Breaking News

అమెరికా బాంబులకూ అందని ఇరాన్‌ రహస్యం!

Published on Tue, 07/14/2026 - 13:30

భూమి లోపల వందల అడుగుల లోతు.. చుట్టూ పర్వతాల రక్షణ.. అత్యాధునిక ఆయుధాలు కూడా సులభంగా చేరుకోలేని నిర్మాణం.. ఇది ఏదో సాధారణ సైనిక స్థావరం కాదు. ఇరాన్‌లోని ఓ రహస్య భూగర్భ కేంద్రం ఇప్పుడు ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తోంది. అదే ‘పికాక్స్‌ మౌంటెన్‌’. ఇరాన్‌ అణు కార్యక్రమానికి కీలక కేంద్రంగా మారిందన్న అనుమానాలతో పాటు.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తాజా హెచ్చరికలతో ఈ రహస్య స్థావరం మరోసారి చర్చకు వచ్చింది.

‘‘పికాక్స్‌ మౌంటెన్‌ (Pickaxe Mountain)ను కూడా ధ్వంసం చేస్తాం.. ఇరాన్‌ సిద్ధంగా ఉండాలి’’ అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన తాజా హెచ్చరిక ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఈ రహస్య భూగర్భ కేంద్రంపైకి మళ్లించింది. ఇప్పటికే ఇరాన్‌లోని కీలక అణు స్థావరాలపై దాడులు చేసిన అమెరికా.. తదుపరి లక్ష్యంగా ఈ పర్వతాన్ని ఎంచుకుందా? అనే చర్చ మొదలైంది. అసలు పికాక్స్‌ మౌంటెన్‌లో ఏముంది? ఎందుకు అమెరికా దీనిపై ఇంత ప్రత్యేక దృష్టి పెట్టింది? అణు కార్యక్రమానికి ఇది ఎంత కీలకం? అన్న ప్రశ్నలు అంతర్జాతీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేపుతున్నాయి.

జాగ్రోస్‌ పర్వతాల్లో దాగిన ‘భూగర్భ కోట’
ఇరాన్‌లోని జాగ్రోస్‌ పర్వత శ్రేణుల్లో ఉన్న ఈ కేంద్రం.. స్థానికంగా కుహ్‌-ఎ కొలాంగ్‌ గాజ్‌ లా (Kuh-e Kolang Gaz La) పేరుతో కూడా గుర్తింపు పొందింది. ఇరాన్‌ అణు కార్యక్రమంలో కీలకమైన నాటాంజ్‌(Natanz) అణుశుద్ధి కేంద్రం నుంచి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలోనే ఇది ఉంది. నాటాంజ్‌ కేంద్రం గతంలో దాడులకు గురైనప్పటికీ.. పికాక్స్‌ మౌంటెన్‌ మాత్రం భిన్నమైన నిర్మాణంతో తయారవుతోంది. పర్వతాన్ని తొలిచి దాని లోపల భారీ సొరంగాలు, భూగర్భ గదులు నిర్మిస్తున్నట్లు ఉపగ్రహ చిత్రాలు సూచిస్తున్నాయి. ఇదే అమెరికా వ్యూహకర్తలను ఆందోళనకు గురిచేస్తోంది. ఎందుకంటే ఇది కేవలం ఓ భవనం కాదు.. పర్వతాన్ని సహజ కవచంగా మార్చుకున్న భారీ రక్షణ వ్యవస్థ.

బంకర్‌ బస్టర్‌ బాంబులకూ సవాల్‌
పికాక్స్‌ మౌంటెన్‌పై ప్రపంచ దేశాల దృష్టి పడటానికి ప్రధాన కారణం దీని లోతు. నిపుణుల అంచనా ప్రకారం ఈ భూగర్భ సముదాయంలోని కొన్ని ప్రాంతాలు భూమి లోపల 260 నుంచి 330 అడుగుల లోతులో ఉండొచ్చని తెలుస్తోంది. అమెరికా వద్ద ఉన్న అత్యంత శక్తివంతమైన బంకర్‌ బస్టర్‌ ఆయుధాలు కూడా పరిమిత స్థాయిలో మాత్రమే చొచ్చుకుపోగలవు. సాధారణంగా ఇవి వందల అడుగుల మట్టి, రాళ్ల పొరలను లేదంటే బలమైన కాంక్రీట్‌ నిర్మాణాలను ఛేదించగలిగినా.. ఇంత లోతులో ఉన్న నిర్మాణాలను ధ్వంసం చేయడం సవాల్‌గా మారుతుంది. అందుకే పికాక్స్‌ మౌంటెన్‌.. అమెరికా సైనిక వ్యూహాలకు ఓ పెద్ద పరీక్షగా మారింది.

అసలు అక్కడ ఏం జరుగుతోంది?
ఈ రహస్య స్థావరం నిర్మాణం 2020 ప్రాంతంలో ప్రారంభమైంది. నాటాంజ్‌లో జరిగిన విధ్వంసం తర్వాత కొత్త సెంట్రిఫ్యూజ్‌ అసెంబ్లీ కేంద్రం నిర్మిస్తున్నామని ఇరాన్‌ అప్పట్లో వెల్లడించింది. అయితే నిర్మాణ స్థాయి, భద్రతా ఏర్పాట్లు మాత్రం అనేక అనుమానాలకు దారితీశాయి. కొందరు అణు నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఇది కేవలం పరికరాల తయారీ కేంద్రం మాత్రమే కాకుండా, రహస్య యురేనియం శుద్ధి కేంద్రంగా లేదంటే కీలక అణు పదార్థాల నిల్వ ప్రాంతంగా ఉపయోగపడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇరాన్‌ వద్ద ఉన్న అధిక శుద్ధి చేసిన యురేనియం నిల్వలను ఇలాంటి రహస్య భూగర్భ కేంద్రాల్లో భద్రపరిచి ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఐఏఈఏకు అందని రహస్యం
పికాక్స్‌ మౌంటెన్‌ ఇప్పటివరకు అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (IAEA) తనిఖీలకు అందుబాటులోకి రాలేదు. దీంతో ఈ కేంద్రంలో జరుగుతున్న కార్యకలాపాలపై మరింత ఆసక్తి, అనుమానాలు పెరిగాయి. ఉపగ్రహ చిత్రాల విశ్లేషణలో.. గత దాడుల తర్వాత కూడా అక్కడ నిర్మాణ పనులు కొనసాగుతున్నట్లు గుర్తించారు. కొత్త భద్రతా గోడలు, బలపరిచిన ప్రవేశ మార్గాలు, తవ్వకాల ఆనవాళ్లు కనిపించినట్లు నిపుణులు చెబుతున్నారు. ఇది భవిష్యత్తులో జరిగే దాడులను ఎదుర్కొనేలా ఇరాన్‌ ఈ కేంద్రాన్ని మరింత బలోపేతం చేస్తోందన్న అభిప్రాయాలకు కారణమైంది.

ట్రంప్‌ హెచ్చరికలతో పెరిగిన ఉత్కంఠ
గతంలో ఇరాన్‌ అణు కేంద్రాలపై దాడుల తర్వాత.. ఆ దేశ అణు కార్యక్రమాన్ని దెబ్బతీశామని అమెరికా ప్రకటించింది. అయినప్పటికీ పికాక్స్‌ మౌంటెన్‌ మాత్రం ఇంకా అంతుచిక్కని ప్రశ్నగానే మిగిలింది. ఇప్పుడు ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలతో ఈ భూగర్భ స్థావరం మరోసారి వార్తల్లోకి వచ్చింది. అమెరికా నిజంగానే ఈ కేంద్రంపై దాడికి దిగుతుందా? లేదంటే ఇరాన్‌పై ఒత్తిడి పెంచేందుకు మాత్రమే ఈ హెచ్చరికలు చేస్తున్నదా? అన్నది ఆసక్తికరంగా మారింది. పర్వతం లోపల దాగిన ఈ రహస్యం.. రాబోయే రోజుల్లో అమెరికా-ఇరాన్‌ ఉద్రిక్తతలకు కేంద్ర బిందువుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)