Breaking News

విరమణ... నిజంగానా?!

Published on Wed, 06/25/2025 - 00:50

ఎప్పటిలాగే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ బహుపాత్రాభినయంతో అందరినీ మెప్పిస్తున్నారు. పశ్చిమాసియాలో అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇరాన్‌ దాడులు సాగించిన కొన్ని గంటలకే ఇరాన్‌–ఇజ్రాయెల్‌ కాల్పుల విరమణకు అంగీకరించాయని, దాన్ని తాము స్వాగతిస్తున్నా మని మంగళవారం మధ్యాహ్నం ట్రంప్‌ ప్రకటించారు. దీనికి ఇరాన్‌ సానుకూలంగా స్పందించినా ఇజ్రాయెల్‌ మౌనం పాటించింది. 

ట్రంప్‌ ప్రకటించిన కాసేపటికే ఇరాన్‌ రాజధాని తెహ్రాన్‌పై అది బాంబుల వర్షం కురిపించింది. రెండు దేశాలూ పరస్పరం ‘ఎందుకో కూడా తెలియని’ విధంగా కాల్పుల విరమణ ఒడంబడికను ఉల్లంఘిస్తున్నాయని ట్రంప్‌ నిందించి తన ‘తటస్థతను’ చాటు కున్నారు! ఇంతకూ కాల్పుల విరమణ నిజమేనా? ఒక సమాచారం ప్రకారం ఖతార్‌లోని అమెరికా స్థావరంపై ఇరాన్‌ క్షిపణులు ప్రయోగించాక ట్రంప్‌ చొరవ తీసుకుని ఇరాన్‌తో మాట్లాడి కాల్పుల విరమణకు ఒప్పించమని ఖతార్‌ను కోరారు. 

ఖతార్‌ తీసుకొచ్చిన ప్రతిపాదనకు ఇరాన్‌ అంగీకారం తెలిపింది. ఇరాన్‌ ఈ సంగతి బాహాటంగానే చెప్పింది. కాల్పుల విరమణ గురించి ట్రంప్‌ బతిమా లుకున్నారని వెల్లడించింది. అయితే ట్రంప్‌ ప్రకటన తర్వాత కాసేపటికే దాడులకు దిగడాన్నిబట్టి ఇజ్రాయెల్‌కు ఈ పరిణామం ససేమిరా ఇష్టం లేదని బోధపడుతోంది. యుద్ధం ఆపటం సులభ మేమీ కాదు. కాల్పుల విరమణ ప్రకటనకూ, దాని ఆచరణకూ మధ్య గంటలు మాత్రమే కాదు... రోజుల వ్యవధి కొనసాగటం రివాజే. మొన్న భారత్‌–పాక్‌ల మధ్య కాల్పుల విరమణ ఒప్పంద మైనా, రష్యా–ఉక్రెయిన్‌ల కాల్పుల విరమణ అయినా ఈ సంగతే చెబుతాయి.

యుద్ధానికి ముందు నెల నుంచి ట్రంప్‌ ఇరాన్‌కు రోజువారీ హెచ్చరికలు జారీచేస్తూ వచ్చారు. అణు ఒప్పందంపై మొండి పట్టుదలకు పోతే దేశం సర్వనాశనమవుతుందని బెదిరించారు. ఆఖరికి ఒకపక్క ఇరాన్‌ అమెరికాతో చర్చలు సాగిస్తుండగానే పన్నెండు రోజుల క్రితం ఇజ్రాయెల్‌ ఎలాంటి కవ్వింపూ లేకుండా ఆ దేశంపై దాడులు సాగించి ఇరాన్‌ సైనిక దళాల చీఫ్‌లు ఇద్దరినీ, అణు శాస్త్రవేత్తలతోసహా పలువురినీ హత్య చేసింది. 

ఇది తప్పని చెప్పాల్సిన ట్రంప్‌... ప్రతీకార దాడులకు దిగితే ఖబడ్దార్‌ అంటూ తిరిగి ఇరాన్‌నే హెచ్చరించారు. ఆఖరికి శనివారం అర్ధరాత్రి దాటాక అమెరికా తానే రంగంలోకి దిగి బంకర్‌ బస్టర్‌ బాంబులతో ఇరాన్‌లో మూడు అణు స్థావరాలను ధ్వంసం చేశామని ప్రకటించింది. ఇంతా అయినాక హఠాత్తుగా ట్రంప్‌ కొత్త రాగం అందుకున్నారు. 

ఏకపక్ష యుద్ధం ప్రారంభానికి పూర్వమే ఇరాన్‌ బలహీనతలు బయటపడ్డాయి. దశాబ్దాల ఆంక్షలతో అన్నివిధాలా దెబ్బతిన్న దేశం మెరుగ్గా ఉండగలదని ఎవరూ భావించలేరు. ఒకపక్క నేరుగా అమెరికా, ఇజ్రాయెల్‌ కుటిలత్వం తెలుస్తున్నా మిత్రులనుకున్నవారు కూడా ఖండించ టానికి సిద్ధపడకపోవటం... అండగా ఉండగలవని భావించిన రష్యా, చైనాలు ప్రకటనలకే పరిమితం కావటం, గల్ఫ్‌ దేశాలు నామమాత్రంగా ఖండించి ఊరుకోవటం ఇరాన్‌ ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీసి ఉంటాయి. 
 


అణు ఒప్పందానికి సిద్ధపడతామని ప్రకటించి ఆ దిశగా అడుగులేస్తున్న దేశం ప్రపంచంలో ఇలా ఏకాకిగా మిగిలిపోవటం వర్తమాన విషాదం. యుద్ధం పర్యవసానంగా ఇరాన్‌లో పలు దేశాల పెట్టుబడులు దెబ్బతింటాయి. పైగా ప్రపంచానికి పెద్ద పోలీసుగా వ్యవహరిస్తూ తాము చెప్పిందే ఒప్పందమని ఒత్తిడి తెచ్చే ధోరణి రేపన్నరోజు ఎవరికైనా ముప్పే. 

ఇజ్రాయెల్‌ దగ్గర... ఆ మాటకొస్తే పశ్చిమాసియాలో అణుబాంబుల జాడలేకపోతే, ఇరాన్‌ మాత్రమే ఆ పని చేస్తే దాన్ని నియంత్రించటంలో హేతుబద్ధత ఉన్నదని నమ్మినా తప్పుబట్టనవసరం లేదు. కానీ అసలు అమెరికా, రష్యా మొదలుకొని ఏకపక్ష యుద్ధాలతో అందరూ తమ బాధ్యతారాహిత్యాన్ని బయటపెట్టుకుంటుండగా ఒక్క ఇరాన్‌ మాత్రమే ధూర్త దేశమని ఎందుకు భావించాలి? 

ఇంతకూ ట్రంప్‌ హఠాత్తు నిర్ణయం వెనకున్న కారణాలేమిటి? సైనిక స్థావరంపై దాడి చేస్తున్నా మని ఇరాన్‌ ముందస్తు సమాచారం ఇవ్వటం, అందుకు అనుగుణంగా అమెరికా తన సైనికుల్ని తరలించటంతోపాటు క్షిపణుల్ని కూల్చే ఏర్పాటు చేసుకోవటం సాధ్యమైంది. ఒకే ఒక్కటి పేలినా దానివల్ల నష్టం లేదు. అది ట్రంప్‌కు నచ్చినట్టుంది. దానికితోడు ఆయన అందలం ఎక్కటంలో కీలకపాత్ర పోషించిన ‘మాగా’ ఈ యుద్ధంపై చీలిపోయింది. గట్టి మద్దతుదారైన స్టీవ్‌ బెనన్‌ లాంటివారు సైతం ట్రంప్‌ను తప్పుబట్టారు. 

ఆ ఒత్తిళ్ల మాటెలావున్నా యూరప్‌ నుంచి వస్తున్న వార్తలు అమెరికాను భయపెట్టి ఉండాలి. అమెరికా తర్వాత బంగారం నిల్వల్లో రెండు, మూడు స్థానాల్లో ఉన్న జర్మనీ (3,352 టన్నులు), ఇటలీ (2,452 టన్నులు) ఆ నిల్వల్లో మూడోవంతు భాగాన్ని అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌లో ఉంచాయి. దాన్ని వెనక్కుతేవాలని ఆ దేశాల్లో డిమాండ్లు బయల్దేరాయి. 

నిల్వల విలువ 24,500 కోట్ల డాలర్ల పైమాటే. ఫెడరల్‌ రిజర్వ్‌ స్వతంత్రతను దెబ్బతీసేలా ట్రంప్‌ వ్యవహరించటం, ప్రపంచాన్ని అస్థిరపరిచే నిర్ణయాలు తీసుకోవటం తదితర కారణాల వల్ల అమెరికాలో బంగారం ఉంచటం సురక్షితం కాదని విపక్షాలు వాదిస్తున్నాయి. అది ఆచరణ రూపందాలిస్తే అమెరికా ఆర్థికవ్యవస్థ మరింత కుంగిపోవటం ఖాయం. 

పైగా లండన్‌తో పాటు ప్రపంచంలోనే కీలకమైన బంగారం కేంద్రంగా వెలిగిపోతున్న న్యూయార్క్‌  కళ అడుగంటు తుంది. అందుకే ట్రంప్‌ పునరాలోచనలో పడ్డారా? లేక ముందస్తు సమాచారం ఇచ్చిన ఇరాన్‌ ‘మంచితనం’ నచ్చిందా? మొత్తానికి అగ్ని గుండం కాబోతున్న పశ్చిమాసియాలో సామరస్య గాలులు వీచటం ఆహ్వానించదగ్గది. ఇది పూర్తి స్థాయిలో సాకారం కావాలని ఆశించాలి. 

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు