గన్నవరంలో YSRCP ఘన విజయం.. వల్లభనేని వంశీ సంబరాలు
Breaking News
ఈవారం కథ: బైరాగి..
Published on Sun, 11/08/2026 - 09:21
పొద్దున్ననగా నీళ్లలోకి దిగిన పిల్లలు ఇంకా ఈతలు కొడుతూనే ఉన్నారు. ఒకళ్లో ఇద్దరో ఇంక చాలనుకుని, మెట్ల అంచుల వరకు వచ్చాక మనసు మార్చుకుని వెనక్కి పరుగెట్టి, మళ్లీ నీళ్లలోకి దుముకుతున్నారు.
గోదావరితల్లి ఒడిలోఎంత ఆడుకున్నా, తనివి తీరడంలేదు వాళ్లకి.
రావిచెట్టు మీది కాకులు ఉండుండి అరుస్తున్నై. ఒడ్డున ఎవరిదో అప్పుడే పిండప్రదాన కార్యక్రమం కోసం ఇద్దరూ ముగ్గురు బ్రాహ్మలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మెట్లమీద కాకులు ఎప్పుడు పిలుస్తారా అన్నట్లు కావుకావుమంటూ అరుస్తున్నాయి.
ఇంకా ఎవరైనా వస్తారేమోనని ఆశతో కొంతా, ఇరుకుగా ఉన్న గర్భగుడిలో వేడి భరించలేక కొంతా మాటిమాటికీ మండపంలోకొచ్చి గాలిపోసుకుంటున్నారు పూజారిగారు.
ఉదయం గుడికి ఎవరైనా భక్తులు రాకపోతారా అన్నట్లు ఎదురు చూస్తున్నారు. ఇంతలో అటుగా చూస్తూ చిడతలు పట్టుకుని మెట్లమీద ఒంటరిగా కూర్చున్న బైరాగిని పలకరించాడు.
అప్పుడే విచ్చుకున్న లేతగులాబీలాగా ఉదయ సూర్యబింబం మేఘాలను చీల్చుకుంటూ పైకి వస్తోంది. అలికిడికి హాయిగా నిద్రపోతున్న పిట్ట, తల్లి రెక్కలలో ఒదిగిపోయింది. పుష్కరరేవు గట్టుమీద బైరాగి గోదావరిలో స్నానంచేస్తూ ఎదురుగా కనిపిస్తున్న సూర్యబింబానికి నమస్కరించాడు. వచ్చి బట్టలు పిండుకుని, మూట విప్పి పొడిగా ఉన్న బట్టలు వేసుకుని, విప్పినవి, గుడిమూలగా ఉన్న గోడ దగ్గర కట్టుకున్న తీగమీద ఆరవేసుకున్నాడు.
బ్రిడ్జి మీంచి ట్రైన్ ఏదో కూతవేసుకుంటూ పోతోంది. పుష్కరాలు అయి కొద్దికాలమే అవడంతో రేవు ఇంకా ముస్తాబులోనే ఉంది.
ఈ నదీప్రవాహæతరంగాలలోలాగా కళాప్రవాహంలో ఎన్నో జీవితాలు కలిసిపోతుంటాయి. పైపైకి కనిపించే విషయాలు వేరుగా ఉంటాయి. లోతుల్లోకి వెళ్లిచూస్తే ఎన్నో బాధలు, మరెన్నో వ్యథలు.
‘‘ఏం బైరాగి! ఏవిటి సంగతి? ఈవేళ ఇంకా బయలుదేరలేదేం?’’
‘‘ఏదీ ఇంకా మా కిట్టప్ప రాలేదు.’’
‘‘ఆ... నీ పిచ్చిగానీ వాడేమన్నా నీ సొంత మనవడా ఏమిటి? అయినా సంసారబంధాలు లేని బైరాగివి కదా, నీకెందుకయ్యా ఈ లంపటం.’’
...
ఆ మౌనం అర్థం చేసుకున్న పూజారి, ‘’అయినా నాకెందుకులే నీ గొడవ...’’ అనుకుంటూ ముందుకు సాగిపోయాడు.
అంతవరకూ నీళ్లల్లో ఆడిపాడి, మెట్ల మీదనున్న బైరాగిని చూసి, ‘‘తాతా ఇప్పుడే వస్తాను,’’ అంటూ చెంగుచెంగున దూకుతూ వెళ్ళాడు పదమూడేళ్ల కిట్టప్ప.
బైరాగి చిడతలు వాయిస్తూ, ‘‘రామనామము, రామనామము రమ్యమైనది,’’ అని పాడుకుంటూ నడుస్తుంటే, జోలెపట్టుకుని, కట్టుకోవటానికి శుభ్రమైన బట్టలు లేకున్నా ఆ పిల్లడి మొహంలో అదోరకమయిన వెలుగు మొహమంతా పాకగా, బైరాగితో పాటు నడుస్తూ, గొంతు కలుపుతూ వీధివీధి తిరుగుతున్నారు.
పదిగంటలు అయింది. ‘‘రామ్మా ఇవాళ్టకి ఇంకచాలు, రేవుకిపోదాం,’’ అంటూ తిరిగి పుష్కరరేవు దగ్గరకి వచ్చేశారు బైరాగి, కిట్టప్ప.
జోలెలో పడిన డబ్బులు కూడా బైరాగి చేతికిచ్చేసి, ‘‘తాతా! నేను పోయి ఆడుకుని వస్తాను,’’ అన్నాడు కిట్టప్ప
‘‘కొంచెం ఏమన్నా తిని పోవమ్మా.’’
‘‘ఉండు తాతా, అక్కడ అందరూ ఆడుకుంటున్నారు.’’
‘‘అలాగే కానీ, తొందరగా వచ్చేయి.’’ అన్నాడు.
‘‘సరేసరే,’’ అంటూ పరిగెత్తాడు కిట్టప్ప.
బైరాగికి డెబ్భయి ఏళ్ళుపైన ఉండచ్చు. బవిరిగడ్డం, ముడతల ముఖం, ఒళ్ళంతా విభూతిరేఖలు. కాషాయరంగు పంచె, జుబ్బా కండువా– ఇదీ అతని రూపం.
ఎక్కడినుంచి వచ్చాడో, ఎవరికీ తెలియదు. అందరివీ ఊహాగానాలే నిజానికి అతనికే తెలియదు.
కొంతమంది అనుకోవడం అతను పెద్దకుటుంబంలోంచి వచ్చాడని, భార్య సాధింపులు భరించలేక బైరాగిగా మారాడని, మరికొంతమందేమో అబ్బేకాదు, అతనికి మొదటి నుంచి సంసారబంధాలంటే మోజులేదు, ఇంట్లో ఉంటే బలవంతంగా పెళ్లి చేసేస్తారని కాశీ పారిపోయి, సాధువుల్లో కలిసిపోయాడని, అలా ఊర్లు తిరుగుతూ, ఇదిగో ఇక్కడకి చేరాడని అంటారు.
ఏది ఏమైనా ఈ గోదావరి రేవే అతని ఇల్లూ వాకిలీ.
రేవుకి కాస్త దగ్గరలో ఆంజనేయస్వామి గుడి ఉంది. రోజూ తప్పకుండా వెళ్తాడు. అక్కడ ఓమూల కూర్చుని, రామనామం జపిస్తూ ఉంటాడు. దర్శనం కోసం వచ్చిన భక్తులు ఏదో ఒకటి చేతిలో పెడుతూ ఉంటారు. మధ్యాన్నం రేవుకి, గుడికి మధ్యలో ఉన్న కారుణ్య సంఘంవారు అనాథలకు అన్నదానం చేస్తూ ఉంటారు. చాలాసార్లు అక్కడ తినేసి, మళ్లీ రేవు దగ్గరకు వెళ్లిపోతాడు. మళ్లీ సాయంకాలం కాసేపు గుడి దగ్గరకు వచ్చివెళుతూ ఉంటాడు.
ఇదీ అతని దినచర్య.
ఒక్కోసారి ఓపిక ఉంటే వంట చేస్తాడు. లేకపోతే, ఆ అనాథాశ్రమం దగ్గరకు వెళ్లి, తినేసి వస్తాడు. ఈరోజు ఎందుకో వంట చేయబుద్ధి అయింది. వంట చేసి, కిట్టప్ప కోసం ఎదురు చూస్తున్నాడు.
పొద్దున్న పూజారిగారు అన్నమాటలని మరోసారి తలచుకున్నాడు బైరాగి.
అందరూ అతని మనవడు అనుకుంటున్న కిట్టప్ప గోదారొడ్డున మెట్లమీద దొరికాడు.
ఎవరో గొప్పోళ్ళ బిడ్డ తనకి గోదారొడ్డున దొరికాడని మురిసిపోతూ తనకిష్టమయిన కృష్ణుడి పేరు పెట్టుకుని, తల్లీతండ్రీ తనే అయి సాకుతున్నాడు.
‘ఎవరో అతని అవకరం చూసి బరువని దించేసుకున్నారు కాబోలు. అందుకు మాట్లాడని ఈ గోదారమ్మే సాక్షికం.’ అనుకున్నాడు.
అలా తలపుల్లో ఉన్న బైరాగి దగ్గరకు, ‘‘తాతా తాతా ఆకలేస్తోంది,’’ అని గెంతుకుంటూ వచ్చాడు.
‘‘పొద్దున్న అనగా వెళ్లావు, మరి వెయ్యదూ, రా రా కూర్చో,’’ అని పిలిచి, అక్కడున్న బాదంచెట్టు ఆకు తెంపి, శుభ్రంగా కడిగి దానిలో అన్నంపెట్టి, తను కూడా తెచ్చుకుని తింటున్నాడు.
ఆ రాత్రి గోదావరి గట్టుమీద గాలి స్తంభించి పోయినట్లు ఉంది. పుష్కరాల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. వేలసంఖ్యలో భక్తులు పుణ్యస్నానాల కోసం రేవుకు పోటెత్తారు. ఎక్కడ చూసినా జనమే!
చీకటి పడుతుండగా రేవు మెట్ల దగ్గర ఒక్కసారిగా తోపులాట మొదలైంది. ఎవరో దొంగను పట్టుకున్నారని జనం అటువైపు పరుగులు తీశారు. ఆ గందరగోళంలో కిట్టప్ప ఎక్కడ ఉన్నాడో అని కంగారు పడ్డాడు బైరాగి. ‘కిట్టప్పా... కిట్టప్పా...’ అని అరుస్తూ ఆ జనారణ్యంలోకి వెళ్లాడు.
కానీ ఆ వయసులో ఆ తోపులాటను తట్టుకోలేకపోయాడు. ఎవరో బలంగా నెట్టేయడంతో బైరాగి కింద పడిపోయాడు. అతని చిడతలు ఎక్కడో పడిపోయి, తొక్కిసలాటలో విరిగిపోయాయి. అదే సమయంలో అక్కడే రిక్షా తొక్కుతున్న రమణయ్య కూడా ఆ గుంపులో చిక్కుకుపోయాడు. పోలీసులు వచ్చి లాఠీచార్జి చేసి, జనాన్ని చెదరగొట్టే సరికి అంతా అయిపోయింది.
తెల్లవారేసరికి రేవుమీద బైరాగి ఆరేసిన కాషాయ బట్టలు, ఆ తీగ అలాగే ఉన్నాయి... కానీ బైరాగి లేడు. ఉన్నాడో, లేక ఆ గోదారమ్మ ఒడిలో కలిసిపోయాడో ఎవరికీ తెలియదు.
తాత కోసం వెతికి వెతికి అలసిపోయిన కిట్టప్ప, దిక్కుతోచక ఆకలితో అలమటిస్తూ గుడిమెట్ల మీద పడుకున్నాడు
ఎప్పటిలాగే పూజారిగారు గుడి తలుపులు తెరిచి, యథావిధిగా పూజ కానిచ్చి, ఎందుకో మరి ఆయన కళ్లు భక్తుల కోసం కాకుండా, అలవాటుగా ఆ మెట్ల మీద కూర్చునే బైరాగి కోసం వెతుకుతున్నాయి. కేవలం గోడ దగ్గర తీగ మీద ఆరిన కాషాయ బట్టలు గాలికి రెపరెపలాడుతున్నాయి.
ఏడుస్తూ ఉన్న కిట్టప్ప కనిపించాడు. బైరాగి జాడలేదు.
పూజారి నిట్టూరుస్తూ, ‘‘నిన్నటి తోపులాటలో ఎవరో ముసలాయన గోదావరిలో పడిపోయాడటరా... అది నీ తాతేనేమో! పాపం, సంసార బంధాలు లేని బైరాగి అనుకున్నాను కానీ, నీ కోసం ఆ జనారణ్యంలోకి వెళ్లి, తన ప్రాణాలనే వదిలేశాడేమో!’’ అని కళ్లు తుడుచుకున్నాడు. బైరాగి చిడతలు విరిగిపోయి, మెట్లమీద పడి ఉండటం చూసి, పూజారికి ఏదో తెలియని వెలితి కలిగింది.
‘‘వెళ్లు కిట్టప్పా, ఆ సీతమ్మ దగ్గరికి వెళ్లు... ఆకలితో ఉన్నావు’’ అని పంపిస్తూ, ‘మనుషులు వస్తుంటారు... పోతుంటారు... ఈ గోదారమ్మ మాత్రం అన్నీ చూస్తూ సాక్షిలా ఉండిపోతుంది.’ అనుకుంటూ గుడిలోకి వెళ్ళిపోయారు.
పక్కనే సీతమ్మ ఇడ్లీ సెంటర్లోంచి, ఇడ్లీలతో పాటు పచ్చి అరటాకుల సువాసన కలిపి వస్తున్నాయి. అందుకోసమే జనాలు అక్కడికి వెళుతున్నారంటే అతిశయోక్తికాదేమో!
సీతమ్మ చెమట తుడుచుకుంటూ, స్టౌపైన ఇడ్లీల వాయ దింపుతూ ‘‘కిట్టప్పా! అదిగో చెట్టుకింద కూర్చున్న వాళ్ళకి మూడుప్లేట్లు ఇడ్లీ, ఒక టీ ఇచ్చిరా!’’ అంది.
‘‘అలాగే అత్తా’’ అన్నాడు
‘‘హే సొట్ట కిట్టిగాడు కుదిరాడా పనిలోకి’’ అన్న లాంచీల గుమస్తా గవర్రాజు మాటలకి చివ్వున చూసింది సీతమ్మ.
చురుక్కున తగిలిన ఆ చూపుకి అతను కళ్ళు దించుకుని ‘‘పోనీలే, మంచిపని చేశావు’’ అంటూ గబగబా తినసాగాడు.
అప్పుడప్పుడు వాడు కనిపించినప్పుడల్లా పిలిచి సీతమ్మే టిఫిన్ పెట్టేది. ఆ రోజున కూడా కొట్టు కట్టేస్తూ, వాడి చేతికి ఇడ్లీపొట్లం ఇచ్చేసరికి అందుకుంటూ, ‘‘పాపం రమణయ్య పోయాడుట కదా అత్తా’’ అంటూ భోరున ఏడ్చాడు
ఆ ఆత్మీయతకు సీతమ్మ కరిగి కన్నీరై, అక్కడ మరో గోదారయింది. రోజులు గడుస్తున్నాయి. సామాన్యుల జీవితాల్లో చెప్పుకోదగ ్గవిశేషాలేమీ ఉండవు. మరి బైరాగిలాంటి వాళ్లని భగవంతుడు ఎందుకు పుట్టిస్తాడో? వాళ్లు ఉన్నా, పోయినా ఎవరికీ పట్టింపు ఉండదు. అసలు వాళ్ల ఉనికే ఎవరికీ తెలియదు. లోకం దృష్టిలో ధీర నాయకులే గొప్పవాళ్లు కావచ్చు, కానీ ఈ సామాన్యుల జీవితాలకూ ఒక అర్థం ఉంటుంది. వాళ్ల దృక్పథం వేరు. ఈ సామాన్య జీవితమే వాళ్లకొక ఆశయం. అదొక దీపం.
ఎప్పటిలాగే మానవ మనుగడలోని పాపాలను, నిగూఢ సత్యాలను తనలో నింపుకున్న తల్లి గోదావరి మాత్రం... ఏమీ ఎరగనట్లు శాంతంగా, గుంభనంగాప్రవహిస్తూనే ఉంది.
- మణి వడ్లమాని
ఇదీ చదవండి: గర్వంతో విర్రవీగిన సింహం.. చివరకు ఏమైందంటే?
Tags : 1