DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు
Breaking News
ధోని వరల్డ్ రికార్డుపై కన్నేసిన పంత్
Published on Thu, 06/19/2025 - 14:13
టీమిండియా యువ ఆటగాడు రిషభ్ పంత్ (Rishabh Pant).. భారత దిగ్గజ కెప్టెన్, లెజెండరీ వికెట్ కీపర్ బ్యాటర్ మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) ప్రపంచ రికార్డుపై కన్నేశాడు. ఇంగ్లండ్ గడ్డ మీద సరికొత్త చరిత్ర సృష్టించేందుకు 267 పరుగుల దూరంలో నిలిచాడు. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (WTC) 2025-27లో భాగంగా భారత్- ఇంగ్లండ్ శుక్రవారం నుంచి ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో తలపడనున్నాయి.
ఇంగ్లండ్ గడ్డ మీద అరంగేట్రం
ఈ సిరీస్‌తో టీమిండియా సారథిగా శుబ్‌మన్ గిల్ ప్రస్థానం మొదలుకానుండగా.. వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. కాగా 2018లో టీమిండియా తరఫున టెస్టుల్లో అరంగేట్రం చేసిన పంత్.. ఇంగ్లండ్‌తో తన తొలి మ్యాచ్ ఆడాడు.
ట్రెంట్ బ్రిడ్జి వేదికగా నాడు ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టులో పంత్ రెండు ఇన్నింగ్స్‌లో వరుసగా 24, 1 పరుగు చేశాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా 203 పరుగుల భారీ తేడాతో గెలిచింది. అరంగేట్రంలో అంతంత మాత్రంగానే ఆడిన పంత్.. ఇంగ్లండ్ మీద ఆ తర్వాత మెరుగైన ప్రదర్శన ఇచ్చాడు.
రెండు సెంచరీలు
ఇప్పటి వరకు మొత్తంగా అక్కడ ఎనిమిది టెస్టు మ్యాచ్‌లు ఆడిన పంత్ 511 పరుగులు చేశాడు. ఇందులో రెండు శతకాలు కూడా ఉన్నాయి. ఇక ఇంగ్లండ్‌లో అత్యధిక పరుగులు చేసిన పర్యాటక జట్ల వికెట్ కీపర్ల జాబితాలో 27 ఏళ్ల పంత్ ప్రస్తుతం తొమ్మిదో స్థానంలో ఉన్నాడు. ఈ లిస్టులో టీమిండియా లెజెండ్ ధోని అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
ఇంగ్లండ్‌లో ధోని మొత్తంగా 778 పరుగులు సాధించాడు. అతడిని అధిగమించాలంటే.. పంత్ ఇంకో 267 పరుగులు చేయాలి. తాజా పర్యటనలో భాగంగా టీమిండియా ఐదు టెస్టులు ఆడనున్న నేపథ్యంలో.. పంత్ గనుక బ్యాట్ ఝులిపిస్తే ఇదేమీ అంతకష్టం కాబోదు. మరి.. ఈ ఉత్తరాఖండ్ బ్యాటర్ ఈసారి ధోని వరల్డ్ రికార్డును బ్రేక్ చేస్తాడేమో చూడాలి!!
కాగా రిషభ్ పంత్ టీమిండియా తరఫున ఇప్పటి వరకు 43 టెస్టు మ్యాచ్‌లు ఆడి 2948 పరుగులు చేశాడు. ఇందులో ఆరు శతకాలు, 15 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
ఇంగ్లండ్‌లో అత్యధిక పరుగులు సాధించిన పర్యాటక జట్ల వికెట్ కీపర్ బ్యాటర్లు వీరే..
1. మహేంద్ర సింగ్ ధోని (ఇండియా)- 778 పరుగులు
2. రోడ్నీ మార్ష్(ఆస్ట్రేలియా)- 773 పరుగులు
3. జాన్ హెన్రీ (సౌతాఫ్రికా)- 684 పరుగులు
4. ఇయాన్ హేలీ (ఆస్ట్రేలియా)- 624 పరుగులు
5. జెఫ్రీ డుజాన్ (వెస్టిండీస్)- 604 పరుగులు
6. ఫారూఖ్ ఇంజనీర్ (ఇండియా)- 563 పరుగులు
7. ఆడం గిల్‌క్రిస్ట్ (ఆస్ట్రేలియా)- 521 పరుగులు
8. బ్రాడ్ హాడిన్ (ఆస్ట్రేలియా)- 513 పరుగులు
9. రిషభ్ పంత్ (ఇండియా)- 511 పరుగులు.
చదవండి: ’కర్మ ఎవరినీ వదిలిపెట్టదు.. కచ్చితంగా అనుభవిస్తారు’
Tags : 1