Breaking News

చంద్రబాబు చెవిలోనైనా ఆ విషయం చెబుతారా?

Published on Sat, 04/19/2025 - 13:37

భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర  మోదీ తెలంగాణ  ప్రభుత్వంపై చేసిన  సంచలన వ్యాఖ్యలు ఆశ్చర్యంగా ఉన్నాయి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ వద్ద  కంచ గచ్చిబౌలి వద్ద ఉన్న 400 ఎకరాల భూమికి సంబంధించి ఒకవైపు సుప్రింకోర్టు విచారణ జరుపుతుండగా, ప్రధానమంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్న తలెత్తుతుంది. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం అడవులపై బుల్డోజర్లు ప్రయోగిస్తోందని మోదీ ఆరోపించారు. అక్కడ జంతువులను  ప్రమాదంలో పడేసేలా రాష్ట్ర  ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. తాము పర్యావరణాన్ని కాపాడుతుంటే, కాంగ్రెస్ ప్రభుత్వం అటవీ సంపదను నాశనం చేస్తోందని ఆయన ధ్వజమెత్తారు. అయితే.. 

.. ఏపీలో కూటమి ప్రభుత్వం(AP Kutami Prabhutvam) ఇప్పటికే  33 వేల ఎకరాల పచ్చటి పంటల భూములను పర్యావరణంతో సంబంధం లేకుండా నాశనం చేస్తే మద్దతు ఇచ్చిన బీజేపీ పెద్దలకు..  ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి నైతికంగా అర్హత ఎంత మేర ఉంటటుందన్నది ఆలోచించుకోవాలి. అది చాలదన్నట్లుగా మరో 45 వేల ఎకరాలు సమీకరిస్తామని బాబు సర్కార్ చెబుతుంటే కనీసం స్పందించని బీజేపీ.. తెలంగాణలో రాజకీయ ప్రయోజనాల కోసం విమర్శలు చేస్తోందన్న  అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

👉అయినా తెలంగాణలో బీజేపీ నేతలు ప్రతిపక్షంలో ఉన్నారు కనుక విమర్శలు, ఆరోపణలు చేస్తే చేయవచ్చు. కాని దేశ ప్రధాని అంతటివారు ఈ వివాదంలో వేలు పెట్టడం పద్దతేనా?. అది సుప్రీం కోర్టు విచారణను ప్రభావితం చేసే  అవకాశం ఉంటుందా? ఉండదా? అనే చర్చకు ఆస్కారం ఇస్తోంది.  హామీలు అమలు చేయకుండా రేవంత్ సర్కార్ బుల్డోజర్లను వాడుతోందని ఆయన ఎద్దేవా చేశారు. బీజేపీ పాలిత ప్రాంతాలలో అభివృద్ది పరుగులు  తీస్తోందని ఆయన  అన్నారు.  బీజేపీ రాష్ట్రాలను పొగుడుకుంటే పొగుడుకోవచ్చు. కాని ప్రతిపక్షాలు పాలిస్తున్న  రాష్ట్రాలపై మోదీ అధిక విమర్శలు చేయడం ద్వారా ఆయనలోని రాజకీయ నేత కోణం అంతగా మంచి పేరు తేకపోవచ్చు. 

ఉత్తరప్రదేశ్ తదితర కొన్ని బీజేపీ పాలిత రాష్ట్రాలలో  నేరస్తుల పేరుతో ఇళ్లను  ఇష్టారాజ్యంగా కూల్చివేస్తున్న తీరుపై చాలా అసంతృప్తి ఉంది. సుప్రీంర్టు  సైతం దీనిపై పలుమార్లు  వ్యతిరేక వ్యాఖ్యలు చేసింది. ఆ విషయాలను మోదీ గమనంలోకి తీసుకుంటారో లేదో తెలియదు. రేవంత్ ప్రభుత్వం కంచ గచ్చి బౌలి భూముల విషయంలో అనుసరిస్తున్న  వైఖరి సరైనదా? కాదా? అనేది ఇక్కడ చర్చ కాదు. దానిని సమర్ధించవచ్చు. వ్యతిరేకించవచ్చు. స్థానిక ప్రజలు తమ అభీష్టాన్ని ప్రభుత్వానికి చెప్పవచ్చు. అది వేరే సంగతి. కాని గతంలో  దేశ ప్రధానులలో ఎవరూ ఇలా రాష్ట్రాలపై తరచు విమర్శలు చేసినట్లు  అనిపించదు. ఎన్నికల సమయంలో పార్టీ పరంగా, విధానపరంగా విమర్శలు,ప్రతి విమర్శలు చేయడానికి వారు ప్రాధాన్యత ఇచ్చి ఉండవచ్చు. అంతే తప్ప, ఏ  రాష్ట్రానికి వెళ్లినా అదే పనిలో ఉండడం గతంలో ఈ స్థాయిలో ఉండేది కాదని చెప్పవచ్చు. లేదా మహా అయితే పరోక్షంగా ఏమైనా ఒకటి,రెండు విమర్శలు చేసి ఉండొచ్చు. 

👉మన్మోహన్ సింగ్(Manmohan Singh) ప్రధానిగా ఉన్నప్పుడు బీజేపీ  పాలిత రాష్ట్రాలపై పనికట్టుకుని ఆరోపణలు చేసేవారుకాదు. కాకపోతే సింగ్ బ్యూరోక్రాట్ నుంచి రాజకీయనేతగా మారారు. మోదీ మొదట ఆర్ఎస్ఎస్ లో ఉండి ,తదుపరి రాజకీయ నేతగా ఎదిగారు. ఆ సంగతి ఎలా ఉన్నా, తెలంగాణలోని కంచ గచ్చిబౌలి వద్ద 400 ఎకరాల భూమిపై వివాదం ఏర్పడిన  మాట నిజం. ఆ భూములలోఎలాంటి పనులు చేపట్టవద్దని పలువురు  కోరిన సంగతి కూడా నిజమే. దానిపై కేంద్రప్రభుత్వపరంగా ఏవైనా ఆలోచనలు ఉంటే వాటిని సజెస్ట్ చేస్తూ రాష్ట్రానికి లేఖ రాసి ఉండవచ్చు. కాని అవేవీ చేయలేదు. 

👉తెలంగాణ బీజేపీ నేతలు(Telangana BJP) ఏ విమర్శలు చేశారో వాటినే ప్రధాని మోదీ కూడా చేశారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్నదాని ప్రకారం అవి అసలు అటవీశాఖ భూములే కాదు. ప్రభుత్వ భూములని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తర్వాతే అక్కడ కొన్ని కార్యకలాపాలు చేపట్టడం జరిగింది. ఆ భూముల ఆధారంగా  పదివేల కోట్ల రుణ సమీకరణ కూడా చేశారు. ఈలోగా దీనిపై యూనివర్శిటీలో విద్యార్దులు వ్యతిరేకించి ,ఆ భూమి కూడా సెంట్రల్  యూనివర్శిటీకి అప్పగించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. దానికి బీజేపీ, బీఆర్‌ఎస్‌లు  మద్దతు ఇవ్వడం, సడన్‌గా సుప్రీం కోర్టు కూడా సుమోటోగా జోక్యం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసు ఇవ్వడం జరిగింది. దీనికి రేవంత్ సర్కార్ బదులు ఇస్తూ  కంచగచ్చిబౌలి(kanche Gachibowli) భూములు అటవీ భూములు కాదని, ప్రభుత్వం అధీనంలో ఉన్న భూములని స్పష్టం చేసింది.  అక్కడ జంతువులకు ఆవాసం లేదని,వాటికి  తగు  రక్షణ  కల్పించడానికి ప్రత్యామ్నాయం ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం తెలిపింది. 

👉ఇక్కడ కొట్టేసిన  చెట్లు నిషేదిత జాబితాలో లేవని కూడా ప్రభుత్వం చెబుతోంది.  అయితే సుప్రీం కోర్టు దీనిపై కూడా అంత సంతృప్తి చెందలేదు. చెట్లు కొట్టివేయడానికి అనుమతులు ఉన్నాయా అని ప్రశ్నించింది. ఆ కేసు ఇంకా పూర్తి కాలేదు..కాని ఈలోగా ప్రధాని మోదీ అవి అడవులని, అక్కడ జంతువులు ఉన్నాయని, అడవిని, జంతువులను కాంగ్రెస్ ప్రభుత్వం హరిస్తోందని రాజకీయంగా మాట్లాడడం పద్దతేనా అనే  అభిప్రాయం కలుగుతుంది. తెలంగాణలో అధికారం సాధించాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తుండవచ్చు. దానికి తగిన విధంగా రాజకీయ వ్యూహాలు అమలు చేస్తుంటారు. తెలంగాణకు వచ్చినప్పుడు కాంగ్రెస్‌పై మోదీ విమర్శలు చేస్తే అదో తరహా. కాని ఎక్కడో హర్యానాలో ఒక సభలో మాట్లాడుతూ ఈ విమర్శలు చేశారు. 

నిజంగానే  పర్యావరణంపైన ప్రధానమంత్రికి అంత శ్రద్దాసక్తులు  ఉన్నట్లయితే ఏపీలో రాజధాని పేరుతో 33వేల ఎకరాలు సమీకరించినప్పుడు బిజెపి ఎందుకు అభ్యంతరం చెప్పలేదు?. మోదీ స్వయంగా వచ్చి శంకుస్థాపన చేసి వెళ్లారే. అవసరమైనమేర ప్రభుత్వ భూమిని వాడుకుంటే మంచిదని అప్పట్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మోడీ ఎందుకు సలహా ఇవ్వలేదు. ఆ తర్వాత టీడీపీ, బీజేపీ విడిపోయాక.. పోలవరం, అమరావతి టీడీపీ నేతలకు  ఏటీఎంగా మారాయని ఆయనే ఆరోపించారు కదా?. ఆ తర్వాత 2024లో మళ్లీ పొత్తు  పెట్టుకున్నాక అవన్ని తూచ్ అయిపోయినట్లనుకోవాలా?. 

ఇంతకుముందు తీసుకున్న  33 వేల ఎకరాలు  కాకుండా,మరో 45వేల ఎకరాల భూమి సమీకరించడానికి చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నించడం సరైనదా? కాదా? అనేదానిపై మోదీ మాట్లాడడానికి సిద్దంగా ఉంటారా?. మరోసారి రాజధాని పనులకు శంకుస్థాపన చేయడానికి ప్రధాని మే 2 న వస్తారట.అప్పుడైనా   పర్యావరణానికి విఘాతం కలిగేలా ఇన్నివేల ఎకరాల భూములు  ఎందుకు?అక్కడ పంటలను ఎందుకు నాశనం చేస్తున్నారు? పక్కనే ఉన్న కృష్ణానది మరింత కలుషితంగా మారడానికి ఈ చర్య అవకాశం ఇస్తుంది కదా? అని ప్రధాని ప్రశ్నించితే..  తెలంగాణ భూములపై చేసిన వ్యాఖ్యలను  సమర్దించవచ్చు. అలా కాకపోతే అవకాశవాద రాజకీయాలకే ప్రధాని ప్రాధాన్యం ఇస్తున్నారన్న సంగతి ప్రజలకు తెలిసిపోదా?. 

తెలంగాణలో ఒక రకంగా, ఏపీలో మరో రకంగా మాట్లాడితే మోదీకి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.., ఉప ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లకు మద్య తేడా ఏముంటున్నదన్న  ప్రశ్న వస్తుంది. ఏది ఏమైనా  ప్రతి అంశంలోను పార్టీపరంగా కాకుండా దేశ ,రాష్ట్ర ప్రయోజనాలను గమనంలోకి తీసుకుని ప్రధాని మోదీ వ్యవహరిస్తే  బాగుంటుంది కదా!

:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)