ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం
Breaking News
‘వైభవ్ కోసం అతడిని బలిపశువును చేశారు’
Published on Mon, 07/13/2026 - 10:46
టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ వైభవ్ సూర్యవంశీపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. అతడికి వచ్చిన హైప్‌ను దృష్టిలో పెట్టుకొని సీనియర్ జట్టుకు ఎంపిక చేయడాన్ని తప్పుబట్టాడు. వైభవ్ చేత అంత త్వరగా అంతర్జాతీయ అరంగేట్రం చేయించాల్సింది కాదని అభిప్రాయపడ్డాడు. కేవలం మీడియా సృష్టించిన హైప్, ప్రజల్లోని ఎమోషన్స్ చూసి సెలెక్టర్లు తొందరపడ్డారని పేర్కొన్నాడు.
ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌కు అవకాశం లభించని వైభవ్‌కు ఇంగ్లండ్ పర్యటనలో రెండో టీ20లో అవకాశం దక్కింది. మొదటి మ్యాచ్ ఆడిన సంజు శాంసన్‌ను రెండో మ్యాచ్‌లో పక్కన పెట్టి అతడి స్థానంలో వైభవ్‌కు అవకాశం ఇచ్చారు. అయితే వరుసగా మూడు మ్యాచ్‌ల్లో వైభవ్ కేవలం 14, 13, 15 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు.
దీంతో ఐదో టీ20 మ్యాచ్‌లో అతన్ని పక్కన పెట్టి మళ్లీ శాంసన్‌ను జట్టులోకి తీసుకున్నారు. ఈ ప్రయోగాలపై స్పందించిన వసీం జాఫర్.. అసలు శాంసన్ ఫామ్‌లో లేడనే బలమైన నమ్మకం ఉంటే తప్ప ఇలాంటి మార్పులు చేయకూడదని హితవు పలికాడు. సంజు శాంసన్ లాంటి మ్యాచ్ విన్నర్‌కు జట్టులో క్రమబద్ధమైన అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాడు.
వైభవ్ సూర్యవంశీ ఇంకా చాలా చిన్న వయస్కుడని, అతనికి ఇంకా చాలా సమయం ఉందని జాఫర్ గుర్తుచేశాడు. అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడే ముందే కేవలం టీమ్‌తో ప్రయాణిస్తూ, వెలుపల నుండి ఆటను గమనిస్తూ అతను ఎంతో నేర్చుకోవచ్చని సూచించాడు. 2026 టీ20 ప్రపంచకప్‌ను టీమిండియా గెలవడంలో కీలకపాత్ర పోషించిన శాంసన్‌ను కేవలం వైభవ్ కోసం పక్కనబెట్టి అతడిని బలిపశువును చేయడం సరైన చర్య కాదన్నాడు.
కేవలం మీడియాలో వస్తున్న వార్తల ప్రభావంతో కంగారుగా జట్టులోకి తెచ్చి ఒత్తిడి పెంచడం పద్ధతి కాదన్నాడు. తదుపరి జింబాబ్వే టూర్ కోసం వైభవ్‌ను ఎంపిక చేసి, కేవలం ఒకే ఫార్మాట్ ఆడే సంజు శాంసన్‌ను పక్కన పెట్టడం తనను ఎంతగానో ఆశ్చర్యపరిచిందని వసీం జాఫర్ తెలిపాడు.
చదవండి: సెమీస్ సమరం.. ఎవరి బలమెంత?
Tags : 1