Breaking News

ఆర్థిక యుద్ధం గెలవగలరా?

Published on Thu, 01/30/2025 - 00:20

అమెరికా కొత్త అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఎన్ని ఉత్తర్వుల తుఫానును సృష్టిస్తున్నా, వాటన్నింటి అంతిమ లక్ష్యం ఆర్థిక సంబంధ మైనదే. ఆయన తన మొదటి విడత పాలనా కాలంలో (2017–21) ఇచ్చి ఈసారి మళ్లీ ఇస్తున్న ‘మేక్‌ అమెరికా గ్రేట్‌ అగైన్‌’ (మాగా) నినాదంలోని ఉద్దేశం కూడా అదే. పౌరసత్వా లపై, వలసలపై ఆంక్షలు; దిగుమతులపై భారీగా సుంకాలు; గ్రీన్‌లాండ్, పనామా కాలువల స్వాధీనం; చైనాపై వాణిజ్య యుద్ధం; చమురు ధరలు తగ్గించాలనీ, తమ దేశంలో పెట్టుబడులు పెట్టాలనీ అరబ్‌ దేశాలపై ఒత్తిడులు; ఇతరులు అమెరికా చమురునే ఖరీదు చేయాలనటం; తాము అధిక నిధులు ఇస్తున్నామంటూ డబ్ల్యూహెచ్‌ఓ, ప్యారిస్‌ ఒప్పందాల నుంచి ఉపసంహరణ;  డాలర్‌కు పోటీ రావద్దంటూ బ్రిక్స్‌ కూటమికి బెదిరింపులు... ఇట్లా దేనిని గమనించినా వాటన్నింటి వెనుక కనిపించేది ఆర్థిక విషయాలే.

ఆధిపత్యపు గుప్పిటి
ఏ అధ్యక్షుడైనా తమ దేశం ఆర్థికంగా బలంగా ఉండాలనీ, ప్రపంచంలో అగ్ర స్థానంలో నిలబడాలనీ కోరుకోవటంలో ఆక్షేపించ వలసింది ఏమీ లేదు. వాస్తవానికి, రెండవ ప్రపంచ యుద్ధం ముగిసి బ్రిటిష్‌ సామ్రాజ్యం కుప్పగూలినప్పటి నుంచి అమెరికాదే అగ్రస్థానం. అయినప్పటికీ ట్రంప్‌ ఆర్థిక యుద్ధం అనదగ్గ రీతిలో పై చర్య లను ఎందువల్ల ప్రకటిస్తున్నట్లు? అమెరికా బలానికి మూలస్తంభాలు నాలుగున్నాయి. ఒకటి, ఆర్థిక స్థితి. రెండు, సైనిక శక్తి. మూడు, ఉన్నత విద్యతోపాటు శాస్త్ర–సాంకేతిక రంగాలలోని ప్రతిభా సామ ర్థ్యాలు. నాలుగు, ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్, డబ్ల్యూటీఓ, ఐక్య రాజ్యసమితి వంటి ప్రపంచ వ్యవస్థలపై ఆధిపత్యం. ఈ నాలుగు అమెరికా గుప్పిట్లో ఉన్నంతకాలం అమెరికా సామ్రాజ్యానికి ముప్పు ఉండదు. ఈ పాఠాలను వారు బ్రిటిష్‌ సామ్రాజ్య పతనం నుంచి నేర్చుకున్నారు. కనుక ఈ ఆధిపత్యాలు చెదరకూడదు.

రెండవ ప్రపంచ యుద్ధంలో హిట్లర్‌ జర్మనీ ఓడిన తర్వాత సోవియెట్‌ యూనియన్‌ నాయకత్వాన కమ్యూనిస్టు శిబిరం బలపడి,  అమెరికాకు మొదటి పెద్ద సవాలుగా నిలిచింది. కానీ, సోవియెట్‌ కూటమి అమెరికాకు సైద్ధాంతికంగా, సైనికంగా మాత్రమే సవాలు అయింది తప్ప, పైన పేర్కొన్న మొత్తం నాలుగు రంగాలలోనూ కాలేకపోయింది. చివరకు పలు స్వీయాపరాధాలవల్ల కుప్పకూలింది. ఇది 1991 చివరి దశ మాట. తర్వాత 30 ఏళ్లపాటు అమెరికాకు ఎదురులేక పోయింది. 

చైనా సవాలు
ఆ విధంగా తమకు ఎదురు లేదని భావిస్తుండగా రష్యా తన అపారమైన సహజ వనరుల బలంతో నెమ్మదిగా పుంజుకోవటం మొదలైంది. దానితోపాటు మరికొన్ని పరిణామాలు అమెరికాకు సరికొత్త సవాలుగా మారసాగాయి. ఈ పరిణామాలలో అన్నింటి కన్నా ప్రధానమైంది చైనా అనూహ్యమైన అభివృద్ధి. అందుకు ఆరంభం ఆ దేశం 2001లో డబ్ల్యూటీఓలో ప్రవేశించటంతో మొదలైంది. 1980–90 మధ్య తెంగ్‌ శియావ్‌ పింగ్‌ ఆర్థిక సంస్కరణలకు పునాదులు వేయగా, డబ్ల్యూటీఓ ప్రవేశంతో అందుకు మహా వేగం వచ్చింది. పదేళ్లయేసరికి అమెరికా తర్వాత రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. 2017 నాటికైతే పర్ఛేజింగ్‌ పవర్‌ పేరిటీ (పీపీపీ; దేశాల మధ్య కొనుగోలు శక్తిలోని తారతమ్యం) కొలమానాల ప్రకారం అమెరికాను సైతం మించిపోయింది.

ఇక్కడ చెప్పుకోవలసిన ముఖ్యమైన విషయం ఒకటుంది. అది సోవియెట్‌ యూనియన్‌ వ్యూహానికీ, చైనా వ్యూహానికీ మధ్యగల తేడా. సోవియెట్‌ పతనం నుంచి పాఠాలు నేర్చుకున్న చైనా, అమెరికా వలెనే ఒక సమగ్ర వ్యూహాన్ని అనుసరించేందుకు ప్రయత్నిస్తూ వస్తున్నది. ఆర్థికాభివృద్ధి, సైనికాభివృద్ధి, విద్యతోపాటు శాస్త్ర–సాంకేతిక రంగాల అభివృద్ధి, అంతర్జాతీయ సంస్థలలో పలుకు బడిని క్రమంగా పెంచుకోవటం. ఇవిగాక, అమెరికా, యూరోపియన్‌ దేశాలు ప్రపంచవ్యాప్తంగా గల చిన్న దేశాల సహజ వనరులను, మార్కెట్లను కొల్లగొడుతూ వాటిని తమ చెప్పు చేతలలో ఉంచుకునేందుకు ప్రయత్నిస్తుండగా, చైనా తన అపారమైన ధన సంపదతో వాటి అభివృద్ధికి సహకరించటంతో పాటు తాను కూడా లాభపడే వ్యూహాన్ని అనుసరించటం మొదలుపెట్టింది.

అమెరికా, యూరప్‌ ఉత్పత్తుల ఖర్చు పెరగటంతో పరిశ్రమలను తమంతట తామే చైనాకు, ఆగ్నేయాసియా దేశాలకు తరలించటం, అక్కడి నుంచి చవకగా దిగుమతి చేసుకోవటం అనే వ్యూహం తొలుత బాగానే పనిచేసింది. కానీ తర్వాత అదే వారికి సమస్యగా మారింది. అనేక ఆధునిక పరిశోధనలు, ఉత్పత్తుల విషయంలో చైనా తదితర దేశాలు అమెరికా కన్నా ముందుకు వెళ్లి పోయాయి.

బ్రిక్స్‌ సవాలు
అమెరికా కూటమికి దీనికిదే ఒక జంకుగా మారగా, చైనా చొరవతో ఏర్పడిన బెల్ట్‌ అండ్‌ రోడ్‌ పథకం, బ్రిక్స్‌ కూటమి పెద్ద సవాళ్లు అయాయి. ఇండియా కొన్ని కారణాల వల్ల బెల్ట్‌ పథకంలో చేరలేదుగానీ, 2009లో వ్యవస్థాపితమైన బ్రిక్స్‌లో వ్యవస్థాపక సభ్య దేశం కావటం గమనించదగ్గది. అమెరికా ఏక ధృవ ప్రపంచంవల్ల కలుగుతున్న హానిని గుర్తించిన ముఖ్యమైన దేశాలు కొన్ని బహుళ ధృవ ప్రపంచం అనే భావనను అజెండా పైకి తెచ్చాయి. ఒకప్పుడు అమెరికా, సోవియెట్‌ యూనియన్‌లతో ద్విధృవ ప్రపంచం ఉండగా, సోవియెట్‌ పతనం తర్వాత అది ఏకధృవంగా మారింది. 

దీనితో ఈ కొత్త సవాలును భగ్నం చేసేందుకు అమెరికా, యూరోపియన్‌ యూనియన్‌లు చతురోపాయాలను ప్రయోగిస్తు న్నాయి గాని సఫలం కావటం లేదు. వారు ఎంత వ్యతిరేకించినా బెల్ట్‌ పథకపు సభ్య దేశాల సంఖ్య 150కి మించి పోయింది. విశేషమేమంటే, అమెరికా కూటమిలోని యూరోపియన్‌ దేశాలు కొన్ని కూడా అందులో చేరాయి. బ్రిక్స్‌లో మరికొన్ని పెద్ద దేశాలు కొత్తగా చేరగా డజన్ల కొద్దీ దరఖాస్తు చేశాయి. 

సరిగా ట్రంప్‌ అధికార స్వీకరణ చేస్తుండిన రోజులలోనే ఇండోనేసియా చేరగా, తాము కూడా చేరను న్నట్లు మలేసియా ప్రధాని ప్రకటించారు. బ్రిక్స్‌ కూటమి జీడీపీ ప్రపంచ జీడీపీలో ఇప్పటికే 35 శాతానికి చేరగా, జీ–7 జీడీపీ 30 శాతం దగ్గర ఆగిపోయి ఉంది. మరొకవైపు చైనాతో అమెరికా వాణిజ్య లోటు సంవత్సరాల తరబడిగా తీరటం లేదు. దాదాపు 120 దేశాలతో చైనా వాణిజ్యం అమెరికాను మించిపోయింది.

ఈ విధమైన మార్పులతో కలవరపడినందువల్లనే ట్రంప్‌ తన మొదటి హయాంలో చైనాపై బహిరంగంగా వాణిజ్య యుద్ధం ప్రక టించారు. సుంకాలు పెంచారు. అమెరికన్‌ కంపెనీలు అక్కడి నుంచి తరలి వెళ్లకపోతే వాటి ఉత్పత్తులపైనా సుంకాలు పెంచుతామన్నారు. చైనాకు ముడి వనరులు, సాంకేతికతలు అందకుండా వీలైనన్ని ప్రయ త్నాలు చేశారు. కానీ, ఆయన పాలన ముగిసే నాటికి, ఆ యుద్ధం విఫలమైనట్లు అమెరికా సంస్థలే తేల్చి చెప్పాయి. చైనాకు కలిగిన నష్టం కన్నా అమెరికా నష్టాలు ఎక్కువని లెక్కలు వేసి చూపించాయి. ఆ తర్వాత బైడెన్‌ కూడా అదే వ్యూహాన్ని అనుసరించి విఫల మయ్యారు. ఇప్పుడు ట్రంప్‌ వైఖరి చిత్రంగా ఉంది. 

ఒకవైపు తిరిగి వాణిజ్య యుద్ధాన్ని ప్రకటిస్తూనే, మరొకవైపు చైనాతో చర్చలు జరప గలమని అంటున్నారు. అమెరికా ఆధిపత్యానికి డాలర్‌ శక్తి ఒక ముఖ్యాధారం. బ్రిక్స్‌ కూటమి ప్రత్యామ్నాయ కరెన్సీ సృష్టించగలమని చెప్పలేదు గానీ, వివిధ దేశాల మధ్య వాణిజ్య చెల్లింపులు డాలర్‌కు బదులు స్థానిక కరెన్సీలలో జరిగేందుకు ప్రయత్నించ గలమన్నది. ఈ మార్పులు డాలర్‌ను బలహీనపరచగల అవకాశం ట్రంప్‌ ఆగ్రహానికి కారణమైంది. ఇంతకూ ట్రంప్‌ ఈ రెండవ విడత వాణిజ్య యుద్ధం ఫలించగలదా అన్నది ప్రశ్న.

టంకశాల అశోక్‌ 
వ్యాసకర్త సీనియర్‌ సంపాదకుడు

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)