షా వారసుడికి అడ్డుపడుతోంది ఎవరో తెలుసా?

Published on Wed, 07/29/2026 - 10:58

ఒక అవకాశం వస్తే చాలు.. చరిత్ర తిరగరాస్తానని భావించాడు. ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఆ క్షణం వచ్చేసిందనుకున్నాడు. అల్లకల్లోల పరిస్థితులు.. మార్పు కోసం ఎదురుచూస్తున్న ప్రజలు.. ఇదే సరైన సమయం అనుకున్నాడు. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న కల నెరవేరుతుందని  ఆయన ఆశలు పెట్టుకున్నాడు. కానీ పరిస్థితులు అనుకున్నట్లుగా సాగలేదు. మద్దతు పెరుగుతుందని భావించిన వేళ.. వరుస సవాళ్లు ఎదురయ్యాయి. ఈ ప్రయత్నాల్లో షా వారసుడికి ఇప్పుడు చిక్కులు తప్పడం లేదు.

ఇరాన్‌లో పాలనా మార్పు వస్తే కొత్త నాయకత్వం ఎవరిది? అనే ప్రశ్నకు సమాధానంగా తనను తాను ముందుకు తెచ్చుకున్న మాజీ షా కుమారుడు రెజా పహ్లవీ ప్రయత్నాలకు అనూహ్య అడ్డంకులు ఎదురవుతున్నాయి. 1979 ఇస్లామిక్‌ విప్లవంలో తన తండ్రి మహ్మద్‌ రెజా పహ్లవీ పాలన కూలిపోయిన తర్వాత దేశం విడిచిన రెజా పహ్లవీ దాదాపు ఐదు దశాబ్దాలుగా ప్రవాస జీవితంలోనే ఉన్నారు. రాజరికం అంతమైనప్పటికీ.. షా కుటుంబ వారసుడిగా ఆయన పేరు ఇరాన్‌ రాజకీయాల్లో మాత్రం కొనసాగుతూనే వచ్చింది. 

అయితే ఇరాన్‌లో ఇటీవలి పరిణామాలు, అమెరికా–ఇజ్రాయెల్‌ ఘర్షణల నేపథ్యంలో రాజకీయ మార్పు వస్తుందనే అంచనాలతో ఆయన మళ్లీ తెరపైకి వచ్చారు. ఇరాన్‌లో కొత్త వ్యవస్థ ఏర్పడితే తాత్కాలిక మార్పు దశకు తానే నాయకత్వం వహిస్తానని ప్రకటించారు. ఈ క్రమంలో.. 

‘నేను గమ్యం కాదు.. వంతెన మాత్రమే’
రెజా పహ్లవీ తనను భవిష్యత్‌ పాలకుడిగా కాకుండా ప్రజాస్వామ్య మార్పుకు మార్గదర్శిగా చూపించుకునే ప్రయత్నం చేశారు. ‘‘నేను గమ్యం కాదు.. గమ్యానికి తీసుకెళ్లే వంతెన మాత్రమే’’ అంటూ ఆయన తన పాత్రను వివరించారు. ఇరాన్‌ ప్రజలు తమ భవిష్యత్తును తామే నిర్ణయించుకోవాలని ప్రకటించారు. అయితే..

అదే సమయంలో అమెరికా, యూరప్‌లో పర్యటిస్తూ ఆయన మద్దతు కూడగట్టే ప్రయత్నాలు చేశారు. అమెరికాలోని కొంతమంది సంపన్న ప్రవాస ఇరానీయులు కూడా ఆయనకు ఆర్థిక సహకారం అందించారు. అయితే ఈ మద్దతు దేశంలో బలమైన ప్రజా ఉద్యమంగా మారిందా? అనే అనుమానాలు ఆ సమయంలో వ్యక్తం అయ్యాయి కూడా!.

ప్రతిపక్షంలోనే అసలు పోరు
ఒకవైపు ఇరాన్‌ ప్రభుత్వంపై వ్యతిరేకత.. మరోవైపు ప్రతిపక్షంలోనే విభేదాలు.. ఇంకోవైపు అంతర్జాతీయ మద్దతుపై అనిశ్చితి.. ఇలా మూడు వైపుల సవాళ్ల మధ్య పహ్లవీ రాజకీయ ప్రయాణం సాగుతోంది. రెజా పహ్లవీకి ఎదురైన అతిపెద్ద సవాలు ఇరాన్‌ ప్రభుత్వమే కాదు.. ప్రతిపక్షంలోని విభేదాలే. ఇస్లామిక్‌ రిపబ్లిక్‌కు వ్యతిరేకంగా ఉన్న వర్గాలు అనేకం ఉన్నప్పటికీ.. వాటి మధ్య ఏకాభిప్రాయం లేకపోవడం సమస్యగా మారింది.

రాయిటర్స్‌ కథనం ప్రకారం.. పహ్లవీ చుట్టూ ఉన్న కొందరు మద్దతుదారులు ఇతర ప్రతిపక్ష నేతలపై తీవ్ర విమర్శలు చేయడం, కొందరిపై దాడులకు పాల్పడిన ఘటనలు ఉద్యమ ఐక్యతను దెబ్బతీశాయి. 2023లో ప్రతిపక్షాలను ఏకం చేసే ప్రయత్నాలు జరిగినప్పటికీ అవి ఎక్కువ కాలం కొనసాగలేదనే విషయం ఇప్పుడు వెలుగులోకి రావడం గమనార్హం.

దాతల్లోనూ పెరిగిన అసంతృప్తి
పహ్లవీకి మద్దతుగా కొందరు ఇరానియన్‌-అమెరికన్‌ వ్యాపారవేత్తలు మిలియన్ల డాలర్ల నిధులు సమకూర్చినప్పటికీ.. ఆశించిన స్థాయిలో రాజకీయ ఫలితాలు కనిపించడం లేదనే అసంతృప్తి కొందరిలో పెరిగినట్లు సమాచారం. ఉద్యమాన్ని మరింత విస్తృతం చేయడం, ప్రతిపక్షాలను ఒక్కతాటిపైకి తీసుకురావడంలో మరింత చురుగ్గా వ్యవహరించాలని వారు సూచించినట్లు తెలుస్తోంది.

అమెరికా మద్దతు కూడా ప్రశ్నార్థకమే
ఇరాన్‌లో మార్పు కోసం ప్రయత్నిస్తున్న పహ్లవీకి అమెరికా మద్దతు పూర్తిగా లభించలేదని విశ్లేషణలు చెబుతున్నాయి. ట్రంప్‌ సహా అమెరికా అధికారులు కూడా ఆయనను భవిష్యత్‌ ఇరాన్‌ నాయకుడిగా అధికారికంగా ప్రకటించలేదు. ఇరాన్‌లో ఆయనకు ఉన్న వాస్తవ ప్రజాదరణ, రాజకీయ స్థిరత్వంపై సందేహాలు ఉన్నట్లు తెలుస్తోంది.

షా వారసత్వం.. బలంతోపాటు బలహీనత కూడా!
రెజా పహ్లవీకి అతిపెద్ద బలం ఆయన కుటుంబ పేరు. చివరి షా కుమారుడిగా కొందరు ఆయనను స్థిరత్వానికి ప్రతీకగా చూస్తున్నారు. అయితే అదే గతం ఆయనకు సవాల్‌గా మారింది. షా పాలనలో జరిగిన అణచివేతను గుర్తు చేస్తూ కొందరు వర్గాలు ఆయన నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నాయి. ప్రస్తుతం ఇరాన్‌లో మార్పు కోసం ప్రయత్నిస్తున్న అనేక శక్తుల్లో రెజా పహ్లవీ అత్యంత గుర్తింపు ఉన్న వ్యక్తిగా ఉన్నప్పటికీ.. ఆయన ముందున్న అసలు పరీక్ష మాత్రం ఒక్కటే. విభిన్న ప్రతిపక్షాలను ఏకం చేసి, దేశంలో విశ్వసనీయమైన ప్రత్యామ్నాయంగా నిలబడగలరా? అన్నదే.

Videos

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)