ప్రాణం.. 'ఆటో' ఇటో! | Sakshi
Sakshi News home page

ప్రాణం.. 'ఆటో' ఇటో!

Published Tue, Jun 23 2015 9:24 AM

ప్రాణం.. 'ఆటో' ఇటో!

వీళ్లూ మనుషులే. వీరివీ ప్రాణాలే. ఓ తల్లి బిడ్డలే. ప్రమాదం జరిగితే ఆ కన్నపేగు పడే బాధ తెలియనిది కాదు. అక్షరాస్యత శాతాన్ని పెంచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోట్లాది రూపాయలు వ్యయం చేస్తున్నా.. స్వచ్ఛందంగా చదువుకునేందుకు ముందుకొచ్చే విద్యార్థుల బాగోగులను అధికారులు ఏమాత్రం పట్టించుకోని పరిస్థితి. తమ పిల్లలు బాగుంటే చాలు అనుకున్నారో.. ఏమో. రోజూ మృత్యువుపై సవారీ చేస్తున్న బడి పిల్లలను చూస్తే.. దారినపోయే వారెవరికైనా మనసులో ముల్లుగుచ్చుకోక మానదు. మరి అధికారులు ఏమి చేస్తున్నట్లు?
 
గొల్లలదొడ్డి(సి.బెళగల్): మండల పరిధిలోని గొల్లలదొడ్డి విద్యార్థులు సి.బెళగల్‌లోని ఆదర్శ, ఉన్నత పాఠశాలలకు వెళ్లేందుకు సమయానికి బస్సు సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాఠశాలకు సమయానికి చేరుకునేందుకు ఆటోలను ఆశ్రయిస్తూ ప్రమాదకర పరిస్థితుల్లో ప్రయాణిస్తున్నారు. ఆర్‌టీసీ అధికారులు కర్నూలు నుంచి గ్రామానికి బస్సు సర్వీసును ఏర్పాటు చేసినా.. పాఠశాలల సమయానికి అందుబాటులో లేకపోవడం గమనార్హం. గతంలో 7.30 గంటలకే గ్రామానికి వచ్చే బస్సు.. ప్రస్తుతం 11.30 గంటలకు, మధ్యాహ్నం 2.30 గంటలకు వస్తోంది. విద్యార్థులకు ఈ సర్వీసులు ఏమాత్రం ఉపయోగపడని పరిస్థితి. గ్రామంలో దాదాపు 40 మంది విద్యార్థినీ, విద్యార్థులు సి.బెళగల్‌లోని ఆదర్శ, ఉన్నత పాఠశాలలకు, గూడూరులోని జూనియర్ కళాశాలకు వెళ్లి చదువుకుంటున్నారు. 

ఆయా పాఠశాలలు, కాలేజీలు ఉదయం 9 గంటలకే తెరుస్తుండటంతో గ్రామం నుంచి విద్యార్థులు ఆటోల్లో వేళాడుతూ అతి కష్టం మీద చేరుకుంటున్నారు. ఈ పరిస్థితి ఒక్క గొల్లలదొడ్డి గ్రామస్తులదే కాదు.. జిల్లాలోని అనేక ప్రాంతాల్లో గ్రామీణ విద్యార్థుల అవస్థ ఇదే. విధిలేని పరిస్థితుల్లో ఆటోలను ఆశ్రయిస్తుండగా.. వాళ్లకీ నాలుగు డబ్బులు వస్తుండటంతో ప్రమాదమని తెలిసీ సామర్థ్యానికి మించి విద్యార్థులను అందులో కుక్కేస్తున్నారు. బస్సుల్లోనూ టాపుపై ప్రయాణిస్తున్నారు. పోలీసులు, మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్లు తరచూ తనిఖీలు చేపట్టకపోవడం ఎందరి ప్రాణాలు బలిగొంటుందోననే ఆందోళన తల్లిదండ్రుల్లో వ్యక్తమవుతోంది.

Advertisement
 
Advertisement