ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి
Breaking News
T20 WC: ‘డకౌట్ల’ అభిషేక్ శర్మ.. గావస్కర్ కీలక వ్యాఖ్యలు
Published on Thu, 02/19/2026 - 09:40
టీమిండియా విధ్వంసకర ఓపెనర్‌గా పేరొందిన అభిషేక్ శర్మ వైఫల్యాలు కొనసాగుతున్నాయి. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో ఈ వరల్డ్ నంబర్ వన్ బ్యాటర్ ఇంకా పరుగుల ఖాతా తెరవనే లేదు. ఆడిన మూడు మ్యాచ్‌లలోనూ డకౌట్ అయి.. లీగ్ దశను అవమానకర రీతిలో ముగించాడు.
గ్రూప్-ఎలో భాగంగా అమెరికాతో మ్యాచ్‌లో గోల్డెన్ డక్‌గా వెనుదిరిగిన అభిషేక్ శర్మ (Abhishek Sharma).. పాకిస్తాన్‌తో మ్యాచ్‌లోనూ డకౌట్ అయ్యాడు. తాజాగా నెదర్లాండ్స్‌తో బుధవారం నాటి మ్యాచ్‌లోనూ ఇదే తరహా ఫలితాన్ని పునరావృతం చేశాడు.
ఎనిమిది బంతులు మాత్రమే
కెరీర్‌లో తొలిసారి వరల్డ్‌కప్ టోర్నీ ఆడుతున్న ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. ఇప్పటికి మూడు మ్యాచ్‌లు పూర్తి చేసుకుని మొత్తంగా ఎనిమిది బంతులు మాత్రమే ఎదుర్కొన్నాడు. భారీ అంచనాలతో బరిలోకి దిగిన అభిషేక్ ఇలా లీగ్ దశలో.. అది కూడా అమెరికా, నెదర్లాండ్స్ వంటి చిన్న జట్లపై కూడా సింగిల్ కూడా తీయలేకపోయాడు. తద్వారా చెత్త రికార్డుతో అపఖ్యాతి మూటగట్టుకున్నాడు.
తెలివిగా ఆడు
ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్ (Sunil Gavaskar) అభిషేక్ శర్మను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ యువ బ్యాటర్ ముందుగా ఒత్తిడి నుంచి బయటపడాలని సూచించాడు. తనకున్న ట్యాగ్‌లను మరచిపోయి స్వేచ్ఛగా ఆడినప్పుడే అనుకున్న ఫలితం రాబట్టగలడని అభిప్రాయపడ్డాడు. తొందరపడకుండా తెలివిగా షాట్లు ఆడాలని సూచించాడు.
ఈ మేరకు స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. ‘‘అంచనాల భారం అతడిపై ఒత్తిడిని పెంచుతోంది అనుకుంటున్నా!... అతడు మంచి బ్యాటర్. ఆట మొదలుపెట్టాడంటే తనదైన శైలిలో దూసుకుపోగలడు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది.
ముందుగా సింగిల్ తీయాలి
సిక్స్ హిట్టర్ అని పేరున్న అభిషేక్ ఆ ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నాడు. ప్రపంచంలోనే నంబర్ వన్ టీ20 బ్యాటర్ అతడు. అదే అతడిని ఒత్తిడిలోకి నెట్టేస్తుందేమో!.. ఏదేమైనా అభిషేక్ కాస్త ఓపికగా ఉండాలి. మొదటి బంతి నుంచే బౌండరీ, సిక్సర్ బాదాలని అనుకోవడం సరికాదు.
ఆ ఫీలింగ్ నుంచి బయటపడు
ముందుగా సింగిల్ తీయాలి. స్మార్ట్‌గా ఆడాలి. ముఖ్యంగా తన కాళ్లను సరిగ్గా ఉపయోగించుకోవాలి. ఇప్పటికి ఆడిన మూడు మ్యాచ్‌లలో అతడు అవుటైన విధానం అత్యంత సాధారణమైనది. అతడి షాట్ సెలక్షన్‌ను బట్టి ఎవరైనా ముందే పసిగట్టగలరు. ‘200కు పైగా స్ట్రైక్‌రేటుతో బ్యాటింగ్ చేసే ఆటగాడిగానే నన్ను చూస్తారు’ అన్న భావన నుంచి బయటకు రావాలి.
మెదడు నుంచి అలాంటి ఆలోచనను తీసివేయాలి. నీ సహజశైలిలో ఆడు.. అప్పుడు తప్పక భారీ స్కోరు సాధించగలవు’’ అని సునిల్ గావస్కర్ అభిషేక్ శర్మకు కీలక సూచనలు చేశాడు. కాగా గ్రూప్-ఎలో భాగంగా అమెరికా, నమీబియా, పాకిస్తాన్‌లను ఓడించిన టీమిండియా.. ఆఖరిగా నెదర్లాండ్స్‌పై గెలిచి లీగ్ దశను అజేయంగా ముగించింది.
చదవండి: IND vs PAK: అసలైన హీరో మీరే: పీసీబీ చైర్మన్
Tags : 1