Breaking News

‘ఆ తప్పులే మా కొంప ముంచాయి.. అతడి బ్యాటింగ్‌ అద్భుతం’

Published on Wed, 04/09/2025 - 10:50

ఐపీఎల్‌-2025 (IPL 2025)లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ (CSK) పరాజయాల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే హ్యాట్రిక్‌ ఓటములతో డీలా పడిన సీఎస్‌కే.. తాజాగా పంజాబ్‌ కింగ్స్‌ చేతిలోనూ చేదు అనుభవం ఎదుర్కొంది. ముల్లాన్‌పూర్‌లో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఆఖరి ఓవర్ వరకు పోరాడి విజయానికి పద్దెనిమిది పరుగుల దూరంలో నిలిచిపోయింది.

ఆ తప్పులే మా కొంప ముంచాయి
ఈ నేపథ్యంలో ఓటమి అనంతరం చెన్నై సారథి రుతురాజ్‌ గైక్వాడ్‌ (Ruturaj Gaikwad) స్పందిస్తూ ఓటమికి గల కారణాలు విశ్లేషించాడు. ఫీల్డింగ్‌ తప్పిదాలే తమ కొంపముంచాయని పేర్కొన్నాడు. ఈ మేరకు.. ‘‘గత నాలుగు మ్యాచ్‌లలో ఒకే పొరపాటు.. అదే ఫీల్డింగ్‌. మేము క్యాచ్‌లు డ్రాప్‌ చేస్తూనే ఉన్నాం.

అతడి బ్యాటింగ్‌ అద్భుతం
తద్వారా ఆ బ్యాటర్లు అదనంగా 15, 20, 30 పరుగులు చేసేందుకు ఆస్కారం ఇస్తున్నాం. ఈరోజు ప్రియాన్ష్‌ ఆర్య అద్భుతంగా బ్యాటింగ్‌ చేశాడు. నిజానికి హై రిస్క్‌తో కూడిన ఇన్నింగ్స్‌ ఆడాడు. అయితే, పరిస్థితులు అతడికి అనుకూలించాయి.

ఇదే వికెట్‌పై మేమూ బ్యాటింగ్‌ చేశాం. అయితే, వరుస విరామాల్లో వికెట్లు కోల్పోవడం దెబ్బకొట్టింది. అంతకుముందు కీలక సమయాల్లో క్యాచ్‌లు కూడా డ్రాప్‌ చేశాం. ఇంకో 10- 15 పరుగులు కట్టడి చేయాల్సింది. అలాగే ఇంకో మూడు- నాలుగు సిక్సర్లు బాదాల్సింది.

బ్యాటింగ్‌ పరంగా పర్లేదు
ఏదేమైనా మా ఉత్తమ బ్యాటర్లు రచిన్‌ రవీంద్ర, డెవాన్‌ కాన్వే పవర్‌ ప్లేలో రాణించడం సానుకూలాంశం. బ్యాటింగ్‌ పరంగా మేము పర్లేదు. ముందుగా చెప్పినట్లు ఫీల్డింగ్‌లో మెరుగుపడాల్సి ఉంది’’ అని రుతురాజ్‌ గైక్వాడ్‌ పేర్కొన్నాడు. ఫీల్డింగ్‌ను ఆస్వాదిస్తేనే తప్పులు పునరావృతం కాకుండా ఉంటాయని.. టెన్షన్‌ పడితే మరిన్ని పొరపాట్లకు ఆస్కారం ఉంటుందే తప్ప లాభమేమీలేదని తమ ఫీల్డర్లకు సందేశం ఇచ్చాడు.

క్యాచ్‌లు డ్రాప్‌ చేసి.. మూల్యం చెల్లించారు
కాగా టాస్‌ ఓడి తొలుత బౌలింగ్‌ చేసిన సీఎస్‌కే ఆరంభంలోనే వరుస వికెట్లు తీసింది. కానీ యువ ఓపెనర్‌ ప్రియాన్ష్‌ ఆర్య మెరుపు సెంచరీ (42 బంతుల్లో 103)తో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. ఇన్నింగ్స్‌ రెండో బంతికే ఖలీల్‌ అహ్మద్‌ బౌలింగ్‌లో ప్రియాన్ష్‌ ఇచ్చిన క్యాచ్‌ను బౌలర్‌ మిస్‌ చేశాడు.

అదే విధంగా ఐదో ఓవర్‌ రెండో బంతికి స్టొయినిస్‌ ఇచ్చిన క్యాచ్‌ను విజయ​ శంకర్‌ వదిలేశాడు. అదే ఓవర్లో నాలుగో బంతికి ప్రియాన్ష్‌ బంతిని గాల్లోకిలేపగా.. శంకర్‌ మరోసారి డ్రాప్‌ చేశాడు. ఇక అశ్విన్‌ బౌలింగ్‌లో పన్నెండవ ఓవర్‌ రెండో బంతికి ప్రియాన్ష్‌ సిక్సర్‌ బాదగా.. బంతిని అందుకున్న ముకేశ్‌ చౌదరి బౌండరీ లైన్‌ను తాకాడు.

ఆ తర్వాత పదిహేడో ఓవర్‌లో నూర్‌ అహ్మద్‌ బౌలింగ్‌లో శశాంక్‌ సింగ్‌ ఇచ్చిన సిట్టర్‌ను రచిన్‌ రవీంద్ర డ్రాప్‌ చేశాడు. ఇలా సీఎస్‌కే ఫీల్డింగ్‌ తప్పిదాల వల్ల పంజాబ్‌ బ్యాటర్లు.. ముఖ్యంగా ప్రియాన్ష్‌ చాలాసార్లు లైఫ్‌ పొందాడు.  అతడికి తోడుగా లోయర్‌ ఆర్డర్‌ బ్యాటర్లు శశాంక్‌ సింగ్‌ (36 బంతుల్లో 52 నాటౌట్‌), మార్కో యాన్సెన్‌ (19 బంతుల్లో 34 నాటౌట్‌) దుమ్ములేపారు.

తప్పని ఓటమి
ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో సీఎస్‌కే ఐదు వికెట్లు నష్టపోయి 201 పరుగులకే పరిమితమై.. 18 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 

సీఎస్‌కే బ్యాటర్లలో ఓపెనర్లు రచిన్‌ రవీంద్ర (23 బంతుల్లో 36), డెవాన్‌ కాన్వే (49 బంతుల్లో 69 రిటైర్డ్‌ అవుట్‌), శివం దూబే (27 బంతుల్లో 42) ఫర్వాలేదనిపించారు. ఆఖర్లో ధోని మెరుపు ఇన్నింగ్స్‌ (12 బంతుల్లో 27) ఆడాడు. అయితే, వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ (1) మాత్రం మరోసారి విఫలమయ్యాడు.

చదవండి: గ్లెన్‌ మాక్స్‌వెల్‌కు షాకిచ్చిన బీసీసీఐ!
 

Videos

ఎక్కడ దాక్కున్నావ్ లోకేష్.. కొండారెడ్డి బురుజుకు ఇప్పుడురా..

సరదాకు ఉద్యమాలు చేయడం లేదు.. ఇంకెంతకాలం సాగదీస్తావ్ చంద్రబాబు

సాక్షి టీవీ సోషల్ మీడియా అకౌంట్లు బ్లాక్ చేయడం కూటమి పిరికి చర్య..

POLITICAL CORRIDOR: అవును వాళ్లిద్దరూ ఫ్రెండ్స్

మాజీ MLA మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అరెస్ట్

KPHBలో కారు బీభత్సం, డ్రైవర్ నిర్లక్ష్యం..8 కుటుంబాలకు..!

Russia Ukraine War : పుతిన్ ఆఫర్..యుద్ధం ముగిసేనా..?

స్టాక్ మార్కెట్ లో కోట్లు, మోహ్నిష్ పాబ్రాయ్ షాకింగ్ స్టాటజీ

లోకేష్ రాజీనామా చేయాలి

Photos

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు