Breaking News

దశాశ్వమేధ ఘట్టం

Published on Sun, 07/05/2026 - 10:18

దేవశిల్పి విశ్వకర్మ మనవడైన ప్రథముడికి భౌవనుడు అనే కొడుకు కలిగాడు. అతడు దినదినాభివృద్ధి చెంది సకల శాస్త్రాలను అభ్యసించి, సార్వభౌముడిగా ఎదిగాడు. భౌవనుడికి ఒకేసారి దశాశ్వమేధ యాగాలు చేయాలనే సంకల్పం కలిగింది. అతడు తన ఆస్థాన పురోహితుడైన కశ్యపుడిని దర్శించుకుని, ‘ఏకకాలంలో దశాశ్వమేధ యాగాలు చేయాలని కోరికగా ఉంది. ఈ యాగాల నిర్వహణకు తగిన పుణ్యస్థలమేదో సెలవివ్వండి’ అని అభ్యర్థించాడు.

‘రాజా! పూర్వకాలం నుంచి రాజులందరూ ఏ ప్రదేశంలో అశ్వమేధ యాగాలు చేసేవారో, అదే ప్రదేశంలోనే నువ్వు కూడా యాగాలు నిర్వహించు’ అని చెప్పాడు కశ్యపుడు.
కశ్యపుడి సూచనతో భౌవనుడు ఋత్విక్కులను ఏర్పాటు చేసుకుని, పూర్వీకులు యాగాలు నిర్వహించిన ప్రదేశంలోనే పది అశ్వమేధ యాగాలూ ఒకేసారి ప్రారంభించాడు. అయితే, ఎంత ప్రయత్నించినా ఆ యాగాలు సంపూర్ణం కాలేదు.

యాగాలు సఫలం కాకపోవడంతో భౌవనుడు విచారించాడు. పురోహితులతో చర్చించి, ఆ స్థలాన్ని విడిచిపెట్టి వేరే స్థలంలో యాగాలను తిరిగి ప్రారంభించాడు. అక్కడ కూడా యాగాలకు అంతరాయాలు కలిగాయి. యాగాలు అసంపూర్ణంగానే మిగిలాయి.
భౌవనుడు చింతాక్రాంతుడయ్యాడు. ఆస్థాన పురోహితుడైన కశ్యపుడిని కలుసుకున్నాడు. ‘మహర్షీ! నా దోషమో, మీ దోషమో, దేశ కాల దోషమో నాకు అర్థం కాకున్నది. నేను తలపెట్టిన యాగాలు ఎంతగా ప్రయత్నించినా సంపూర్ణం కాకున్నవి. దీనికి మార్గాంతరమేమిటో అంతుచిక్కకున్నది’ అని విచారంగా పలికాడు.

కశ్యపుడు దీర్ఘాలోచనలో పడ్డాడు. కొద్దిసేపటి తర్వాత, ‘రాజా! పద’ అంటూ భౌవనుడిని తనతో పాటు బృహస్పతి అన్న అయిన సంవర్తకుడి దగ్గరకు తీసుకుపోయాడు. 
‘మహాత్మా! మేము దశాశ్వమేధ యాగాలు తలపెట్టాము. యాగ నిర్వహణకు ఇదివరకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. యాగాలు అసంపూర్ణంగానే మిగిలాయి. మేము తలపెట్టిన యాగ నిర్వహణకు తగిన ఉత్తమ ప్రదేశమేదో నువ్వే చెప్పాలి’ అని అడిగాడు కశ్యపుడు. సంవర్తకుడు కొద్దిసేపు ఆలోచించి, ‘మునివర్యా! మీరిద్దరూ నేరుగా బ్రహ్మదేవుడి వద్దకు వెళ్లి అడగండి. మీరు సంకల్పించిన యాగ నిర్వహణకు తగిన పుణ్యస్థలాన్ని ఆయనే చెప్పగలడు’ అని చెప్పి, వారిని సాదరంగా సాగనంపాడు. భౌవనుడిని వెంటపెట్టుకుని కశ్యపుడు బ్రహ్మదేవుడి వద్దకు వెళ్లాడు.

బ్రహ్మదేవుడిని దర్శించుకుని, వారిద్దరూ నమస్కరించారు. ‘బ్రహ్మదేవా! మా రాజైన ఈ భౌవనుడు దశాశ్వమేధ యాగాలను ఏకకాలంలో తలపెట్టాడు. ఇదివరకటి యత్నాలు విఫలం కావడంతో వ్యాకులం చెందుతున్నాడు. యాగ నిర్వహణకు తగిన పుణ్యస్థలమేదో నువ్వే సెలవివ్వాలి’ అడిగాడు కశ్యపుడు. ‘పవిత్ర గౌతమీతటాన యాగ నిర్వహణ కావించండి. అక్కడ నిర్వహించే ఏ యాగమైనా సంపూర్ణంగా ఫలిస్తుంది’ అని చెప్పి, భౌవనుడిని ఉద్దేశించి, ‘రాజా! నువ్వు ఇందుకు వేరే గురువును ఆశ్రయించవలసిన పనిలేదు. వేదపారంగతుడైన ఈ కశ్యపుడే గురుశ్రేష్ఠుడై యాగాన్ని పరిపూర్ణం చేయించగలడు’ అని చెప్పాడు.

కశ్యపుడి ఆధ్వర్యంలో భౌవనుడు గౌతమీ తీరంలో దశాశ్వమేధం ప్రారంభించాడు. యాగం దిగ్విజయంగా పరిపూర్ణమైంది. యాగ పరిసమాప్తి సందర్భంగా భౌవనుడు భూదానానికి ఉద్యుక్తుడయ్యాడు.
అదే సమయంలో అశరీరవాణి ‘ఓ రాజా! సమస్త భూమండలాన్నీ నువ్వు ఈ కశ్యప మహర్షికి దానం చేయాలని సంకల్పించుకున్నావు. నీ సత్సంకల్ప మాత్రానే భూమండలం సర్వసుభిక్షమైంది. నీ మనసులోనున్న భూదాన సంకల్పాన్ని విరమించుకుని, మహాఫలప్రదమైన అన్నదానం కావించు. నీకు శుభం కలుగుతుంది’ అని పలికింది. అశరీరవాణి పలుకులు విన్నప్పటికీ భౌవనుడు తన భూదాన సంకల్పం నుంచి వెనక్కు తగ్గలేదు. అప్పుడు భూదేవి స్వయంగా ప్రత్యక్షమై, ‘మహారాజా! మాటిమాటికి నన్ను దానం చేయడం తగదు. నీ సంకల్పం విడిచిపెట్టు’ అని చెప్పింది.

భూదేవి స్వయంగా ప్రత్యక్షం కావడంతో భౌవనుడు చలించిపోయాడు. ‘తల్లీ! యాగ పరిసమాప్తి సందర్భంగా నేనిప్పుడు ఏ దానం చేయాలో నువ్వే చెప్పు’ అన్నాడు.
‘పవిత్రమైన ఈ గౌతమీ తీరాన నవధాన్యాలు, గోవులు, ధన కనక వస్తు వాహనాలు వేటిని దానం చేసినా అక్షయఫలం లభిస్తుంది. ఇక్కడ అన్నదానం చేసినవారికి సమస్తదానాలూ చేసినంత ఫలం దక్కుతుంది.’ అని పలికింది. 
భౌవనుడు యాగస్థలంలో వేలాదిమందికి అన్నదానం చేశాడు. అతడి యాగస్థలి దశాశ్వమేధ తీర్థంగా ప్రసిద్ధి పొందింది. - సాంఖ్యాయన

పురావిశేషం..
ఒడిశా రాజధాని భువనేశ్వర్‌కు చేరువలోని హీరాపూర్‌ గ్రామంలో అత్యంత అరుదైన పురాతన శాక్తేయ ఆలయం ఉంది. ఇది చతుష్షష్టి యోగినుల మందిరం. ఇందులో అధిష్ఠాన దేవత మహామాయ విగ్రహంతో పాటు అరవైనాలుగు మంది యోగినుల విగ్రహాలు ఉంటాయి. పైకప్పు లేకుండా ఈ ఆలయాన్ని నిర్మించడం విశేషం. దీనిని భౌమవంశానికి చెందిన రాణి హీరాదేవి క్రీస్తుశకం 864లో నిర్మించింది. పదహారో శతాబ్దిలో కాలాపహాడ్‌ అనే సేనాని జరిపిన దాడిలో ధ్వంసమైన ఈ ఆలయం ప్రస్తుతం శిథిలావస్థలో మిగిలింది.

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)