Breaking News

తాలిబాన్‌ సర్కార్‌కు రష్యా బంపరాఫర్‌.. పాక్‌కు కొత్త టెన్షన్‌!

Published on Wed, 06/03/2026 - 13:05

 రష్యా, తాలిబాన్ల సర్కార్‌ పాలిత ఆఫ్ఘనిస్థాన్‌ మధ్య కీలక ఒప్పందం కుదిరింది. ఇరుపక్షాల మధ్య తొలి సైనిక-సాంకేతిక సహకార(Military-Technical Cooperation Agreement) ఒప్పందానికి గ్రీన్‌సిగ్నల్‌ పడింది. అయితే, ఈ ఒప్పందంలోని పూర్తి వివరాలు బహిరంగంగా వెల్లడించలేదు. కానీ, ఆయుధాల సరఫరా, సైనిక సాంకేతిక పరిజ్ఞానం బదిలీ అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో, ఈ ఒప్పందం ప్రాంతీయ రాజకీయాల్లో పెద్ద మార్పుగా విశ్లేషకులు చూస్తున్నారు. కీలక ఒప్పందం కారణంగా దాయాది దేశం పాకిస్తాన్‌కు టెన్షన్‌ మొదలైంది. ఇదే సమయంలో భారత్‌కు ఇది సానుకూల అంశం కానున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు.

2026 మే 27న మాస్కోలో జరిగిన అంతర్జాతీయ భద్రతా సమావేశం సందర్భంగా అఫ్గానిస్థాన్ రక్షణ మంత్రి మహ్మద్‌ యాకూబ్‌, రష్యా భద్రతా మండలి కార్యదర్శి సెర్గీయి షోయిగూ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందంలోని పూర్తి వివరాలు బహిరంగంగా వెల్లడించలేదు. అయితే సాధారణంగా ఇటువంటి మిలిటరీ-టెక్నికల్ ఒప్పందాల్లో ఆయుధాల సరఫరా, సైనిక సాంకేతిక పరిజ్ఞానం బదిలీ, శిక్షణ, నిర్వహణ, లైసెన్సింగ్,
ఉమ్మడి అభివృద్ధి ప్రాజెక్టులు ఉంటాయి.

ఎందుకు ముఖ్యమైనది?
ఆప్ఘనిస్తాన్‌లో 2021లో తాలిబాన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రపంచంలోని చాలా దేశాలు అధికారిక గుర్తింపు ఇవ్వలేదు. కానీ రష్యా 2025లో తాలిబాన్ ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తించిన తొలి దేశంగా నిలిచింది. అప్పటి నుంచి భద్రత, వాణిజ్యం, మౌలిక సదుపాయాలు, ఇప్పుడు రక్షణ రంగాల్లో కూడా సంబంధాలను వేగంగా పెంచుతోంది.

రష్యా ఎందుకు తాలిబాన్‌కు దగ్గరవుతోంది?
1. ISIS-K ముప్పు
రష్యా ప్రస్తుతం ఆఫ్ఘనిస్థాన్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న Islamic State–Khorasan Provinceను పెద్ద భద్రతా ముప్పుగా చూస్తోంది.
2024లో మాస్కోలో జరిగిన Crocus City Hall ఉగ్రదాడి తర్వాత రష్యా ఆఫ్ఘనిస్థాన్‌లోని ఉగ్రవాద నెట్‌వర్క్‌లపై మరింత అప్రమత్తమైంది. తాలిబాన్‌తో సహకారం ద్వారా ISIS-Kను నియంత్రించవచ్చని మాస్కో భావిస్తోంది.

2. మధ్య ఆసియాలో ప్రభావం
ఆఫ్ఘనిస్థాన్‌కు ఆనుకుని ఉన్న మధ్య ఆసియా దేశాలు రష్యా భద్రతా వ్యూహంలో కీలకమైనవి. ఆఫ్ఘనిస్థాన్‌లో స్థిరత్వం లేకపోతే ఆ ప్రభావం నేరుగా మధ్య ఆసియాపై పడుతుంది. 2021లో ఆఫ్ఘనిస్థాన్‌లో అమెరికా ఉపసంహరణ తర్వాత ఏర్పడిన వ్యూహాత్మక ఖాళీని రష్యా, చైనా, ఇరాన్ వంటి దేశాలు భర్తీ చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. రష్యా ఈ ఒప్పందాన్ని ఆ దిశలో మరో అడుగుగా చూస్తోంది.

పాకిస్తాన్‌కు టెన్షన్‌?
ఇదే ఈ పరిణామంలో అత్యంత కీలక అంశం. రష్యా నేరుగా తాలిబాన్‌తో సంబంధాలు బలోపేతం చేస్తోంది. గత రెండు దశాబ్దాలుగా ఆఫ్ఘనిస్థాన్‌లో పాకిస్థాన్ ప్రభావశీల దేశంగా ఉండేది. కానీ ఇప్పుడు తాలిబాన్–పాకిస్థాన్ మధ్య సంబంధాలు క్రమంగా క్షీణించాయి. ఇటీవలి కాలంలో ఇరు పక్షాల మధ్య యుద్ధం కూడా జరిగింది. పాక్‌ ఆరోపణ ప్రకారం టీటీపీ Tehrik-i-Taliban Pakistan (TTP) యోధులు ఆఫ్ఘనిస్థాన్‌లో ఆశ్రయం పొందుతున్నారు. తాలిబాన్ ఈ ఆరోపణలను తిరస్కరిస్తోంది. దీంతో రెండు దేశాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు పెరిగాయి. ఇప్పుడు రష్యాతో కుదిరిన ఒప్పందం కారణంగా తాలిబాన్‌లకు ఆయుధాల సరఫరా, సైనిక సాంకేతిక పరిజ్ఞానం బదిలీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో, తాలిబాన్లు.. పాకిస్తాన్‌కు పక్కలో బల్లెంలా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఇందుకే పాక్‌ ఆందోళనకు గురవుతోంది. 

భారత్‌ సంగతేంటి? 
భారత్‌ అధికారికంగా తాలిబాన్ ప్రభుత్వాన్ని గుర్తించకపోయినా ఆఫ్ఘనిస్థాన్‌తో పరిమిత దౌత్య సంబంధాలు కొనసాగిస్తోంది. ఇటు రష్యాతోనూ మంచి స్నేహం ఉంది. దీంతో, భారత్‌పై పాక్‌ అనుసరించే చర్చకు చెక్‌ పడే అవకాశం ఉంది. అయితే, ఈ ఒప్పందం తాలిబాన్ అంతర్జాతీయ గుర్తింపు పొందే ప్రయత్నంలో పెద్ద ముందడుగుగా అనేక దేశాలు భావిస్తున్నాయి. రష్యా మధ్య ఆసియాలో తన ప్రభావాన్ని విస్తరించే వ్యూహంగా విశ్లేషించుకుంటున్నాయి.

చైనా పాత్ర.. 
డ్రాగన్‌ కంట్రీ చైనా కూడా తాలిబాన్‌తో సంబంధాలు పెంచుకుంటోంది. అక్కడి ఖనిజ సంపదపై చైనా కన్నేసిందని వార్తలు సైతం బయటకు వచ్చాయి. ఆఫ్ఘనిస్థాన్‌లోని లిథియం, రాగి వంటి ఖనిజాలపై చైనా, రష్యా రెండింటికీ ఆసక్తి ఉందని సమాచారం. ఈ నేపథ్యంలో రష్యా–చైనా–తాలిబాన్ సమీకరణం బలపడితే కొత్త వ్యూహాత్మక సవాళ్లు ఎదురుకావచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. 

మొత్తానికి ఒకప్పుడు ఆఫ్ఘనిస్థాన్‌లో యుద్ధం చేసిన రష్యా, ఇప్పుడు తాలిబాన్ ప్రభుత్వంతో భద్రతా భాగస్వామిగా మారుతోంది. రష్యా–తాలిబాన్ ఒప్పందం ఇప్పటికైతే సాంకేతిక-సైనిక సహకారానికి పరిమితమైనా, దీని అసలు ప్రాధాన్యం ఆఫ్ఘనిస్థాన్‌ను అంతర్జాతీయ రాజకీయాల్లో తిరిగి స్థాపించడం, రష్యా ప్రభావాన్ని పెంచడం, దక్షిణాసియా శక్తి సమీకరణాలను మార్చడమేనని తెలుస్తోంది. 

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)