దేవుడా.. నీవే దిక్కు ! | Sakshi
Sakshi News home page

దేవుడా.. నీవే దిక్కు !

Published Tue, May 21 2024 3:50 AM

దేవుడా.. నీవే దిక్కు !

ప్రార్థన స్థలాల చుట్టూ

అభ్యర్థులు

కడప కల్చరల్‌ : సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో ప్రధానమైన పోలింగ్‌ ఘట్టం ముగిసింది. ఓటర్లు కొన్నిచోట్ల అర్ధరాత్రి దాటాక కూడా ఓట్లు వేసేందుకు ఓపికగా ఉండడం ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇక తమను ఒడ్డున పడేసే శక్తి ఆ దేవుడికే ఉందని నమ్ముతూ అభ్యర్థులు చివరి ఆశగా దేవుడా...నీవే దిక్కు అంటూ ప్రార్థనాలయాల చుట్టూ తిరుగుతున్నారు. మతాతీతంగా అన్ని మతాల దేవుళ్లకు మొక్కుకుంటున్నారు. తమను గెలిపిస్తే హుండీలు కానుకలు సమర్పించుకుంటామని దేవుళ్లకు నమ్మకంగా ప్రత్యేక పూజలు చేస్తున్నారు. తమ గెలుపుపై నమ్మకం సడలిన అభ్యర్థులు తొక్కని గడప లేదు...మొక్కని దేవుడు లేడు అన్నట్లుగా దేవుడిపైనే భారం వేసి ఈ మొక్కులే తమను గెలిపించాలంటూ కోరుకుంటున్నారు. మరికొందరు నాయకులు బృందాలుగా కలిసి పలు ప్రముఖ పుణ్యక్షేత్రాల చుట్టూ తిరుగుతున్నట్లు సమాచారం. ప్రముఖ దేవుళ్లకు మొక్కితే మంచి ఫలితాలు ఉంటాయని ఆశిస్తూ ఖర్చును లెక్కచేయక తీర్థ యాత్రల బాట పట్టారు.

జాతకం ఎలా ఉంది

ఈ ఎన్నికల్లో తమ జాతకం ఎలా ఉందో తెలుసుకునేందుకు కొందరు నాయకులు జ్యోతిష్యులను ఆశ్రయిస్తున్నారు. ఉగాది నాడు పంచాంగకర్తలు ప్రజల మద్దతు లేని వారు గెలిచే అవకాశం లేదని స్పష్టం చేసినా ఏదో మూల కొండంత ఆశతో అంతో ఇంతో ఖర్చు పెట్టుకుని ఫలితం తమవైపు రావాలని, జాతకంలోని దోషాలను సవరించుకునేందుకు పండితులను ఆశ్రయిస్తున్నట్లు తెలుస్తోంది. వీరి జాతకాలు ఎలా ఉంటాయో, అవసరార్థ ప్రార్థనలు ఏ మేరకు ఫలిస్తాయో జూన్‌ 4వ తేదిన జరిగే కౌంటింగ్‌ తర్వాత వెల్లడి కానుంది.

Advertisement
 
Advertisement
 
Advertisement