Breaking News

ఇరాన్‌ ఆస్తులపై ట్రంప్‌ గురి.. టెహ్రాన్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌

Published on Fri, 07/24/2026 - 13:05

అమెరికా–ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. యుద్ధ పరిణామాల నేపథ్యంలో ఇరాన్‌కు చెందిన స్తంభింపజేసిన నిధులను(ఫ్రీజ్డ్‌ ఫండ్స్‌) వినియోగిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన సంచలన ప్రకటన ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చకు దారితీసింది. అయితే ఈ ప్రకటనపై ఇరాన్‌ ఘాటుగా స్పందించింది. 

అమెరికా ఆధీనంలో ఉన్న ఇరాన్‌కు చెందిన స్తంభింపజేసిన నిధులను.. అమెరికా నౌకలు, సరుకు రవాణా నౌకలు, ఇతర సంబంధిత ఆస్తులకు జరిగిన నష్టాల భర్తీకి ఉపయోగిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తాజాగా ప్రకటించారు. ఇరాన్‌ చర్యల వల్ల జరిగిన నష్టాలకు పరిహారం చెల్లించేందుకు ఈ నిధులను వినియోగిస్తామని ఆయన స్పష్టం చేశారు. అయితే అమెరికా–ఇరాన్‌ మధ్య సైనిక ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో ట్రంప్‌ ప్రకటన రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. వాషింగ్టన్‌ మళ్లీ దాడులు ప్రారంభించిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు మరింత వేడి పెంచాయి.

“ఇకపై నౌకలు, సరుకు లేదా వాటికి సంబంధించిన ఏదైనా ఆస్తికి జరిగే నష్టాలను అమెరికా ఆధీనంలో ఉన్న ఇరాన్‌ డబ్బుతో చెల్లిస్తాం” అని ట్రంప్‌ పేర్కొన్నారు. ఈ నష్టాలు భారీగా ఉండొచ్చని, అయినప్పటికీ ఇది న్యాయమైన చర్య అని ఆయన సమర్థించారు. ఇరాన్‌ మద్దతు ఉన్న యెమెన్‌ హౌతీ తిరుగుబాటుదారులు ఎర్ర సముద్రంలో రెండు సౌదీ చమురు నౌకలపై దాడులకు పాల్పడినట్లు ప్రకటించిన నేపథ్యంలో ట్రంప్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇరాన్‌ ఘాటు కౌంటర్‌
ట్రంప్‌ ప్రకటనపై ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాఘ్చీ తీవ్రంగా స్పందించారు. ఇతర దేశాల ఆస్తులను స్వాధీనం చేసుకుని భవిష్యత్తు నష్టపరిహారాలకు వినియోగించడం “పేలుడు స్వభావం కలిగిన ప్రమాదకరమైన సంప్రదాయానికి నాంది” అని వ్యాఖ్యానించారు. “ఒక దేశానికి చెందిన ఆస్తులను మరో దేశం సంబంధం లేని అంశాలకు ఉపయోగించడం సాధారణమైతే.. భవిష్యత్తులో ఏ దేశ ఆస్తులకూ భద్రత ఉండదు. దీని ఫలితంగా ఏర్పడే గందరగోళం శాంతియుతంగా ఉండదు” అని అరాఘ్చీ సోషల్‌ మీడియా పోస్టులో పేర్కొన్నారు. అంతర్జాతీయ నిబంధనలను బలహీనపరిచే చర్యగా ఆయన ట్రంప్‌ నిర్ణయాన్ని అభివర్ణించారు.

నిధుల విలువ ఎంత?
ఇరాన్‌పై అమెరికా ఆంక్షల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు ఆర్థిక వ్యవస్థల్లో ఆ దేశానికి చెందిన భారీ మొత్తంలో నిధులు నిలిచిపోయాయి. ఈ నిధుల ఖచ్చితమైన విలువ స్పష్టంగా తెలియకపోయినా.. కొన్ని నివేదికల ప్రకారం వాటి విలువ సుమారు 124 బిలియన్‌ డాలర్ల నుంచి 167 బిలియన్‌ డాలర్ల వరకు ఉండొచ్చని అంచనా. ఈ స్తంభింపజేసిన నిధుల విడుదల ఇరాన్‌–అమెరికా మధ్య గత చర్చల్లో కీలక డిమాండ్‌గా ఉంది. అయితే ఇటీవల కుదిరిన అవగాహన ఒప్పందం కూడా ముందుకు సాగలేదు.

హౌతీల దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
ఇటీవల ఎర్ర సముద్రంలో సౌదీకి చెందిన రెండు చమురు నౌకలపై దాడులకు యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులు బాధ్యత వహించారు. హౌతీ అధికార ప్రతినిధి యాహ్యా సరీ మాట్లాడుతూ.. “ఎన్‌సీలియా (ENCELIA), లైలా (LAYLA)” అనే రెండు సౌదీ నౌకలను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపారు. సౌదీ రవాణా అధికారులు కూడా ఎన్‌సీలియా నౌకపై దాడి జరిగిందని, బాబ్‌ అల్‌-మందెబ్‌ జలసంధి వద్ద నౌక ముందుభాగంలో మంటలు చెలరేగినట్లు ధ్రువీకరించారు. ఇరాన్‌ కూడా హార్ముజ్‌ జలసంధిలో నిబంధనలు పాటించని వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకుంటోందని అమెరికా ఆరోపిస్తోంది.

యుద్ధం నుంచి ఆర్థిక పోరాటం వరకు
అమెరికా–ఇరాన్‌ ఘర్షణ ఇప్పటివరకు ప్రధానంగా సైనిక, దౌత్య స్థాయిలో కొనసాగింది. అయితే తాజా పరిణామాలతో ఆర్థిక ఆస్తులు కూడా ఈ పోరాటంలో కీలక ఆయుధాలుగా మారుతున్నాయి. ఒక దేశానికి చెందిన విదేశీ నిధులను మరో దేశం నష్టపరిహారాల కోసం వినియోగించడం అంతర్జాతీయ చట్టపరంగా కొత్త చర్చలకు దారితీయొచ్చని నిపుణులు చెబుతున్నారు. అమెరికా మాత్రం తన చర్యలను సమర్థిస్తూ.. తమ వాణిజ్య ప్రయోజనాలు, నౌకల భద్రతకు జరిగిన నష్టాలకు బాధ్యులను జవాబుదారీ చేయడమే లక్ష్యమని చెబుతోంది.

న్యూయార్క్‌లో కత్తిపోట్ల కలకలం
ఇదిలా ఉండగా అమెరికాలోని న్యూయార్క్‌ నగరంలో జరిగిన రెండు కత్తిపోటు ఘటనలు కూడా చర్చనీయాంశంగా మారాయి. మాన్‌హాటన్‌లోని అప్‌పర్‌ వెస్ట్‌ సైడ్‌ ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులపై దాడి చేసిన 51 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. దాడి సమయంలో నిందితుడు “అల్లాహు అక్బర్‌” అని నినదించినట్లు ప్రత్యక్ష సాక్షులు పేర్కొనడంతో.. ఇది విద్వేష నేరమా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే ప్రాథమిక విచారణలో నిందితుడి మానసిక ఆరోగ్య పరిస్థితి కూడా కారణం అయి ఉండొచ్చని అధికారులు వెల్లడించారు. దాడిలో గాయపడిన ఇద్దరు బాధితులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

ప్రపంచానికే ప్రమాదకర సంకేతమా?
ఒక దేశానికి చెందిన స్తంభింపజేసిన ఆస్తులను మరో దేశం తన ప్రయోజనాలకు వినియోగించడం అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో కొత్త వివాదాలకు దారితీసే అవకాశం ఉంది. అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం భవిష్యత్తులో ఇతర దేశాల విదేశీ నిధుల భద్రతపై కూడా ప్రశ్నలు లేవనెత్తుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆస్తుల స్వాధీనం వంటి చర్యలు సాధారణ పరిణామంగా మారితే.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో నమ్మకం, పెట్టుబడుల భద్రతపై ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

ప్రపంచానికి పెరుగుతున్న సవాళ్లు
ఒకవైపు ఇరాన్‌ స్తంభింపజేసిన నిధుల వినియోగంపై అమెరికా–ఇరాన్‌ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుండగా.. మరోవైపు అమెరికాలో భద్రత, విద్వేష నేరాల అంశాలు తెరపైకి వస్తున్నాయి. తాజా పరిణామాలు యుద్ధాలు కేవలం యుద్ధ రంగానికే పరిమితం కావని.. అవి ఆర్థిక వ్యవస్థలు, అంతర్జాతీయ నిబంధనలు, ప్రపంచ భద్రతపై కూడా తీవ్ర ప్రభావం చూపుతాయని మరోసారి స్పష్టం చేస్తున్నాయి.

Videos

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)