నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా
Breaking News
విజయ్ బిగ్ మూవ్.. ఇరకాటంలో కాంగ్రెస్!
Published on Fri, 06/19/2026 - 12:36
కావేరీ నది జలాలపై కర్ణాటక ప్రభుత్వం చేపట్టాలని భావిస్తున్న మేకెదాటు డ్యామ్ ప్రాజెక్ట్‌కు వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీ శుక్రవారం ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించింది. ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ ఈ తీర్మానాన్ని సభలో ప్రవేశపెడుతూ.. కేంద్రం కూడా ఎలాంటి అనుమతులు ఇవ్వకూడదని తన రాష్ట్ర రైతుల హక్కులను కాపాడే దిశగా గట్టి వైఖరి ప్రదర్శించారు.
కర్ణాటక ప్రభుత్వం రూ. 9,000 కోట్ల వ్యయంతో చేపట్టే ఈ జలాశయ ప్రాజెక్ట్ ఏకపక్ష చర్యగా ఉందని ఆ తీర్మానంలో తమిళనాడు ఆరోపించింది. కావేరీ జల వివాద ట్రైబ్యునల్ తీర్పు (2007).. అలాగే సుప్రీంకోర్టు తీర్పు (2018)ను ఉల్లంఘించే ప్రయత్నంగా ఈ ప్రాజెక్ట్ ముందుకు సాగుతోందని తీర్మానంలో సీఎం విజయ్ పేర్కొన్నారు.
ఈ తీర్మానం ప్రకారం కావేరీ బేసిన్ ఇప్పటికే నీటి కొరత ఉన్న ప్రాంతమని, అందుబాటులో ఉన్న నీరు రాష్ట్రాల మధ్య పంచబడిపోయిందని ఆయన పేర్కొన్నారు. అందువల్ల కొత్త ప్రాజెక్టులు లేదా అదనపు నీటి వినియోగానికి అవకాశం లేదని స్పష్టం చేశారు. అలాగే కేంద్ర ప్రభుత్వాన్ని మేకెదాటు ప్రాజెక్ట్‌కు ఎలాంటి అనుమతులు, సాంకేతిక లేదంటే పర్యావరణ క్లియరెన్స్‌లు ఇవ్వకూడదని తమిళనాడు అసెంబ్లీ తరఫున కోరారాయన. కేంద్ర జల సంఘం కూడా ఈ ప్రాజెక్ట్ వివరాల నివేదికను పరిశీలించకూడదని తీర్మానంలో సూచించారు.
నీరు అనేది ప్రజల ప్రాథమిక హక్కు అని, దాన్ని కాపాడటం తమ ప్రభుత్వ బాధ్యత అని సీఎం విజయ్ స్పష్టం చేశారు. రాజకీయ భేదాలు ఉన్నా ప్రజల ప్రయోజనాల విషయంలో అందరూ ఏకతాటిపై నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ చర్చలో డీఎంకే, ఇతర పక్షాలు సైతం తీర్మానానికి మద్దతుగా మాట్లాడాయి.

#TamilNadu CM Joseph #Vijay passed a resolution in assembly opposing Karnataka’s Mekedatu dam on Cauvery, citing tribunal and #SupremeCourt violations.#20xSubscribedSMEIPO pic.twitter.com/WaMKj7isb7
— News Update (@NewsNew1578) June 19, 2026
బెంగళూరు తాగునీటి అవసరాలు తీర్చడంతో పాటు జలవిద్యుత్ ఉత్పత్తి కోసం ఈ ప్రాజెక్ట్ అవసరమని కర్ణాటక చెబుతోంది. అయితే.. తమిళనాడు మాత్రం ఇది తమ రాష్ట్ర నీటి హక్కులకు నష్టం కలిగిస్తుందని గట్టి అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఇదే సమయంలో ఈ అంశంపై ముఖ్యమంత్రి విజయ్, దేశ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసి.. కర్ణాటక సమర్పించిన డీటైల్ ప్రాజెక్ట్ రిపోర్ట్‌ను తిరస్కరించాలని కోరడం కూడా రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ పరిణామాలతో మేకెదాటు వివాదం మరోసారి దేశవ్యాప్తంగా రాజకీయంగా వేడెక్కింది.
👉ఈ తీర్మానంలో అత్యంత కీలక అంశంగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది కాంగ్రెస్ పార్టీలో ఏర్పడిన చీలిక. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలో ఉండగా, అదే పార్టీకి చెందిన నాయకత్వం ఉన్నప్పటికీ తమిళనాడు కాంగ్రెస్ నాయకులు మాత్రం విజయ్ సర్కార్ తీసుకున్న తీర్మానానికి మద్దతు ఇవ్వడం రాజకీయంగా విభేదాలకు దారితీసింది. రెండు రాష్ట్రాల్లో ఒకే పార్టీ వేర్వేరు వైఖరులు తీసుకోవడం కాంగ్రెస్‌ను చిక్కుల్లోకి పడేసింది.
కర్ణాటక కాంగ్రెస్ నేతలు ఈ తీర్మానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ, మేకెదాటు ప్రాజెక్ట్ తమ రాష్ట్ర అభివృద్ధి, బెంగళూరు తాగునీటి అవసరాలకు అవసరమని వాదిస్తున్నారు. కేంద్రం నుంచి అనుమతులు తీసుకుని ముందుకు సాగుతామని వారు స్పష్టం చేస్తున్నారు.
అదే సమయంలో తమిళనాడు కాంగ్రెస్ నేతలు మాత్రం రాష్ట్ర ప్రభుత్వ తీర్మానానికి అనుకూలంగా స్పందిస్తూ, కావేరీ జలాలపై తమిళనాడు హక్కులను కాపాడాల్సిన అవసరం ఉందని పేర్కొంటున్నారు. రైతుల ప్రయోజనాల విషయంలో రాజీ పడలేమని వారు చెబుతున్నారు. ఇలా రెండు రాష్ట్రాల్లో ఒకే పార్టీ నేతలు భిన్న భిన్న వైఖరులు తీసుకోవడంతో కాంగ్రెస్ హైకమాండ్‌కు పరిస్థితి ఇరకాటంగా మారింది.
ఈ ప్రాజెక్టు నేపథ్యం..
మేకెదాటు ప్రాజెక్ట్ కర్ణాటకలోని కనకపుర–రామనగర ప్రాంతాల మధ్య కావేరీ నదిపై నిర్మించాలనుకుంటున్న బ్యాలెన్సింగ్ జలాశయ ప్రాజెక్ట్. మేకెదాటు అంటే కన్నడలో “మేక దూకిన స్థలం” అని అర్థం. ఇక్కడ నది సన్నని లోయలో వేగంగా ప్రవహిస్తుంది. ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశం బెంగళూరుకు తాగునీరు అందించడం మరియు జలవిద్యుత్ ఉత్పత్తి చేయడం.
కావేరీ నీటి ప్రవాహాన్ని నియంత్రించేందుకు రిజర్వాయర్ నిర్మించాలన్నది కర్ణాటక ప్రభుత్వ ప్రతిపాదన. ఇదేం కొత్తది కాదు. 1940 నుంచే ఉంది. అయితే 2017లో అప్పటి ప్రభుత్వం తెర మీదకు తీసుకొచ్చింది. అయితే మేకెదాటు వల్ల దిగువ రాష్ట్రం తమిళనాడు నీటి ప్రవాహం తగ్గుతుందని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దీంతో ఈ ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ అంశం మాత్రమే కాకుండా రెండు రాష్ట్రాల మధ్య దీర్ఘకాలిక జల వివాదంగా మారింది.
Tags : 1