ఏపీ కానిస్టేబుల్ అనుమానాస్పద మృతి
Breaking News
తప్పులను మన్నించే పుణ్యోత్సవం..
Published on Thu, 08/20/2026 - 07:59
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో అత్యంత పవిత్రంగా నిర్వహించే వార్షిక పవిత్రోత్సవాలు 2026 ఆగస్టు 23 నుండి ఆగస్టు 25 వరకు మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఈ ఉత్సవాలకు ముందు రోజు, అనగా ఆగస్టు 22న అంకురార్పణతో వేడుకలు ప్రారంభమవుతాయి.
ఏడాది పొడవునా ఆలయంలో జరిగే పూజలు, అర్చనలు, వివిధ ఉత్సవాల్లో వైష్ణవ ఆగమశాస్త్రాల ప్రకారం భక్తులు, అర్చకులు లేదా సిబ్బంది వల్ల తెలియకుండా ఏవైనా లోపాలు (దోషాలు) జరిగి ఉంటే, వాటి నివారణ కోసం ఈ ’దోష నివారణోత్సవం’ లేదా పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. ఆలయ పవిత్రతను కాపాడటం ఈ ఉత్సవం ప్రధాన ఉద్దేశం.
చారిత్రక నేపథ్యం
తిరుమల ఆలయ శాసనాల ప్రకారం, ఈ పవిత్రోత్సవాలను మొదటిసారిగా క్రీ.శ. 1463లో సాళువ నరసింహరాయల కాలంలో సాళువ మల్లయ్యదేవ రాజా ప్రారంభించారు. కాలక్రమేణా నిలిచిపోయిన ఈ సంప్రదాయాన్ని టీటీడీ మళ్లీ 1962 నుండి పునరుద్ధరించి ప్రతి ఏటా శ్రావణ మాసంలో నిర్వహిస్తోంది. అయితే కొన్ని మార్పు చేర్పులతో... ఈ ఉత్సవాల సమయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున, దర్శన సమయాల్లో మార్పులు ఉంటాయి.
పవిత్రోత్సవాల నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పలు ఆర్జిత సేవలను తాత్కాలికంగా రద్దు చేసింది:ఆగస్టు 22: సహస్రదీపాలంకార సేవ రద్దు.ఆగస్టు 23 నుండి 25 వరకు: కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలు పూర్తిగా రద్దు చేయబడ్డాయి.
ఆగస్టు 25: అష్టదళ పాదపద్మారాధన సేవ రద్దు.
ఆగస్టు 26: కల్యాణోత్సవ సేవ రద్దు.
మూడు రోజుల కార్యక్రమ వివరాలు
ఈ మూడు రోజుల పాటు ఆలయంలోని సంపంగి ప్రాకారంలో ప్రతిరోజూ ఉదయం 9:00 గంటల నుండి 11:00 గంటల వరకు స్వామివార్కి ’స్నపన తిరుమంజనం’ (విశేష అభిషేకం) నిర్వహిస్తారు.
ఆగస్టు 23 (మొదటి రోజు): పవిత్రాల ప్రతిష్ఠ
24 (రెండవ రోజు): పవిత్ర సమర్పణ (అర్చకులు శ్రీ మలయప్పస్వామి వారిని, ఇతర ఉపదేవతలను ఐదు రంగుల పట్టు దారాలతో చేసిన పవిత్రాలతో అలంకరిస్తారు).
25 (మూడో రోజు): మహా పూర్ణాహుతితో ఉత్సవాలు ముగుస్తాయి
వీధి ఉత్సవం: ఈ మూడు రోజుల్లోనూ ప్రతి సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామి వారు విశేష ఆభరణాలతో తిరుమల నాలుగు మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు.
నిర్వహణ : డి.వి.ఆర్. భాస్కర్
Tags : 1