Breaking News

జంతర్‌ మంతర్‌ కథే వేరు.. 300 ఏళ్ల ఆసక్తికర ప్రయాణం

Published on Mon, 08/03/2026 - 13:52

దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ పేరు వినగానే చాలామందికి గుర్తొచ్చేది ఆందోళనలు, నినాదాలు, ప్రజా ఉద్యమాలు. ప్రభుత్వ నిర్ణయాలపై అసంతృప్తి వ్యక్తం చేయాలన్నా.. తమ సమస్యలను దేశం దృష్టికి తీసుకెళ్లాలన్నా.. అనేక వర్గాలకు ఇది దశాబ్దాలుగా కీలక వేదికగా మారింది. తాజాగా నీట్‌ పరీక్షల అక్రమాలపై విద్యార్థుల నిరసనలకు కూడా ఇదే ప్రాంతం వేదికైంది. ఇలాంటి చరిత్ర ఉన్న జంతర్‌ మంతర్‌ను నిరసనల కోసం వినియోగించడంపై పునరాలోచించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టడం, కేంద్రం–ఢిల్లీ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేయడంతో ఈ చారిత్రక ప్రాంతం మరోసారి చర్చలోకి వచ్చింది.

అయితే జంతర్‌ మంతర్‌ పుట్టుక నిరసనల కోసం కాదు. ఖగోళ పరిశోధనల కోసం నిర్మించిన ఈ ప్రదేశం.. కాలక్రమేణా ప్రజల సమస్యలు ప్రతిధ్వనించే ప్రజాస్వామ్య వేదికగా మారింది. ఒకప్పుడు సూర్యుడు, నక్షత్రాల కదలికలను అధ్యయనం చేసిన ఈ ప్రాంతం.. ఆ తర్వాత పాలకుల దృష్టిని ఆకర్షించేందుకు ప్రజలు తమ గళాన్ని వినిపించే వేదికగా పరిణామం చెందింది. మరి ఈ మార్పు ఎలా జరిగింది? జంతర్‌ మంతర్‌ చరిత్రలో నిలిచిపోయిన ఉద్యమాలు ఏవి? ఆ లోతులోకి వెళ్తే. 

ఖగోళ కేంద్రం నుంచి ఉద్యమాల వేదిక వరకు
జంతర్‌ మంతర్‌ను 18వ శతాబ్దంలో జైపూర్‌ మహారాజు సవాయి జైసింగ్‌-2 నిర్మించారు. 1724లో నిర్మించిన ఈ ఖగోళ పరిశోధనా కేంద్రంలో సూర్యుడు, గ్రహాలు, నక్షత్రాల కదలికలను అధ్యయనం చేసేందుకు భారీ పరికరాలను ఏర్పాటు చేశారు. ఆ కాలంలో భారతదేశ శాస్త్రీయ ఆలోచనలకు ఇది ఒక ముఖ్యమైన కేంద్రంగా నిలిచింది.

జంతర్‌ మంతర్‌ అనే పేరు కూడా దాని చరిత్రతో ముడిపడి ఉంది. సంస్కృతంలోని ‘యంత్ర’ (పరికరం), ‘మంత్ర’ (సూత్రం లేదా లెక్కింపు) అనే పదాల నుంచి ఈ పేరు వచ్చిందని చెబుతారు. ఖగోళ గణనలకు ఉపయోగించే ప్రత్యేక యంత్రాల కారణంగా ‘యంత్ర మంత్ర’ కాలక్రమంలో ‘జంతర్‌ మంతర్‌’గా ప్రాచుర్యంలోకి వచ్చింది.

కానీ కాలం మారింది. ఢిల్లీ నగరం విస్తరించడంతో పాటు జంతర్‌ మంతర్‌ చుట్టూ ప్రభుత్వ కార్యాలయాలు, అధికార కేంద్రాలు ఏర్పడ్డాయి. పార్లమెంట్‌, కేంద్ర ప్రభుత్వ వ్యవస్థలకు సమీపంగా ఉండటం వల్ల తమ సమస్యలను పాలకుల దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రజలు ఈ ప్రాంతాన్ని ఎంచుకోవడం మొదలైంది. అలా ఖగోళ పరిశోధనలకు వేదికగా ప్రారంభమైన ఈ ప్రదేశం.. క్రమంగా దేశంలోనే అత్యంత గుర్తింపు పొందిన నిరసన వేదికల్లో ఒకటిగా మారింది.

అన్నా ఉద్యమంతో దేశవ్యాప్త గుర్తింపు
జంతర్‌ మంతర్‌కు భారీ గుర్తింపు తెచ్చిన ఉద్యమాల్లో 2011లో అన్నా హజారే నేతృత్వంలోని అవినీతి వ్యతిరేక ఉద్యమం ఒకటి. బలమైన లోక్‌పాల్‌ చట్టం కోసం జరిగిన ఈ ఆందోళనకు దేశవ్యాప్తంగా భారీ స్పందన లభించింది. వేలాది మంది ప్రజలు, ముఖ్యంగా యువత ఈ ఉద్యమంలో భాగమయ్యారు. అవినీతికి వ్యతిరేకంగా ప్రజల ఆగ్రహాన్ని దేశం మొత్తం చూసేలా చేసిన ఈ ఉద్యమం తర్వాత జంతర్‌ మంతర్‌ పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది.

అయితే అన్నా ఉద్యమంతోనే జంతర్‌ మంతర్‌ నిరసనల చరిత్ర ప్రారంభం కాలేదు. అంతకుముందు నుంచే ఉద్యోగాలు, కార్మిక హక్కులు, సామాజిక సమస్యలు, ప్రభుత్వ విధానాలపై అనేక సంఘాలు, రాజకీయ పార్టీలు ఇక్కడ ఆందోళనలు నిర్వహించాయి. అన్నా ఉద్యమం మాత్రం ఈ ప్రాంతాన్ని ప్రజా ఉద్యమాలకు ప్రతీకగా నిలిపింది.

నిర్భయ ఘటనతో యువత కదిలి..
2012లో ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటన తర్వాత మహిళల భద్రతపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. న్యాయం కోసం, కఠిన చట్టాల కోసం జరిగిన నిరసనల్లో జంతర్‌ మంతర్‌ కీలక కేంద్రంగా మారింది. యువత ఒక్కటిగా పోరాటానికి దిగింది. ఈ ఉద్యమం ఒక ఘటనకు వ్యతిరేకత మాత్రమే కాదు.. దేశంలో మహిళల భద్రత, న్యాయ వ్యవస్థ, చట్టాలపై పెద్ద చర్చకు దారితీసింది. ప్రజల ఆగ్రహం ప్రభుత్వాలను స్పందించేలా చేసిన సందర్భాల్లో ఇది కూడా ఒకటిగా నిలిచింది.

రైతు ఉద్యమాలకు సాక్ష్యం
జంతర్‌ మంతర్‌ చరిత్రలో రైతు ఉద్యమాలకు కూడా ప్రత్యేక స్థానం ఉంది. వ్యవసాయ సమస్యలు, కనీస మద్దతు ధర, రైతుల ఆదాయం వంటి అంశాలపై రైతు సంఘాలు ఎన్నోసార్లు ఇక్కడ తమ గళాన్ని వినిపించాయి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా 2020–21లో జరిగిన రైతు ఉద్యమ సమయంలో జంతర్‌ మంతర్‌ మరోసారి కీలకంగా మారింది. ఢిల్లీ సరిహద్దుల్లో భారీ ఆందోళనలు సాగినప్పటికీ.. రైతు సంఘాలు ఇక్కడ ప్రత్యేక నిరసనలు నిర్వహించి తమ డిమాండ్లను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాయి.

ఈ ఉద్యమం దేశవ్యాప్తంగా వ్యవసాయ విధానాలపై పెద్ద చర్చకు దారితీసింది. చివరకు కేంద్ర ప్రభుత్వం ఆ మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకుంది.

రెజ్లర్ల ఆందోళనతో మరోసారి చర్చలోకి
2023లో మహిళా రెజ్లర్ల నిరసనలతో జంతర్‌ మంతర్‌ మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌పై ఆరోపణలకు సంబంధించి సాక్షి మాలిక్‌, బజరంగ్‌ పునియా, వినేశ్‌ ఫొగాట్‌ వంటి ప్రముఖ క్రీడాకారులు ఇక్కడ ఆందోళన చేపట్టారు. ఈ నిరసనలు క్రీడా రంగంలో మహిళల భద్రత, అధికార దుర్వినియోగం వంటి అంశాలపై పెద్ద చర్చకు కారణమయ్యాయి.

నీట్‌ నిరసనలు.. కొనసాగుతున్న గళం
ఇటీవల నీట్‌ పరీక్షలో అవకతవకల ఆరోపణలపై విద్యార్థులు కూడా జంతర్‌ మంతర్‌ను ఆశ్రయించారు. పరీక్షల పారదర్శకత, విద్యార్థుల భవిష్యత్‌ వంటి అంశాలపై తమ నిరసనను వ్యక్తం చేశారు. ఉద్యోగ నియామకాల్లో ఆలస్యం, వివిధ ప్రభుత్వ విధానాలు, సామాజిక సమస్యలపై కూడా అనేక వర్గాలు ఇక్కడ నిరసనలు చేపట్టాయి. ఇలా జంతర్‌ మంతర్‌ కేవలం ఒక ప్రాంతంగా కాకుండా.. ప్రజల సమస్యలు దేశవ్యాప్తంగా వినిపించే వేదికగా మారింది.

ఇబ్బందులు కూడా ఉన్నాయా?
అయితే జంతర్‌ మంతర్‌ నిరసనల వల్ల సమస్యలు కూడా తలెత్తుతున్నాయని కొందరు వాదిస్తున్నారు. తరచూ జరిగే ఆందోళనల కారణంగా సెంట్రల్‌ ఢిల్లీలో ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోందని, స్థానిక ప్రజలు, అత్యవసర సేవలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని పిటిషన్లలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జంతర్‌ మంతర్‌కు బదులుగా ప్రత్యేక నిరసన వేదిక ఏర్పాటు చేయాలన్న అంశంపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం నుంచి వివరాలు కోరింది.

ప్రజాస్వామ్యానికి ప్రతీక.. మార్పు అవసరమా?
జంతర్‌ మంతర్‌ భారత ప్రజాస్వామ్యంలో ఒక ప్రత్యేక గుర్తింపు పొందింది. ప్రజలు తమ సమస్యలను ప్రభుత్వానికి వినిపించే హక్కుకు ఇది ప్రతీకగా నిలిచింది. అధికార కేంద్రాలకు దగ్గరగా ఉండటం వల్ల ప్రజల గొంతు పాలకుల వరకు చేరే అవకాశం కల్పించింది. అయితే నగర నిర్వహణ, సాధారణ ప్రజల సౌకర్యాలు కూడా అంతే ముఖ్యమని న్యాయస్థానం పరిశీలిస్తోంది. అందుకే ఇప్పుడు అసలు ప్రశ్న.. జంతర్‌ మంతర్‌ ఉద్యమాల వేదికగా కొనసాగుతుందా? లేక కొత్త నిరసన కేంద్రానికి మారుతుందా? అనేది.

Videos

KAAKA నుంచి క్రేజీ అప్డేట్

ఓ బ్రాహ్మణ్ పై కక్ష్య సాధిస్తే... వేమిరెడ్డి దంపతులు ఇది నా ఆక్రందన! శ్రావణ్ శర్మ సతీమణి

సచివాలయం ఉద్యోగులను ఎలా ఈడ్చుకెళ్తున్నారో చూడండి

ఈసీ నియామక విధానంపై జగన్ ప్రశ్నలు.. అసలు వివాదం ఏంటి?

పాత అంబులెన్సుకు కొత్త రంగులు వేసిన ఏపీ సర్కారు

సిగ్గుందా చంద్రబాబు..! ఉద్యోగులంటే బానిసలనుకున్నారా..?

పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. నెలకు అకౌంట్లోకి 20,000

హిమాలయాల్లో పెను సునామీ! 200 కోట్ల మందికి డేంజర్ బెల్స్!

ఆసియా గేమ్స్ మహిళల కబడ్డీలో భారత్ కు స్వర్ణం

ఇది కచ్చితంగా ప్రభుత్వ హత్యే... కాకుమానుపై పోలీసుల తీరు.. అడ్వకేట్ రజినీ షాకింగ్ నిజాలు

Photos

+5

'ప్యారడైజ్'లో కేసీఆర్‌ని పోలిన పాత్ర.. షూటింగ్‌లో ఇలా(ఫొటోలు)

+5

బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ వైబ్‌లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి (ఫోటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’లో సంపూర్ణేష్‌ బాబు భార్యగా విషిక.. గ్లామర్‌ ఫొటోలు వైరల్‌

+5

మిజ్వాన్‌ ఫ్యాషన్‌ షోలో అలియా, విక్కీ సందడి(ఫోటోలు)

+5

నాలుగు పదులు దాటినా మరింత గ్లామరస్‌గా శ్రియా శరణ్..(ఫోటోలు)

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’ సక్సెస్‌ మీట్‌ (ఫొటోలు)

+5

‘సిగ్మా’ ప్రీ-రిలీజ్ వేడుకలో మెరిసిన ఫరియా అబ్దుల్లా (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఇంకా కొనసాగుతున్న గణేష్ నిమజ్జనాలు.. ట్యాంక్ బండ్ వద్ద భారీ క్యూ...(ఫొటోలు)

+5

చూడప్పా సిద్ధప్పా.. సింహం గడ్డం గీసేసిందప్పా! (ఫొటోలు)