జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?
Breaking News
ఇరాన్‌కు ‘అణు’ సాయం.. నాలుక మడతేసిన పాక్
Published on Mon, 06/16/2025 - 11:26
ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరిట తమపై ఇజ్రాయెల్ అణ్వాయుధాలు ఉపయోగిస్తే.. మద్దతుగా పాకిస్తాన్ అణు దాడులకు దిగుతుందని ఇరాన్ సంచలన ప్రకటన చేసింది. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్(IRGC) కమాండర్ జనరల్ మొహ్సెన్ రెజాయ్ స్వయంగా ఈ ప్రకటన చేయడం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. అయితే ఈ ప్రకటనపై ఇప్పుడు పాక్ యూటర్న్ తీసుకుంది.
ఇజ్రాయెల్ తమపై అణుబాంబును ప్రయోగిస్తే.. పాకిస్థాన్ రంగంలోకి దిగి దానిపై న్యూక్లియర్ అటాక్ చేస్తుందని ఇరాన్‌కు చెందిన ఐఆర్జీసీ జనరల్, ఇరాన్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ మెంబర్ మొహ్సెన్ రెజాయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ ప్రభుత్వం నడిపించే ఓ టీవీ చానెల్‌తో ఆయన మాట్లాడుతూ. ‘‘ఇజ్రాయెల్ మాపై అణు దాడి చేస్తే.. ఇస్లామాబాద్(పాక్) కూడా టెల్‌అవీవ్‌పై అణుబాంబును ప్రయోగిస్తుందది. ఈ మేరకు పాక్ నుంచి స్పష్టమైన హామీ లభించింది’’ అని మొహసిన్ వెల్లడించారు.
అంతేకాదు.. తుర్కియే, సౌదీ, పాకిస్థాన్ ఇతర దేశాలతో కలిసి ఇస్లామిక్ ఆర్మీని ఏర్పాటుచేయాలని మొహసిన్ అన్నారు. కానీ, ఆయా దేశాలు ఇరాన్ యూనిఫామ్ వేసుకోవడానికి సిద్ధంగా లేవన్నారు. వీటిల్లో ఒక్క దేశమైనా ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపితే రాత్రికి రాత్రే ప్రాంతీయ బలాబలాలు మారిపోతాయన్నారు.
అబ్బే.. అలా అనలేదు
ఇరాన్ ఇచ్చిన ప్రకటనను పాక్ ఖండిచింది. తాము అలాంటి కమిట్మెంట్ ఏదీ ఇవ్వలేదని పాకిస్తాన్ రక్షణ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. అయినప్పటికీ ఇరాన్‌కు తమ విస్తృత మద్దతు ప్రకటించింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌పై ఇజ్రాయెల్ చేసిన దాడుల్ని పాక్ ఇదివరకే ఖండించింది. యూదు దేశం ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఇరాన్‌కు తాము మద్దుగా నిలుస్తామని పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా అసిఫ్ జూన్ 14వ తేదీన పాక్ జాతీయ అసెంబ్లీలో ప్రకటించారు. ఇరాన్, యెమెన్, పాలస్తీనాలకు ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుంది. ఇప్పటికైనా ఇస్లాం దేశాలు ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉంది. లేకుంటే ఆ దేశాలకు పట్టిన గతే రేపు మనకూ పడుతుంది. ఓఐసీ(Organisation of Islamic Cooperation) దేశాలు ఇజ్రాయెల్ దాడులపై వ్యూహరచన కోసం ఓ సమావేశం నిర్వహించాల్సి ఉంది’’ అని ఖ్వాజా చేసిన వ్యాఖ్యలను తుర్కియే టుడే ప్రముఖంగా ప్రచుచురించింది.
భగ్గుమన్న పశ్చిమాసియా
ఇరాన్ నుంచి ప్రపంచ దేశాలకు అణు ముప్పు పొంచి ఉందని, ఇప్పటికే కీలక పరీక్షలు నిర్వహించిందని చెబుతూ ఆపరేషన్ రైజింగ్ లయన్(Operation Rising Lion) పేరిట ఇజ్రాయెల్ దాడులకు దిగింది. అయితే ఇరాన్ ఆ ఆరోపణలను ఖండిస్తోంది. ప్రతిగా.. ఇజ్రాయెల్‌పైనా క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతోంది. ఈ ఉద్రిక్తతలతో పశ్చిమాసియా భగ్గుమంటోంది.
ప్రపంచంలో ప్రస్తుతం అణ్వాయుధాలున్న దేశాల్లో ఇజ్రాయెల్, పాకిస్థాన్ స్థానం దక్కించుకొన్నాయి. ఈ జాబితాలో అమెరికా, రష్యా, ఫ్రాన్స్, భారత్, ఉత్తర కొరియా కూడా ఉన్నాయి.
Tags : 1