Breaking News

మళ్లీ మొదటికి...!

Published on Thu, 07/09/2026 - 01:48

అమెరికా–ఇరాన్‌ల మధ్య కుదిరిన అరవై రోజుల అవగాహన ఒప్పందం(ఎంఓయూ) ఇరవై రోజులకే ముక్కలైంది. శాంతి సాధన దిశగా తొలి అడుగు పడిందని అందరూ సంతోషించి ఎంతో కాలం కాకుండానే అది ముగిసిపోయింది. తుర్కియేలో జరిగే నాటో శిఖరాగ్ర సదస్సుకొచ్చిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఈ సంగతి ప్రకటించారు. ఈ రాత్రికి భీకరదాడులుంటాయని కూడా హెచ్చరించారు. నిలకడ తక్కువ... నోటి దురుసు ఎక్కువవున్న ట్రంప్‌ ఎంఓయూపై సంతకాలైన క్షణంనుంచి రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. కిందపడినట్టు ప్రపంచమంతటికీ తెలిసినా తనదే పైచేయి అని చెప్పడానికి తాపత్రయపడ్డారు. ఎంఓయూ తర్వాత ఇలా జరగటం ఇది మూడో సారి. ఈ దాడులకు దీటుగా బదులిచ్చినట్టు, అమెరికా మిత్ర దేశాల్లోని దాని స్థావరాలపై క్షిపణులు ప్రయోగించినట్టు ఇరాన్‌ చెబుతోంది. 

ఒప్పందం కుదిరిందన్న మాటేగానీ... పశ్చిమాసియా అంతటా ఒక విధమైన ఉద్రిక్తత, అనిశ్చితి కొనసాగుతూనే ఉన్నాయి. హార్మూజ్‌ జలసంధినుంచి నౌకలు సురక్షితంగా బయటపడటం అనునిత్యం వార్తే అయింది. శాంతి అనేది వీరోచిత శ్రమనూ, త్యాగాన్నీ కోరుతుందని ఆధ్యాత్మికవేత్త థామస్‌ మెర్టన్‌ అంటాడు. పరస్పర అవగాహనతో తప్ప బలప్రయోగంతో శాంతి అసాధ్యమన్నది విఖ్యాత శాస్త్రవేత్త ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌ మాట. వీరత్వమూ, త్యాగమూ ట్రంప్‌కు ఏమాత్రం సరిపడని పదాలు. బలప్రయోగంతోనే శాంతి సాధ్యమన్నది ఆయన కుండే మూఢవిశ్వాసం. గత నెల జూన్‌ 17న కుదిరిన ఆ ఒప్పందం ఈ స్వల్పకాలం బతికివుందంటేనే ఆశ్చర్యపోవాలి. ఎందుకంటే సంతకం చేసింది అమెరికానే అయినా, ఆ దేశాన్ని శాసించేది ఇజ్రాయెల్‌. ఆ రోజే శాపనార్థాలు పెట్టిన ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహూ... మధ్యమధ్యలో లెబనాన్‌పై ఏదో వంకన దాడులు సాగిస్తూనే వచ్చారు. 

నాటో శిఖరాగ్ర సదస్సుకు అంకారా వచ్చిన సందర్భంలో తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగాన్‌ ఇచ్చిన విందుకు హాజరై వెళ్లాక హఠాత్తుగా ట్రంప్‌ ఈ దాడుల ప్రకటన చేయగానే సభ్య దేశాలు నివ్వెరపోయాయి. హార్మూజ్‌ జలసంధిలో మూడు వాణిజ్య నౌకలపై ఇరాన్‌ చేసిన దాడులకు ప్రతీకారంగానే ఇలా చేయాల్సివచ్చిందనీ, ముడి చమురు విక్రయించడానికి ఇరాన్‌కిచ్చిన లైసెన్సు రద్దయిందనీ ఆయన చెప్పాక పరిస్థితి మళ్లీ మొదటికొచ్చిందని అందరికీ అర్థమైంది. శాంతి కోసం నాటో దేశాలు చేసిందేమీ లేదు గానీ... అది కుదిరితే లబ్ధిపొందడానికి మాత్రం పాకులాడాయి. 

వేరే దేశాల పర్యటనల మధ్యన యుద్ధానికి దిగమని అధ్యక్షుడు ఆదేశించటం అరుదు. 2011లో బ్రెజిల్‌ పర్యటనలో ఉండగా అప్పటి అధ్యక్షుడు ఒబామా లిబియాపై దాడులకు ఆదేశించారు. ఆయుధాలపై నాటో దేశాలు ఖర్చుపెట్టాల్సిందేనని పట్టుబడుతున్న ట్రంప్‌ను ప్రసన్నం చేసుకోవటానికి అవి నానా తంటాలూ పడుతున్నాయి. అందులో సింహభాగం అమెరికన్‌ ఆయుధాలకే వెచ్చిస్తున్నామని చెబితే విని సంతోషపడతారని ఊహించాయి. కానీ ఇరాన్‌పై దాడులు మొదలైనాక సహకరించమని కోరితే జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ నిరాకరించాయన్న కోపం ఆయనకు పోలేదు. ఆ సంగతి ఎర్డోగాన్‌ చెవిన వేయడంతోపాటు, తుర్కియే కోసమే నాటోలో కొనసాగుతున్నామని కూడా చెప్పారు. కాసేపటికే తాజా దాడుల సంగతి ప్రకటించారు. 

అవగాహన ఒప్పందం వాలకం చూస్తేనే ఎవరికీ విశ్వాసం కలగలేదు. దానివల్ల ఒరిగిందల్లా హార్మూజ్‌లో నౌకలపై ఇరాన్‌ దాడులు నిలిపేయటం, ముడి చమురు అమ్ముకోవటానికి అమెరికా ఇరాన్‌ను అనుమతించటం. హార్మూజ్‌లో సుంకాల వసూలు, స్తంభించిన ఇరాన్‌ ఆస్తుల బదలాయింపు, ఇరాన్‌ అణు కార్యక్రమం నిలిపేయటం వంటివన్నీ తదుపరి చర్చలకు వాయిదాపడ్డాయి. ఇరాన్‌ బలంగా కోరుకునే అంశాలన్నీ ఎంఓయూలో ప్రస్తావనకు రాకపోవటంతో మొదట్లోనే చాలామంది పెదవి విరిచారు. ఈ యుద్ధంతో అన్ని దేశాలూ ఆర్థికంగా దెబ్బతిన్నాయి. తాజా దాడుల తర్వాత స్టాక్‌ మార్కెట్లు కళ్లు తేలేస్తున్నాయి. ముడిచమురు ధర 5 శాతం పెరిగింది. ఇరాన్‌ మత నాయకుడు ఖమేనీ అంత్యక్రియల పర్వం పూర్తయ్యేవరకూ కూడా ట్రంప్‌ ఆగలేక పోయారు. తన హామీని తానే ఉల్లంఘించారు. ఎన్నిసార్లు భంగపడుతున్నా ట్రంప్‌కు తత్వం బోధపడక పోవటం విచారకరం. అగ్రరాజ్యాధినేతగా బాధ్యతాయుత ప్రవర్తన అవసరమని ఆయన గ్రహించేదెన్నడో? 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)