిలైట్లకు విద్యుత్ సరఫరాను నిలిపి వేశారు. దీంతో రెండు రోజులుగా కోడుమూరు పట్టణం చీకటిమయమైంది. రాత్రి గాడాంధకారంలో జనం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. విద్యుత్ పునరుద్ధరణ కోసం సర్పంచ్ సిబి.లత ట్రాక్స్‌కో ఎస్‌ఈని సంప్రదించినప్పటికి ఫలితం లేకపోయింది. బకాయి పడ్డ రూ.80 లక్షలు చెల్లిస్తేగానీ విద్యుత్ సరఫరా పునరుద్ధరించమని అధికారులు తేల్చి చెప్పారు. పంచాయతీ పరిధిలో ఐదేళ్లుగా విద్యుత్ బకాయిలు పేరుకుపోయాయి.

ఈ మొత్తానికి నెలనెలా ట్రాక్‌కో అధికారులు వడ్డీ వేస్తున్నారు. పంచాయతీకి వివిధ పన్నుల రూపంలో ఏటా రూ.60 లక్షలు ఆదాయం లభిస్తోంది. ట్రాక్టర్ నిర్వహణ, శానిటేషన్ సిబ్బంది, వాటర్ వర్కర్లు, వీధిలైట్లు వేసే సిబ్బంది జీతాలు ఏడాదికి రూ.28 లక్షలు అవసరమవుతోంది. విద్యుత్ బిల్లు నెలకు రూ.4.5 లక్షల ప్రకారం సంవత్సరానికి రూ.54 లక్షలు విద్యుత్ చార్జీలే చెల్లించాల్సిన పరిస్థితి ఉంది.

ప్రతి ఏటా జీతాలు, విద్యుత్ బిల్లుల కోసం రూ.82 లక్షలు ఖర్చవుతోంది. ఆదాయం రూ.60 లక్షలు కాగా ఇంకా దాదాపు రూ.22 లక్షలు ప్రతి ఏటా పంచాయతీకి లోటు బడ్జెట్ ఏర్పడుతోంది. ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని బకాయి ఉన్న రూ.80 లక్షలు మాఫీ చేస్తే తప్పా కోడుమూరు గ్రామపంచాయతీ పరిధిలో అభివృద్ధి పనులు జరుగవని సర్పంచ్ సిబి.లత కోరారు. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో తాగునీటికి సమస్య తలెత్తింది.

Advertisement
Advertisement