తొలి బడ్జెట్‌ ప్రవేశపెట్టిన విజయ్‌ సర్కార్‌

Published on Wed, 08/05/2026 - 11:39

చెన్నై: తమిళనాడులో కొత్త రాజకీయ శకానికి తెరలేపుతూ.. ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) ప్రభుత్వం తన తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి ఎన్‌. మరియా విల్సన్‌ బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు, మహిళా సాధికారత, విద్య, యువత ఉపాధి, ఆరోగ్యం, క్రీడలకు పెద్దపీట వేస్తూ బడ్జెట్‌ రూపొందించారు.

ప్రజా సంక్షేమమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్న ఆర్థిక మంత్రి విల్సన్‌.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను గాడిలో పెట్టడంతో పాటు పారదర్శక పాలనకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ఆ సమయంలో సీఎం విజయ్‌పై ఆయన ప్రశంసలు గుప్పించారు.

మహిళలకు బంగారం.. పెళ్లి కానుక
TVK ఎన్నికల హామీల్లో కీలకమైన ‘అన్నన్‌ సీర్‌ తిట్టం’ పథకానికి బడ్జెట్‌లో రూ.812 కోట్లు కేటాయించారు. ఈ పథకం కింద అర్హులైన మహిళలకు వివాహ సమయంలో 8 గ్రాముల (ఒక సవరన్‌) బంగారు నాణెం, పట్టు చీర అందించనున్నారు. అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించే లక్ష్యంతో ‘తై మామన్‌ తంగా మోదిరం తిట్టం’ పథకాన్ని ప్రకటించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో జన్మించే ప్రతి శిశువుకు ఒక గ్రాము బంగారు ఉంగరం అందించనున్నారు. ఈ పథకానికి రూ.560 కోట్లు కేటాయించారు.

విద్యకు భారీ కేటాయింపులు
విద్యారంగానికి బడ్జెట్‌లో అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. పాఠశాల విద్యాశాఖకు రూ.44,527 కోట్లు, ఉన్నత విద్యాశాఖకు రూ.8,393 కోట్లు కేటాయించారు. కళాశాల విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు అందించే ‘వెట్రి ల్యాప్‌టాప్‌ పథకం’ కోసం రూ.2 వేల కోట్లు కేటాయించారు. డిజిటల్‌ విద్యను బలోపేతం చేయడమే ఈ పథకం లక్ష్యమని ప్రభుత్వం తెలిపింది.

ప్రభుత్వ పాఠశాలల ఆధునీకరణకు ‘పళ్లి నిరైవు తిట్టం’ కింద రూ.300 కోట్లు కేటాయించారు. మొత్తం 3,734 ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాగే ‘సూపర్‌ క్లీన్‌.. సూపర్‌ క్యాంపస్‌’ పథకం కింద తొలిదశలో 10 వేల పాఠశాలల్లో పరిశుభ్రత, తాగునీరు, మరుగుదొడ్ల నిర్వహణ, భద్రత కోసం రూ.139 కోట్లు కేటాయించారు.

విద్యార్థులకు సైకిళ్లు.. కొత్త హాస్టళ్లు
11వ తరగతి విద్యార్థులకు హెల్మెట్‌, వాటర్‌ బాటిల్‌తో కూడిన సైకిళ్లు అందించే ‘పుతియా పయనం.. పుతియా వేగం’ పథకానికి రూ.277 కోట్లు కేటాయించారు. దీని ద్వారా 5.3 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కలగనుంది. విద్యార్థుల వసతి సదుపాయాల కోసం తమిళనాడు స్టూడెంట్‌ హాస్టల్స్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. TN-SUDAR పథకం కింద 200 ఆధునిక హాస్టళ్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

యువతకు స్కిల్‌ ట్రైనింగ్‌
ఉద్యోగ అవకాశాలు పెంచేందుకు ‘వెట్రి స్కిల్‌ ట్రైనింగ్‌ స్కీమ్‌’ను ప్రకటించారు. 13 లక్షల మంది యువతకు పరిశ్రమలకు అనుగుణమైన నైపుణ్య శిక్షణ అందించనున్నారు. తొలి దశలో 20 వేల మంది యువతకు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల సహకారంతో ఇంటర్న్‌షిప్‌ అవకాశాలు కల్పించనున్నారు. ఇందుకోసం రూ.150 కోట్లు కేటాయించారు. ఇంజినీరింగ్‌, పాలిటెక్నిక్‌, ఐటీఐ విద్యార్థులు, అధ్యాపకులకు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) శిక్షణ అందించే ప్రణాళికను కూడా ప్రభుత్వం ప్రకటించింది.

క్రీడలకు ప్రోత్సాహం
క్రీడారంగ అభివృద్ధికి పెద్దపీట వేస్తూ రాష్ట్రవ్యాప్తంగా 10 ఒలింపిక్‌ సెంటర్స్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇందుకోసం రూ.50 కోట్లు కేటాయించారు. తమిళనాడు క్రీడాకారులను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దడమే లక్ష్యమని ప్రభుత్వం పేర్కొంది.

ఆరోగ్య రంగానికి రూ.23 వేల కోట్లకు పైగా
వైద్యం, ప్రజారోగ్య శాఖకు రూ.23,353 కోట్ల నిధులు కేటాయించారు. గర్భిణుల కోసం ‘తై కేర్‌’ పేరుతో ప్రత్యేక సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ప్రసవ సమయం దగ్గర పడిన మహిళలకు ఉచిత భోజనం, వైద్య సహాయం, ఆరోగ్య పర్యవేక్షణ అందించనున్నారు. వృద్ధుల కోసం దశలవారీగా 1,000 మొబైల్‌ జెరియాట్రిక్‌ ట్రీట్‌మెంట్‌ సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు. ప్రతి కేంద్రంలో వైద్యుడు, నర్సు, ఫిజియోథెరపిస్ట్‌ సేవలు అందుబాటులో ఉంటాయి.

NEET‌పై మరోసారి వ్యతిరేకత
బడ్జెట్‌ ప్రసంగంలో NEET‌ పరీక్షపై TVK ప్రభుత్వం తన వైఖరిని మరోసారి స్పష్టం చేసింది. వైద్య ప్రవేశాలను 12వ తరగతి మార్కుల ఆధారంగా పాత విధానంలోనే నిర్వహించేలా NEET‌ను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.

కేజీ నుంచి లా వరకు కొత్త ప్రకటనలు
మదురైలో 300 మంది విద్యార్థుల సామర్థ్యంతో ప్రత్యేక ప్రభుత్వ లా కాలేజీ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఐదు కొత్త ఇండస్ట్రియల్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లు (ITI) ఏర్పాటు చేయడానికి రూ.90 కోట్లు కేటాయించారు. అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థుల కోసం ‘అన్నల్‌ అంబేద్కర్‌ ఓవర్సీస్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ స్కాలర్‌షిప్‌’ పథకం కింద ఒక్కో విద్యార్థికి గరిష్ఠంగా రూ.36 లక్షల వరకు సాయం అందించనున్నారు.

పారదర్శక పాలనపై ఫోకస్‌
గత ప్రభుత్వ పాలనలో టెండర్ల కేటాయింపుల్లో కొందరు వ్యక్తులు, వర్గాలకు ప్రయోజనం కలిగించే ‘కట్‌’ విధానం ఉండేదని ఆర్థిక మంత్రి విమర్శించారు. అలాంటి విధానాలకు ముగింపు పలికి.. టెండర్ల ప్రక్రియలో పారదర్శకత తీసుకొచ్చామని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు పన్ను, పన్నేతర ఆదాయాలను పెంచే చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. గత ఐదేళ్లలో తమిళనాడు అప్పులు పెరిగాయని, వాటిని నియంత్రిస్తూ అభివృద్ధి కొనసాగిస్తామని తెలిపారు.

ఇతర హైలైట్స్‌

* EV ఛార్జింగ్‌ స్టేషన్ల కోసం రూ.50 కోట్లు కేటాయింపు
* ఐదేళ్లలో 20 వేల పబ్లిక్‌ EV ఛార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటు లక్ష్యం
* మైనారిటీ సంక్షేమం కోసం రూ.1,700 కోట్లు
* హజ్‌ యాత్ర సబ్సిడీని రూ.25 వేల నుంచి రూ.35 వేలకు పెంపు
* సామాజిక న్యాయ శాఖకు రూ.3,937 కోట్లు
* దివ్యాంగుల సంక్షేమ శాఖకు రూ.1,485 కోట్లు
* డ్రగ్‌ ఫ్రీ తమిళనాడు కార్యక్రమం కోసం ప్రత్యేక చర్యలు

మొత్తంగా.. విజయ్‌ సర్కార్‌ తొలి బడ్జెట్‌ ఎన్నికల హామీల అమలు, సంక్షేమ పథకాల విస్తరణ, యువత-మహిళల సాధికారత, డిజిటల్‌ విద్య, పారదర్శక పాలన చుట్టూ తిరిగింది. తొలి బడ్జెట్‌తోనే తమ ప్రభుత్వ ప్రాధాన్యతలను ప్రజలకు స్పష్టం చేసే ప్రయత్నం చేసింది.

Videos

వైరల్ వీడియో వోడ్కా తాగి వైన్స్ లోనే పడుకున్న కోతి

మంత్రి నారాయణ పై సిట్ విచారణ జరపాలి అమరావతి రైతుల కీలక డిమాండ్

ఊహించని ఊచకోత.. అప్పుడే రూ.100 కోట్లు

దానంకు ఖైరతాబాద్ టికెట్ టెన్షన్

కర్నూలులో పట్టపగలే చోరీ.. రైతు బైక్ నుంచి రూ.2 లక్షలు మాయం

చింతమనేని నీకే చెప్తున్నా దెందులూరు గడ్డ సాక్షిగా.. నెక్స్ట్ లెవెల్ వార్నింగ్

గణేష్ నిమజ్జనంలో దుమ్మురేపిన హైదరాబాద్ లేడీ పోలీస్ డాన్స్

KAAKA నుంచి క్రేజీ అప్డేట్

మధుబాబును సస్పెండ్ చేసిన కూటమి ప్రభుత్వం ఉద్యోగ సంఘాల ఆగ్రహం

ఉండ్రాజవరంలో హైటెన్షన్.. పోలీసులకు వంగవీటి కూతురు మాస్ వార్నింగ్

Photos

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’ సక్సెస్‌ మీట్‌ (ఫొటోలు)

+5

‘సిగ్మా’ ప్రీ-రిలీజ్ వేడుకలో మెరిసిన ఫరియా అబ్దుల్లా (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఇంకా కొనసాగుతున్న గణేష్ నిమజ్జనాలు.. ట్యాంక్ బండ్ వద్ద భారీ క్యూ...(ఫొటోలు)

+5

చూడప్పా సిద్ధప్పా.. సింహం గడ్డం గీసేసిందప్పా! (ఫొటోలు)

+5

'సిగ్మా' సినిమా ప్రీ-రిలీజ్ వేడుక (ఫొటోలు)

+5

ఖైరతాబాద్ గణేశుడి సేవలో టాలీవుడ్ హీరోయిన్ (ఫొటోలు)

+5

హైదరాబాదులో వినాయక నిమజ్జనం సందడి..(ఫొటోలు)

+5

ఖైరతాబాద్‌ మహా గణపతి నిమజ్జనం దృశ్యాలు..(ఫొటోలు)

+5

'ప్యారడైజ్'లో సమ్మక్క పాత్ర.. నటి జ్ఞాపకాలు (ఫొటోలు)