టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?
Breaking News
మేం మీలా కాదు.. అంగళ్లు ఘటన మరిచిపోయారా?: వైఎస్సార్సీపీ
Published on Thu, 07/30/2026 - 11:18
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకాకుళం పర్యటన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. జగన్ ప్రజల్లోకి వెళ్లకుండా చంద్రబాబు ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఆంక్షలు విధిస్తోందని వైఎస్సార్సీపీ మండిపడుతోంది. పోలీసులు ఏర్పాటు చేస్తున్న నిబంధనలు భద్రతా చర్యల పేరుతో రాజకీయ నిర్బంధంగా మారుతున్నాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
జగన్ శ్రీకాకుళం పర్యటనకు సంబంధించి కాన్వాయ్ను పరిమితం చేయడం, రోడ్లపై బారికేడ్లు ఏర్పాటు చేయడం, నాయకులు, కార్యకర్తలతో పాటు సాధారణ ప్రజల రాకపోకలపై ఆంక్షలు విధించడం.. రాజకీయ నిర్బంధం కిందకే వస్తుందని, అది ప్రజాస్వామ్య హక్కులను అడ్డుకోవడమేనని వైఎస్సార్సీపీ అంటోంది. "జగన్ ప్రజల్లోకి వెళ్తే వాస్తవాలు బయటపడతాయనే భయంతోనే ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోంది" అని పార్టీ నేతలు చెబుతున్నారు.
మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినా వైఎస్ జగన్పై ఉన్న అభిమానాన్ని అడ్డుకోలేరన్నారు. జగన్ ఎక్కడికి వెళ్లినా ప్రజలు స్వచ్ఛందంగా తరలివస్తారని, ఆ జనాదరణ చూసే ప్రభుత్వం భయపడుతోందని అన్నారు. ఇటు..
సీదిరి అప్పలరాజు వ్యవహారంలో కూడా ప్రభుత్వం రాజకీయ కక్షతో వ్యవహరిస్తోందని వైఎస్సార్సీపీ అంటోంది. అలాగే ఒక ప్రజా ప్రతినిధితో ములాఖత్ కోసం వెళ్లే కార్యక్రమాన్ని కూడా రాజకీయ అంశంగా మార్చి ఆంక్షలు విధించడం సరికాదని పేర్కొంది. గత రెండేళ్లుగా వైఎస్సార్సీపీ నిర్వహించిన కార్యక్రమాలు ప్రజాస్వామ్య పద్ధతిలోనే జరిగాయని, ఎక్కడా హింసాత్మక ఘటనలకు తమ పార్టీ కారణం కాలేదని నేతలు స్పష్టం చేశారు.
అదే సమయంలో అధికార పార్టీ అధినేత చంద్రబాబు పర్యటన సమయంలో జరిగిన ఘటనలను ప్రస్తావిస్తూ వైఎస్సార్సీపీ విమర్శలు గుప్పించింది. అంగళ్లు తరహా ఘటనల్లో పోలీసులపై దాడులు, వాహనాల ధ్వంసం వంటి ఘటనలు జరిగాయని గుర్తు చేసింది. తమ కార్యక్రమాలపై మాత్రమే ఆంక్షలు విధించడం వివక్షపూరిత వైఖరి అని ఆరోపించింది. "ప్రభుత్వానికి సహకరిస్తున్నప్పటికీ.. అధికార యంత్రాంగం అనవసర ఆంక్షలతో వ్యవహరిస్తోంది. ప్రజల మధ్యకు వెళ్లే హక్కును ఎవరూ అడ్డుకోలేరు" అని వైఎస్సార్సీపీ నేతలు అన్నారు.
చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉండగా.. అంగళ్లు, పుంగనూరు ఘటనల్లో రాజకీయ ఘర్షణలు చోటుచేసుకుని రాళ్ల దాడులు జరిగాయి. టీడీపీ శ్రేణులు జరిపిన దాడుల్లో.. పలువురు పోలీసులు గాయపడగా, ఏఆర్ కానిస్టేబుల్ రణధీర్ ఒక కన్ను చూపు శాశ్వతంగా కోల్పోయారు. ఈ వ్యవహారంలో చంద్రబాబుపై అప్పట్లో కేసు కూడా నమోదు అయ్యింది.
Tags : 1