'ఏఐ' నూతన పారిశ్రామిక విప్లవానికి నాంది!

Published on Sun, 07/12/2026 - 00:51

ఈరోజు పట్టాలు అందుకుంటున్న 2026 బ్యాచ్‌ విద్యార్థులందరికీ నా హృదయపూర్వక అభినందనలు. ఈ రోజు మీ జీవితంలో ఎంతో ప్రత్యేకమైన రోజు. ఎన్నో ఏళ్ల కష్టం, పట్టుదల, త్యాగానికి ఇది ప్రతిఫలం. కానీ ఈ విజయం మీదే కాదు. మీ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, మార్గదర్శకులు, మిమ్మల్ని నమ్మిన ప్రతి ఒక్కరిది! మీకు ఇది జీవితంలో మరో ముందడుగు మాత్రమే కావచ్చు. కానీ ఒక తల్లికి మాత్రం తన బిడ్డ పట్టా అందుకోవడం జీవితకాల కల నెరవేరిన క్షణం. నా తల్లిదండ్రులు కూడా ఈరోజు నన్ను చూసి ఎంతో గర్వపడుతున్నారు. నా విజయం వారి కలల ఫలితం. నిజానికి నేను వారి అమెరికా కలకు రూపం. ఈ సభలో ఉన్న చాలామంది విద్యార్థుల్లాగే నేను కూడా మొదటి తరం వలసదారుడిని. నా తల్లిదండ్రులు (తైవాన్‌ నుంచి) అమెరికాకు రావడానికి కారణం ఒక్కటే. ‘మా పిల్లలకు మంచి అవకాశం దొరకాలి’ అనే ఆశ. 

నాకు ముప్పై సంవత్సరాల వయసులో, నా స్నేహితులతో కలిసి ఎన్‌విడియాను ప్రారంభించాను. మా లక్ష్యం ఒక కొత్త తరహా కంప్యూటర్‌ను రూపొందించడం. సాధారణ కంప్యూటర్లు సాధించలేని సమస్యలను పరిష్కరించే శక్తిమంతమైన వ్యవస్థను నిర్మించాలని అనుకున్నాం. కొద్ది రోజుల్లోనే అసలు నిజం తెలిసింది. మేము రూపొందించిన తొలి సాంకేతికత పూర్తిగా విఫలమైంది. డబ్బు కూడా అయిపోయే పరిస్థితి వచ్చింది. గత 33 ఏళ్లుగా ఎన్‌ విడియా ఎన్నోసార్లు తనను తాను మార్చుకుంది. ప్రతిసారి ఒకే ప్రశ్న వేసుకుంది: ‘ఇందులో ఎంత కష్టముంటుంది?’ ప్రతిసారి సమాధానం ఒక్కటే: ‘మనం అనుకున్నదానికంటే చాలా కష్టం.’ కానీ ప్రతి వైఫల్యం మాకు కొత్త పాఠం నేర్పింది. ప్రతి అపజయం మమ్మల్ని మరింత వినయంగా మార్చింది. ప్రతి కష్టం మా వ్యక్తిత్వాన్ని మరింత దృఢంగా తీర్చిదిద్దింది. వైఫల్యం అనేది విజయానికి వ్యతిరేకం కాదు. వైఫల్యం విజయానికి తీసుకెళ్లే మరో మెట్టు మాత్రమే. ప్రతిసారి పడిపోయి మళ్లీ లేవడంవల్లే జీవితంలో నిజమైన ధైర్యం వస్తుంది. అదే మన విజయానికి అసలైన బలం. 

ప్రపంచాన్ని మార్చే కొత్త యుగం
మీ కలలను నిజం చేసుకునే అద్భుతమైన అవకాశం ఇప్పుడు మీ ముందుంది. మీ కెరీర్‌ ప్రారంభమవుతున్న సమయం... ప్రపంచ చరిత్రలో అత్యంత ఉత్కంఠభరితమైన దశ. నేను ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించినప్పుడు ప్రపంచం పర్సనల్‌ కంప్యూటర్స్‌ (పీసీ) విప్లవం ప్రారంభ దశలో ఉంది. మీరు మాత్రం కృత్రిమ మేధస్సు (ఏఐ) విప్లవం ప్రారంభమవు తున్న సమయంలో కెరీర్‌ మొదలుపెడుతున్నారు. దీనికంటే గొప్ప అవకాశం మరొకటి ఉండదని నేను నమ్ముతున్నాను. 

నా జీవితంలో కంప్యూటింగ్‌ రంగంలో వచ్చిన ప్రతి పెద్ద మార్పును నేను చూశాను. మెయిన్‌ ఫ్రేమ్‌ కంప్యూటర్లు, పర్సనల్‌ కంప్యూటర్లు, ఇంటర్నెట్, మొబైల్‌ టెక్నాలజీ, క్లౌడ్‌ కంప్యూటింగ్‌... ప్రతి దశ ప్రపంచాన్ని మార్చింది. ప్రతి కొత్త ఆవిష్కరణ మానవ జీవితాన్ని మరింత సులభం చేసింది. కానీ ఇప్పుడు మనం చూడబోతున్న మార్పు వీటన్నింటికంటే పెద్దది. ఇది కేవలం మరో సాంకేతిక పరిణామం కాదు. ఇది కంప్యూటింగ్‌ ప్రపంచానికే కొత్త ఆరంభం. గత ఆరు దశాబ్దాలుగా కంప్యూటర్లు ఒకే విధంగా పని చేశాయి. మనుషులు కోడ్‌ రాస్తారు. కంప్యూటర్లు ఆ ఆదేశాలను అమలు చేస్తాయి. ఇంతకాలం ఇదే సూత్రం. కానీ ఇప్పుడు... ఆ యుగం ముగిసింది. ఏఐ కంప్యూటింగ్‌ను పూర్తిగా కొత్త దిశలోకి తీసుకెళ్లింది. 

ఇకపై కంప్యూటర్లు కేవలం ఆదేశాలు పాటించే యంత్రాలు కావు. అవి అర్థం చేసుకుంటాయి. తర్కిస్తాయి. ప్రణాళికలు రూపొందిస్తాయి. అవసరమైన సాధనాలను ఉపయోగించి సమస్యలకు పరిష్కారాలు కనుగొంటాయి. ఒకప్పుడు మనం సాఫ్ట్‌వేర్‌ను రాసి సీపీయూలపై నడిపించే వాళ్లం. ఇప్పుడు ఏఐ వ్యవస్థలు భారీ న్యూరల్‌ నెట్‌వర్క్‌ల ద్వారా జీపీయూలపై పనిచేస్తున్నాయి. ఇది కేవలం వేగం పెర గడం కాదు, కంప్యూటర్లు ఆలోచించే విధానమే మారుతోంది. వ్యవసాయం నుంచి వైద్యం వరకు, విద్య నుంచి పరిశ్రమల వరకు, వ్యాపారం నుంచి శాస్త్ర పరిశోధనల వరకు... ప్రతి రంగా నికి ఏఐ అవసరం. ఏఐ ప్రతి పరిశ్రమనూ మార్చబోతోంది. 

ఏఐపై భయం సహజమే!
ఏఐ చిత్రాలు గీస్తోంది. వ్యాసాలు రాస్తోంది. సాఫ్ట్‌వేర్‌ తయారు చేస్తోంది. కార్లను నడుపుతోంది. ఇలాంటప్పుడు సహజంగానే కొన్ని ప్రశ్నలు ఎదురవుతాయి: ఉద్యోగాలు పోతాయా? మనిషి అవసరం తగ్గిపోతుందా? అసలు ఈ టెక్నాలజీ మన నియంత్రణలో ఉంటుందా? ఇలాంటి సందేహాలు కొత్తవి కావు. ప్రపంచ చరిత్రలో ప్రతి గొప్ప సాంకేతిక విప్లవం వచ్చినప్పుడు కూడా ఇలాంటి భయాలే పుట్టాయి. విద్యుత్‌ వచ్చినప్పుడు కూడా భయపడ్డారు. ఇంటర్నెట్‌ వచ్చి నప్పుడు కూడా సందేహించారు. కానీ మానవ సమాజం కొత్త సాంకేతి కతను బాధ్యతతో స్వీకరించిన ప్రతిసారీ... అది మన సామ ర్థ్యాన్ని మరింత విస్తరించింది. ఏఐని తెలివిగా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మనదే. 

ఇకపై ప్రతి ఒక్కరూ ప్రోగ్రామర్‌లే. ఇప్పటి వరకు కంప్యూటర్‌ ప్రోగ్రామింగ్‌ చేయగలిగినవారు ప్రపంచ జనాభాలో చాలా తక్కువ మంది మాత్రమే. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారుతోంది. కోడ్‌ ఎలా రాయాలో తెలియకపోయినా, మనకు కావాల్సిన పనిని సహజమైన భాషలో ఏఐకి చెప్పగలిగితే చాలు. మిగతా పనిని ఏఐ పూర్తి చేస్తుంది. ఒక చిన్న దుకాణం నడిపే వ్యాపారి... ఏఐ సహాయంతో తన వ్యాపారం కోసం అందమైన వెబ్‌సైట్‌ను రూపొందించుకోవచ్చు. ఒక వడ్రంగి... కస్టమర్‌కు వంటగది నమూనాలను రూపొందించి చూపించవచ్చు. ఒక ఉపాధ్యా యుడు కొత్త పాఠ్యాంశాలను సిద్ధం చేయవచ్చు. ఒక వైద్యుడు... వైద్య సమాచారాన్ని వేగంగా విశ్లేషించవచ్చు. ఒక రైతు... పంట లపై మెరుగైన నిర్ణయాలు తీసుకోవచ్చు. ఏఐ వల్ల కంప్యూటింగ్‌ శక్తి కొద్దిమందికే పరిమితం కాకుండా... ప్రపంచంలోని ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి వస్తోంది. ఇదే ఏఐ తీసుకొస్తున్న అతిపెద్ద ప్రజాస్వామిక మార్పు. 

ఏఐ ఉద్యోగాలను మారుస్తుంది!
విద్యుత్‌ ఎలా ప్రపంచాన్ని మార్చిందో... ఇంటర్నెట్‌ ఎలా మన జీవన విధానాన్ని మార్చిందో... అలాగే ఏఐ కూడా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా మార్చబోతోంది. దీనికోసం ప్రపంచవ్యాప్తంగా లక్షల కోట్ల డాలర్ల పెట్టుబడులు అవసరం అవుతాయి. ఇది మానవ చరిత్రలోనే అతిపెద్ద సాంకేతిక మౌలిక వసతుల నిర్మాణ కార్యక్రమంగా నిలవబోతోంది. ఏఐ కోసం కొత్త చిప్‌ తయారీ కేంద్రాలు, అత్యాధునిక కంప్యూటర్‌ కర్మాగా రాలు ఏర్పాటవుతాయి. భారీ డేటా సెంటర్లు నిర్మిస్తారు. ఆధు నిక తయారీ పరిశ్రమలు విస్తరిస్తాయి. ఎలక్ట్రీషియన్లు,ప్లంబర్లు, ఇనుప కార్మికులు, టెక్నీషియన్లు, నిర్మాణ రంగ కార్మికులు... ప్రతి ఒక్కరికీ కొత్త అవకాశాలు లభిస్తాయి. 

ఏఐ కేవలం ఒక కొత్త కంప్యూటింగ్‌ యుగాన్ని మాత్రమే కాదు... ఒక కొత్త పారిశ్రామిక యుగాన్ని కూడా ప్రారంభిస్తోంది. శక్తిమంతమైన ఏఐకి శక్తిమంతమైన విద్యుత్‌ అవసరం. అందుకే విద్యుత్‌ ఉత్పత్తి పెరుగుతుంది. విద్యుత్‌ గ్రిడ్‌లను ఆధునికీకరిస్తారు. పునరుత్పాదక ఇంధన వనరులపై పెట్టు బడులు పెరుగుతాయి. ఏఐ అభివృద్ధి కేవలం కంప్యూటర్లనే కాదు, మొత్తం మౌలిక వసతుల అభివృద్ధినే వేగవంతం చేస్తుంది. ఏఐ ఉద్యోగాలను మార్చుతుంది... కానీ మనిషి లక్ష్యాన్ని కాదు.

చాలామంది అడుగుతున్న ప్రశ్న: ‘ఏఐ వల్ల ఉద్యోగాలు పోతాయా?’ నా సమాధానం: ప్రతి ఉద్యోగాన్నీ ఏఐ ప్రభా వితం చేస్తుంది. ఉద్యోగంలోని కొన్ని పనులు యంత్రాలు చేయవచ్చు. కొన్ని పాత ఉద్యోగాలు తగ్గవచ్చు. అదే సమయంలో ఎన్నో కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయి. కొత్త పరిశ్ర మలు ఏర్పడతాయి. ఉదాహరణకు, ఈరోజు ఏఐ చాలావరకు సాఫ్ట్‌వేర్‌ కోడ్‌ రాయగలుగుతోంది. అంటే... సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు అవసరం లేదని కాదు. వారు ఇప్పుడు ఏఐ సహా యంతో మరింత క్లిష్టమైన సమస్యలకు పరిష్కారాలు కనుగొన గలుగుతున్నారు. ఏఐ వైద్య చిత్రాలను వేగంగా విశ్లేషించగలదు. కానీ రోగిని అర్థం చేసుకుని సరైన చికిత్స అందించే వైద్యుడి స్థానాన్ని అది భర్తీ చేయదు. ఏఐ మనిషిని తొలగించడానికి రాలేదు. మనిషి సామర్థ్యాన్ని మరింత పెంచడానికి వచ్చింది. మిమ్మల్ని ఏఐ భర్తీ చేయకపోవచ్చు, కానీ ఏఐ బాగా ఉపయోగించే వ్యక్తి ఆ పని చేయవచ్చు. ఏఐ మీ ఉద్యోగాన్ని తీసేయక పోవచ్చు. కానీ ఏఐని సమర్థంగా ఉపయోగించడం నేర్చుకున్న వ్యక్తి మీకంటే ముందుకు వెళ్లే అవకాశం ఉంది. 

ఏఐ మానవ జ్ఞానాన్ని మరింత వేగంగా విస్తరించబోతోంది. ఇప్పటి వరకు అసాధ్యంగా అనిపించిన ఎన్నో సమస్య లకు పరిష్కారాలు కనుగొనబోతోంది. ప్రపంచంలోని కోట్లాది మందికి కంప్యూటింగ్‌ శక్తిని అందించబోతోంది. మనం నిర్మించే భవిష్యత్తు... ఈరోజు మనకు లభించిన ప్రపంచం కంటే మరింత సంపన్నంగా, మరింత సామర్థ్యవంతంగా, మరింత ఆశాజనకంగా ఉండే అవకాశం ఉంది. ఇంత శక్తిమంతమైన సాధనాలు, ఇంత గొప్ప అవకా శాలతో ప్రపంచంలోకి అడుగుపెట్టిన తరం ఇంతకుముందు లేదు. మనమంతా ఒకే ప్రారంభ రేఖ వద్ద నిలబడి ఉన్నాం. రాబోయే భవిష్యత్తు ఎలా ఉండాలో నిర్ణయించే అవకాశం ఇప్పుడు మీ ముందుంది. కాబట్టి నెమ్మదిగా నడవకండి... ధైర్యంగా ముందుకు పరుగెత్తండి! 

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)