Breaking News

నెగ్గాల్సిన ఇతర పరీక్షలు

Published on Tue, 07/28/2026 - 01:22

యాభై రోజులుపైగా ఢిల్లీలో మహోధృతంగాసాగి, దేశం మొత్తాన్ని సుడిగాలిలా చుట్టేసిన జంతర్‌ మంతర్‌ ఉద్యమం ఉపశమించిన మర్నాడే ప్రధాని నరేంద్ర మోదీ పరీక్షల సంస్కరణల కోసం ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నందన్‌ నిలేకని ఆధ్వర్యాన ఆరుగురు సభ్యుల టాస్క్‌ఫోర్స్‌ కమిటీని నియమిస్తున్నట్టు ఆదివారం ప్రకటించారు. అంతేకాదు... పరీక్షల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు పబ్లిక్‌ పరీక్షల (అక్రమ పద్ధతుల నివారణ) సవరణ బిల్లును లోక్‌సభలో సోమవారం ప్రవేశపెట్టారు. కేంద్ర విద్యాశాఖమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామాతో మొదలెట్టి చకచకా సాగుతున్న ఈ పరిణామాలు... ఆగ్రహంతో రగులుతున్న జెన్‌ జీ తరాన్ని దగ్గర చేసుకోవటానికి కేంద్రం చేస్తున్న ప్రయత్నాల పర్యవసానమే. నీట్‌ పేపర్‌ లీకయిందనీ, మరోసారి ఆ పరీక్ష నిర్వహణ తప్పదనీ తేలిన వెంటనే ఇంతే వేగంగా స్పందించివుంటే బహుశా ఈ స్థాయిలో ఆందోళన జరిగివుండేది కాదేమో! ఆ మాటకొస్తే ఎన్నో యేళ్లుగా ఈ లీకులు వినబడుతూనే ఉన్నాయి. కానీ వ్యవస్థల్లో కదలిక లేదు. 2024 నీట్‌ ప్రశ్నపత్రం లీక్‌ తర్వాత మాత్రం ఇస్రో మాజీ చైర్మన్‌ డాక్టర్‌ కె. రాధాకృష్ణన్‌ నేతృత్వంలో ఒక కమిటీ ఏర్పాటైంది. అది ఇచ్చిన నివేదిక అతీగతీ ఏమైందో తెలియదు. ఇంత నిస్తేజంగా ప్రభుత్వాలున్నప్పుడు ఉద్యమాలు వెల్లువెత్తడంలో ఆశ్చర్యం లేదు. 

మన దేశంలో సమస్యేమంటే కేంద్రం ఒక్కటే కాదు... రాష్ట్ర ప్రభుత్వాలు సైతం లీకుల విషయంలో నిర్లిప్తంగానే ఉంటాయి. జంతర్‌ మంతర్‌ ఉద్యమం ఒకపక్క సాగుతుండగానే పంజాబ్‌లో ఫార్మసీ రిక్రూట్‌మెంట్‌ పరీక్షల అక్రమాలు బయటపడ్డాయి. ఇక ఎన్డీయే కూటమి ఏలుబడిలోనే సాగుతున్న ఆంధ్రప్రదేశ్‌లో ఏకంగా ఉపాధ్యాయ నియామకాల ప్రక్రియే పెద్ద కుంభకోణంగా మారింది. నోటిఫికేషన్‌ విడుదలనాడే స్పోర్ట్స్‌ కోటా నియామకాలకు అర్హత పరీక్ష అవసరం లేదంటూ రెండు జీవోలు తీసుకురావటం ఆ ప్రభుత్వ బరితెగింపునకు చిహ్నం. అందుకే ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా అనంతరం ఏపీ విద్యామంత్రి లోకేశ్‌ రాజీనామా చేయాలన్న డిమాండ్‌ బలంగా వినిపించింది. 

నందన్‌ నిలేకని విద్యాధికుడు. ఐటీ రంగంలో పేరెన్నికగన్నవారు. గతంలో మన్మోహన్‌ సింగ్‌ ఆధ్వర్యంలోని యూపీఏ ప్రభుత్వం దేశంలో సంక్షేమ పథకాల అమలుకోసమంటూ తీసుకొచ్చిన ఆధార్‌ కార్డుల రూపకర్త ఆయనే. నిలేకని మాదిరే ఇతర సభ్యులు సైతం వారి వారి రంగాల్లో నిష్ణాతులు. పరీక్షల నిర్వహణకు ఇప్పుడ నుసరిస్తున్న విధానాల్లోని లోటుపాట్లు అధ్యయనం చేసి, ఎలాంటి సంస్కరణలు అవసరమో వీరు సూచిస్తారు. అడుగడుగునా చోటుచేసుకోవటానికి ఆస్కారం ఉన్న అవకతవకలనూ, అనైతిక పద్ధతులనూ నివారించటానికి ఏం చేయాలో చెబుతారు. 

వీటన్నిటికన్నా ముందు అసలు పరీక్ష నిర్వహణకు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) వంటి జాతీయ సంస్థ అవసరమా అనే సంగతి నిగ్గుదేల్చటం అవసరం. ఒక సంస్థకు దాని సామర్థ్యానికీ, వనరులకూ మించిన బాధ్యతల్ని అప్పగించటం సరైందేనా? ఆలోచించాలి. రెండేళ్లనాటి రాధాకృష్ణన్‌ కమిటీ నివేదికలోని అంశాలేమిటో, దాని సిఫార్సులపై తీసుకున్న చర్యలేమిటో చెప్పాల్సిన బాధ్యత పాలకులకు లేదా? కాక్రోచ్‌ ఉద్యమం సాగుతుండగానే 2024 నీట్‌ లీక్‌ ప్రధాన నిందితుడిపై వచ్చిన ఆరోపణలు రుజువు కాలేదని సీబీఐ ప్రకటించటం మరో వైచిత్రి. ఇక విద్యార్థులపై అత్యంత ఘోరంగా బలప్రయోగానికి పూనుకున్నవారిపైనా చర్యలుండాలి.

విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కేంద్రం ఇకపై అవసరమైన చర్యలు నిరంతరం తీసుకుంటూనే ఉంటుందని ప్రధాని చెప్పటం హర్షించదగ్గది. ఇది కేంద్ర స్థాయిలో మాత్రమే కాదు... రాష్ట్రాల స్థాయిలో కూడా జరగాలి. ఇతర రాష్ట్రాల మాటెలవున్నా తమ ఏలుబడిలోని ప్రభుత్వాలైనా జవాబుదారీతనంతో వ్యవహరించేలా చూడాల్సిన బాధ్యత ఎన్డీయే పెద్దలకుంది. ప్రధాని హామీ కంటితుడుపు చర్య మాత్రమేనని, రాష్ట్రాల్లో కూడా కాక్రోచ్‌ల స్థాయిలో ఉద్యమిస్తే తప్ప డీఎస్సీ అవకతవకల వంటివి పట్టించుకోబోరన్న సంకేతాలు వెళ్లరాదు. అందుకే దేశంలో యువత మనసు గెలవాలంటే నెగ్గాల్సిన పరీక్షలు చాలానే ఉన్నాయని కేంద్రం గుర్తించాలి. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)