నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..
Breaking News
Today tips పండంటి కాపురానికి పక్కా లెక్కలు, చిట్కాలు
Published on Fri, 06/20/2025 - 17:54
ఇటీవలి కాలంలో వివాహ బంధం మూణ్ణాళ్ల ముచ్చటగా మిగిలిపోతున్న సంఘటనలు ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. రెండు మనసులు కలిసి కలకలం సంతోషంగా జీవించాల్సిన జంటలు పగలు ప్రతీకారాలతో రగిలిపోతున్నాయి. చివరికి ఒకర్నొకరు అంతం చేసుకుంటున్న ఉదంతాలు చోటు చేసుకుంటున్నాయి. పెళ్లంటే నూరేళ్ల పంట అన్నట్టు దంపతులు హాయిగా, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్టుగా ఉండాలంటే ఏం చేయాలి? టిప్ ఆఫ్ ది డే లో భాగంగా అన్యోన్యమైన పండంటి కాపురానికి పాటించాల్సిన లెక్కలు, టిప్స్ తెలుసుకుందాం.
ఏ బంధానికైనా విశ్వాసం, నమ్మకం బలమైన పునాదిగా ఉంటాయి. ఒకరి పట్ల ఒకరికి ప్రేమ, అనురాగం ఉన్నపుడు భార్యభర్తల బంధం కూడా నూరేళ్లు కొనసాగుతుంది. భార్యభర్తలంటే కలహాలు ఉండవని కాదు, బేధాభిప్రాయాలు ఉండవనీ కాదు. కానీ ఒకరి అభిప్రాయాల్ని ఒకరు గౌరవించుకోవాలి.ఒకరి పొరబాట్లను, తప్పులను అర్థం చేసుకోవాలి. నాదే పంతం, అన్నట్టుగా కాకుండా, సమయానికి తగు.. అన్నట్టు సర్దుకుపోవాలి. ఒక్కోసారి వెనక్కి తగ్గాలి. అవసరమైత రాజీ పడాలి. అదే అందమైన దాంపత్య జీవితానికున్న అర్థం పరమార్థం.
చదవండి: నో డైటింగ్, ఓన్లీ జాదూ డైట్ : నెలలో 7 కిలోలు తగ్గడం పక్కా!
మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉండాలంటే కొన్ని చిట్కాలు
పెళ్లికి ముందే అన్ని విషయాలు పరస్పరం చర్చించుకోవాలి.
ఇద్దరి మధ్య బంధానికి అంగీకారం ఉందా లేదా అనేదాన్ని పరస్పరం గట్టిగా నిర్ధారించుకోవాలి. అందమైన బంధానికి కమిట్మెంట్, కమ్యూనికేషన్ కీలకం.
నిజాయితీకి పెద్ద పీట వేయాలి. ఉద్యోగం, ఆస్తులు, సంపాదన ఇలాంటి విషయాలో అబద్ధాలకు తావుండ కూడదు.
పెళ్లి తరువాత ఇంటా బయటా పనుల్లో ఒకరికొకరు సహకరించుకోవాలి. బడ్జెట్, ఇంటి ఖర్చులు సహా అన్ని విషయాల్లో పరస్పరం చర్చించుకొని నిర్ణయాలు తీసుకోవాలి. తప్పు ఒప్పులకు సమానంగా బాధ్యత తీసుకోవాలి.
ఒకళ్ల గురించి ఒకరు పట్టించుకోవాలి. ఒకరికొకరు అండగా ఉండాలి. ముఖ్యంగా అనారోగ్యం విషయాల్లో ఒకరికొకరు శ్రద్ధపెట్టాలి. ‘నేను ఉన్నాను’ అనే భరోసా ఇచ్చుకోవాలి
ఎపుడూ సంసార సాగరంలో పడిపోకుండా అడపాదడపా, కనీసం పెళ్లి రోజులు, పుట్టిన రోజుల్లో అయినా ఇద్దరికీ నచ్చేలా కొంత సమయాన్ని గడపండి. ఇది జీవితంలో మరింత రీఛార్జ్ అవ్వడానికి ఉపయోగ పడుతుంది. ఇద్దరి మధ్య బంధం, ప్రేమ బలపడడానికి కూడా దోహదపడుతుంది.
చివరికి ఏవైనా చిన్ని చిన్న మనస్పర్థలు వచ్చినా కూర్చుని చర్చించుకుంటే శ్రావణమేఘాల్లా ఇట్టే తొలగిపోతాయి. మనసులో పెట్టుకొంటే మరింత వేధిస్తాయి.
నలుగురి ముందూ గొడవపడటం, ముఖ్యంగా పిల్లల ముందు వాగ్వాదానికి దిగడం అస్సలు చేయవద్దు. ఇది మీ జీవితంతోపాటు, పిల్లల జీవితాన్ని కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తుంది.
చదవండి: Today Tip : బాల్కనీ మొక్కలు.. అదిరిపోయే చిట్కా!
Tags : 1