పోక్సో చట్టం.. కవచమా? కాగితపు పులినా?

Published on Sat, 07/11/2026 - 07:57

పోక్సో కేసులో అరెస్టై బెయిల్‌పై విడుదలైన నిందితుడు ప్రతీకారంతో ఆరుగురిని కిరాతకంగా హత్య చేయడం.. అందునా బాధిత బాలికను అపహరించి అత్యాచారం చేసి హతమార్చిన ఘటన తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. పోక్సో.. పిల్లలకు కవచమా? నిందితులకు అవకాశమా? తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో జరిగిన సామూహిక హత్యలు ఈ ప్రశ్నను మరోసారి దేశం ముందుకు తెచ్చాయి. దీంతో పిల్లల రక్షణ కోసం రూపొందించిన కఠిన ‘పోక్సో’ చట్టం అమలులో ఏ మేర లోపాలున్నాయి? మైనర్లకు రక్షణ కల్పించాల్సింది బదులు నిందితులకు అవకాశంగా మారుతున్నాయా? అనే చర్చ మళ్లీ తెరపైకి వచ్చింది.

మన దేశంలో 2012లో లైంగిక దాడుల్లో మైనర్ల రక్షణ కోసం ప్రొటెక్షన్‌ ఆఫ్‌ చిల్డ్రన్‌ ఫ్రమ్‌ సెక్సువల్‌ అఫెన్సెస్‌ (POCSO) యాక్ట్‌ అమల్లోకి వచ్చింది. ఇదే ఏడాది డిసెంబర్‌లో దేశాన్ని కుదిపేసిన నిర్భయ ఘటన జరిగింది. ఈ రెండు సంఘటనలను చాలామంది ఒకటిగా భావిస్తుంటారు. కానీ వాస్తవానికి పోక్సో చట్టం నిర్భయ ఘటనకు కొన్ని నెలల ముందే (2012 నవంబర్‌ 14 నుంచి) అమల్లోకి వచ్చింది. అయితే నిర్భయ ఘటన తర్వాత మహిళల భద్రత, లైంగిక నేరాలపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరగడంతో పోక్సో చట్టం అమలు మరింత కఠినంగా మారింది. 

2019లో కేంద్ర ప్రభుత్వం పోక్సోకు కొన్ని సవరణలు చేసి, కొన్ని తీవ్రమైన కేసుల్లో మరణశిక్ష వరకు విధించే అవకాశాన్ని కూడా చట్టంలో చేర్చింది.

పోక్సో ప్రత్యేకత ఏంటి?
ఈ చట్టం ప్రకారం 18 ఏళ్లలోపు ప్రతి బాలుడు, బాలికకు ప్రత్యేక రక్షణ ఉంటుంది. శారీరక దాడితో పాటు లైంగిక వేధింపులు, అశ్లీల ప్రదర్శనలు, ఆన్‌లైన్‌ లైంగిక వేధింపులు, పిల్లల అశ్లీల చిత్రాల తయారీ, వినియోగం వంటి అనేక నేరాలను ఇందులో స్పష్టంగా నిర్వచించారు. అలాగే ప్రత్యేక పోక్సో కోర్టులు, ఇన్‌కెమెరా విచారణ, బాధితుడి గుర్తింపు గోప్యంగా ఉంచడం, పిల్లలకు అనుకూలమైన విచారణ విధానం వంటి అంశాలు ఈ చట్టంలో ఉన్నాయి.

పోక్సోకు ముందు పరిస్థితి ఏంటి?
చాలామందికి ఉన్న అపోహ ఏమిటంటే.. పోక్సోకు ముందే పిల్లలపై లైంగిక నేరాలకు చట్టమే లేదనేది. కానీ అది నిజం కాదు. పోక్సోకు ముందు కూడా భారతీయ శిక్షాస్మృతి (IPC) కింద అత్యాచారం, అసభ్య ప్రవర్తన, వేధింపులు, కిడ్నాప్‌ వంటి సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి శిక్షలు విధించేవారు. అయితే ఆ చట్టాల్లో పిల్లల కోసం ప్రత్యేక నిర్వచనాలు, ప్రత్యేక రక్షణలు, ప్రత్యేక విచారణ విధానం లేవు. ముఖ్యంగా అబ్బాయిలపై జరిగే లైంగిక దాడులు, శారీరక సంబంధం లేకుండా జరిగే లైంగిక వేధింపులు, పిల్లలను అశ్లీల చిత్రాల్లో ఉపయోగించడం వంటి అనేక నేరాలకు స్పష్టమైన చట్టపరమైన నిర్వచనం లేకపోవడంతో నిందితులు శిక్ష నుంచి తప్పించుకునే అవకాశాలు ఉండేవి.

పోక్సో వచ్చాక కూడా.. బెయిల్‌ ఎలా?
పోక్సో కేసు అంటే బెయిల్‌ రాదనుకోవడం సరికాదు. నేర తీవ్రత, సాక్ష్యాలు, దర్యాప్తు దశ, నిందితుడు సాక్షులను ప్రభావితం చేసే అవకాశం, బాధితుల భద్రత వంటి అంశాలను పరిశీలించిన తర్వాత కోర్టులు బెయిల్‌పై నిర్ణయం తీసుకుంటాయి. అంటే చట్టం బెయిల్‌ను పూర్తిగా నిషేధించలేదు. అయితే బెయిల్‌ మంజూరు చేసే సమయంలో విధించే షరతులు, వాటి అమలు చాలా కీలకం. షాబాద్‌ కేసులో..రాజశేఖర్‌ విషయంలో ఇదే జరిగి ఉంటుంది.

చట్టంలో లోపమా.. అమలులో లోపమా?
న్యాయ నిపుణుల అభిప్రాయం ప్రకారం సమస్య ఎక్కువగా చట్టంలో కంటే అమలులోనే ఉంది. బెయిల్‌పై విడుదలైన నిందితులపై నిరంతర నిఘా, బాధిత కుటుంబాలకు రక్షణ, నిందితుడు బాధితులను సంప్రదించకుండా కఠిన ఆంక్షలు అమలు చేయడం, అవసరమైతే ఎలక్ట్రానిక్‌ మానిటరింగ్‌ వంటి వ్యవస్థలు మన దేశంలో ఇంకా పరిమితంగానే ఉన్నాయి.

ఇలాంటి చర్చ ఇదే తొలిసారి కాదు. పోక్సో చట్టం అమలు, దాని వ్యాఖ్యానంపై గతంలోనూ దేశవ్యాప్తంగా పలు సందర్భాల్లో తీవ్ర చర్చ జరిగింది. 2021లో బాంబే హైకోర్టు నాగ్‌పూర్‌ బెంచ్‌ ఇచ్చిన 'స్కిన్‌-టు-స్కిన్‌ కాంటాక్ట్‌' తీర్పు దేశవ్యాప్తంగా వివాదానికి దారితీసింది. బట్టలపై నుంచి తాకితే అది పోక్సో కింద లైంగిక దాడి కాదన్న వ్యాఖ్యలపై బాలల హక్కుల సంస్థలు, న్యాయ నిపుణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అనంతరం సుప్రీంకోర్టు ఆ తీర్పును కొట్టివేస్తూ.. లైంగిక ఉద్దేశంతో పిల్లలను తాకే ఏ చర్య అయినా పోక్సో పరిధిలోకే వస్తుందని స్పష్టం చేసింది. అలాగే పోక్సో కేసుల్లో బెయిల్‌పై విడుదలైన నిందితులు బాధితులను బెదిరించడం, సాక్షులపై ఒత్తిడి తీసుకురావడం వంటి ఘటనలు కూడా గతంలో పలు రాష్ట్రాల్లో వెలుగుచూశాయి. దీంతో బెయిల్‌ షరతులను మరింత కఠినతరం చేయడం, బాధిత కుటుంబాలకు రక్షణ కల్పించడం, విడుదలైన నిందితులపై నిరంతర పర్యవేక్షణ ఉండాలన్న డిమాండ్‌ అప్పట్లోనే వినిపించింది.

విదేశాల్లో ఎలా ఉంటుంది?

  • అమెరికాలో పిల్లలపై లైంగిక నేరాలకు పాల్పడిన వారిని రికార్డుల్లో(Sex Offender Registry)లో నమోదు చేసి.. విడుదల తర్వాత కూడా ఏళ్ల తరబడి పర్యవేక్షిస్తారు. పిల్లల పాఠశాలలు, పార్కులు, నివాస ప్రాంతాలకు వెళ్లకుండా కోర్టులు ఆంక్షలు విధిస్తాయి.

  • బ్రిటన్‌లో ఎస్‌హెచ్‌పీవో( Sexual Harm Prevention Orders) ద్వారా నిందితుల కదలికలు, పిల్లలతో సంబంధాలు, ఇంటర్నెట్‌ వినియోగంపైనా పరిమితులు విధించవచ్చు.

  • ఆస్ట్రేలియాలో కొన్ని స్టేట్స్‌లో విడుదలైన లైంగిక నేరస్థులపై ఎలక్ట్రానిక్‌ ట్రాకింగ్‌, పోలీసు పర్యవేక్షణ వంటి చర్యలు అమల్లో ఉన్నాయి.

భారత్‌లో చట్టం బలహీనమా?
శిక్షల పరంగా చూస్తే భారత పోక్సో చట్టం ప్రపంచంలోనే కఠినమైన చట్టాల్లో ఒకటి. తీవ్రమైన కేసుల్లో జీవిత ఖైదు, కొన్ని సందర్భాల్లో మరణశిక్ష కూడా విధించే అవకాశం ఉంది. కానీ నిపుణులు చెబుతున్నది ఒక్కటే. చట్టం కఠినంగా ఉండటం మాత్రమే సరిపోదు. బెయిల్‌పై బయటకు వచ్చిన నిందితులపై కఠిన నిఘా, బాధిత కుటుంబాల భద్రత, వేగవంతమైన విచారణ, సాక్షుల రక్షణ వంటి అంశాలు కూడా అంతే బలంగా అమలు కావాలి.

షాబాద్‌ ఘటన చెబుతున్న పాఠం
షాబాద్‌ సామూహిక హత్యలు కేవలం ఒక నేర ఘటన మాత్రమే కాదు. పిల్లల రక్షణ కోసం రూపొందించిన చట్టం అమలు విషయంలో ఉన్న లోటుపాట్లను మరోసారి గుర్తు చేశాయి. పోక్సోను మరింత కఠినతరం చేయాలా? లేదంటే ఇప్పటికే ఉన్న చట్టాన్ని మరింత సమర్థంగా అమలు చేయాలా? అనే చర్చ ఇప్పుడు దేశవ్యాప్తంగా మొదలైంది. న్యాయ నిపుణుల అభిప్రాయం ప్రకారం, చట్టం కంటే దాని అమలు, బెయిల్‌ తర్వాత నిందితుల పర్యవేక్షణ, బాధిత కుటుంబాల భద్రతను బలోపేతం చేయడంపైనే ప్రభుత్వం ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.

:::వెబ్‌ ప్రత్యేకం

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)