Breaking News

ఎల్‌ నినో ఉగ్రరూపం!.. ఫసిఫిక్‌ వేడితో డేంజర్‌ బెల్స్‌

Published on Wed, 07/15/2026 - 12:01

భూమి వాతావరణాన్ని తలకిందులు చేసే శక్తివంతమైన ఎల్‌ నినోమరోసారి బలపడే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈసారి కేవలం సముద్ర ఉపరితలంలోనే కాదు.. పసిఫిక్‌ మహాసముద్రం లోతుల్లోనే భారీగా వేడి నీటి నిల్వలు పేరుకుపోతున్నాయి. ఈ అసాధారణ మార్పులను నాసా ఉపగ్రహాలు గుర్తించడంతో ప్రపంచ వాతావరణ నిపుణులు అప్రమత్తమయ్యారు. సముద్రం అడుగున నుంచి తూర్పు పసిఫిక్‌ వైపు కదులుతున్న ఈ వేడి ప్రవాహాలు భవిష్యత్‌లో అత్యంత శక్తివంతమైన(గాడ్జిల్లా) ఎల్‌ నినోకు సంకేతాలా? అనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సాధారణంగా కనిపించే ఎల్‌ నినో  (El Niño) పరిస్థితులతో పోలిస్తే.. ఈసారి సముద్రం వేడెక్కుతున్న వేగం, తీవ్రత భిన్నంగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తిస్తున్నారు. అందుకే 2026లో ఏర్పడే అవకాశం ఉన్న ఈ ఎల్‌ నినోను కొందరు నిపుణులు ‘గాడ్జిల్లా ఎల్‌ నినో’గా అభివర్ణిస్తున్నారు.

150 ఏళ్ల రికార్డును బద్దలయ్యేనా?
2026-27 కాలానికి సంబంధించి వెలువడుతున్న తాజా వాతావరణ నమూనాలు సంచలన అంచనాలను చూపిస్తున్నాయి. ఈసారి ఏర్పడే ఎల్‌ నినో ఇప్పటివరకు నమోదైన అత్యంత బలమైన ఘటనలను అధిగమించే అవకాశం ఉందని కొన్ని మోడల్స్‌ సూచిస్తున్నాయి. గతంలో 1997-98లో నమోదైన ఎల్‌ నినో ప్రపంచ వాతావరణంపై తీవ్ర ప్రభావం చూపింది. ఆ తర్వాత 2015-16 ఎల్‌ నినో కూడా రికార్డు స్థాయి వేడితో చరిత్రలో నిలిచింది. అయితే ప్రస్తుతం కనిపిస్తున్న సముద్ర మార్పులు.. 2026 ఎల్‌ నినో వీటిని మించే స్థాయికి చేరవచ్చనే అంచనాలకు కారణమవుతున్నాయి.

ప్రముఖ వాతావరణ శాస్త్రవేత్తల విశ్లేషణ ప్రకారం.. 14 ప్రధాన వాతావరణ నమూనాల నుంచి సేకరించిన వందలాది అంచనాల్లో ఎక్కువ భాగం ఈసారి ఎల్‌ నినో బలంగా మారే అవకాశాలను సూచిస్తున్నాయి. ముఖ్యంగా ఉష్ణమండల పసిఫిక్‌లోని నినో-3.4 ప్రాంతంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3.6 డిగ్రీల సెల్సియస్‌ వరకు పెరిగే అవకాశం ఉందని కొన్ని నమూనాలు అంచనా వేస్తున్నాయి.

ఇది 2015-16లో నమోదైన దాదాపు 2.75 డిగ్రీల సెల్సియస్‌ పెరుగుదల కంటే ఎక్కువ. ఈ అంచనాలు నిజమైతే.. గత 150 ఏళ్ల వాతావరణ రికార్డుల్లోనే ఇది అత్యంత అసాధారణమైన ఎల్‌ నినోగా నిలిచే అవకాశం ఉంది.

నాసా ఉపగ్రహాల్లో కనిపించిన వేడి అలలు
పసిఫిక్‌ మహాసముద్రంలో జరుగుతున్న మార్పులను నాసా, యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ సంయుక్తంగా నిర్వహిస్తున్న సెంటినెల్‌-6 మైఖేల్‌ ఫ్రైలిచ్‌ ఉపగ్రహం పరిశీలిస్తోంది. ఉపగ్రహ డేటాలో సముద్రం లోతుల్లో ప్రయాణించే కెల్విన్‌ తరంగాలు (Kelvin Waves) భారీ మొత్తంలో వేడి నీటిని తూర్పు పసిఫిక్‌ వైపు తరలిస్తున్నట్లు గుర్తించారు. ఎల్‌ నినో ఏర్పడటంలో ఈ తరంగాలు కీలక పాత్ర పోషిస్తాయి.

సాధారణ పరిస్థితుల్లో పసిఫిక్‌ మహాసముద్రంలో గాలుల ప్రవాహం, సముద్ర ఉష్ణోగ్రతల మధ్య సమతుల్యత ఉంటుంది. అయితే ట్రేడ్‌ గాలులు బలహీనపడినప్పుడు.. సముద్రం లోతుల్లో దాగి ఉన్న వేడి నీరు తూర్పు వైపు కదులుతుంది. దీంతో సముద్ర ఉపరితలం వేడెక్కి ఎల్‌ నినో పరిస్థితులు ఏర్పడతాయి.

వేగం కూడా శాస్త్రవేత్తలకు షాక్‌
ఈసారి ఎల్‌ నినో తీవ్రత మాత్రమే కాదు.. అది అభివృద్ధి చెందుతున్న వేగం కూడా నిపుణుల దృష్టిని ఆకర్షిస్తోంది. 1997-98 ఎల్‌ నినో అత్యంత వేగంగా బలపడిన ఘటనల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. అయితే ప్రస్తుత పరిణామాలు అంతకంటే వేగంగా మారుతున్నట్లు కొన్ని వాతావరణ అంచనాలు సూచిస్తున్నాయి. మరో ఆసక్తికర అంశం ఏమిటంటే.. 2026 ప్రారంభంలో లా నినా తరహా పరిస్థితుల నుంచి ఈ ఎల్‌ నినో రూపుదిద్దుకుంటున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా ఇలాంటి సముద్ర మార్పులకు ఎక్కువ సమయం పడుతుంది. కానీ ఈసారి తక్కువ వ్యవధిలోనే పసిఫిక్‌ వేడెక్కడం నిపుణులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

అసలు ఎల్‌ నినో అంటే..
పసిఫిక్‌ మహాసముద్రంలో సాధారణంగా తూర్పు నుంచి పడమరకు వీచే ట్రేడ్‌ గాలులు వేడి నీటిని పశ్చిమ ప్రాంతాలకు తరలిస్తాయి. అదే సమయంలో సముద్రం లోతుల్లోని చల్లని నీరు పైకి వస్తుంది. అయితే ఈ గాలులు బలహీనపడినప్పుడు పరిస్థితి మారుతుంది. సముద్రం అడుగున ఉన్న వేడి నీరు తూర్పు పసిఫిక్‌ వైపు చేరుతుంది. దీంతో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఈ పరిణామాన్నే ఎల్‌ నినో అంటారు. ఇది కేవలం ఒక సముద్ర ప్రాంతానికి పరిమితమైన మార్పు కాదు. ప్రపంచ వాతావరణ వ్యవస్థపై ప్రభావం చూపించే శక్తివంతమైన ప్రకృతి ప్రక్రియ.

ప్రపంచ వాతావరణంపై ప్రభావం ఎలా?
శక్తివంతమైన ఎల్‌ నినో ఏర్పడితే ప్రపంచవ్యాప్తంగా వాతావరణ నమూనాల్లో మార్పులు కనిపించే అవకాశం ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలు సంభవించే అవకాశం ఉండగా.. మరికొన్ని ప్రాంతాల్లో తీవ్ర కరువు, వేడి గాలులు పెరగొచ్చు. దీని ప్రభావంతో ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరగడం, వ్యవసాయ ఉత్పత్తులు తగ్గడం, నీటి కొరత, అటవీ అగ్నిప్రమాదాలు, సముద్ర ఉష్ణోగ్రతలు పెరగడం వంటి పరిణామాలు చోటుచేసుకోవచ్చు.

భారత్‌పై ఎలాంటి ప్రభావం?
భారత్‌కు ఎల్‌ నినో ప్రభావం అత్యంత కీలకం. ముఖ్యంగా నైరుతి రుతుపవనాలపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా బలమైన ఎల్‌ నినో సంవత్సరాల్లో రుతుపవనాలు బలహీనపడే అవకాశం ఉంటుంది. దీంతో వ్యవసాయం, నీటి వనరులు, విద్యుత్‌ ఉత్పత్తిపై ప్రభావం పడొచ్చు. వర్షాలు తగ్గితే పంట దిగుబడులు తగ్గడం, నీటి కొరత పెరగడం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. అయితే భారత రుతుపవనాలపై ఎల్‌ నినోతో పాటు హిందూ మహాసముద్ర డైపోల్‌ (IOD), స్థానిక వాతావరణ పరిస్థితులు కూడా ప్రభావం చూపుతాయని నిపుణులు చెబుతున్నారు.

వాతావరణ మార్పులతో కలిస్తే మరింత ముప్పు?
ప్రపంచ ఉష్ణోగ్రతలు ఇప్పటికే పెరుగుతున్న సమయంలో.. ఇలాంటి శక్తివంతమైన ఎల్‌ నినో మరింత తీవ్రమైన ప్రభావాలను చూపే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు పరిశీలిస్తున్నారు. 2023, 2024లో ప్రపంచం రికార్డు స్థాయి వేడిని చూసింది. ఇప్పుడు మరో బలమైన ఎల్‌ నినో కూడా తోడైతే.. ప్రపంచ ఉష్ణోగ్రతలు మరోసారి కొత్త రికార్డులను తాకుతాయా? అనే అంశంపై నిపుణులు దృష్టి సారించారు.

ప్రస్తుతం పసిఫిక్‌ మహాసముద్రం లోతుల్లో నిశ్శబ్దంగా పేరుకుపోతున్న వేడి.. రాబోయే నెలల్లో ప్రపంచ వాతావరణాన్ని ప్రభావితం చేసే శక్తిగా మారుతుందా? అన్నదే కీలక ప్రశ్న. ‘గాడ్జిల్లా ఎల్‌ నినో’ నిజంగా బలపడితే.. దాని ప్రభావం పసిఫిక్‌ తీరాలకే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా కనిపించే అవకాశం ఉంది.

Videos

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)