Breaking News

పదునెక్కిన బంధం

Published on Thu, 02/19/2026 - 01:12

అంతర్జాతీయంగా అవాంతరాలు ఎదురైన ప్రతి సందర్భంలోనూ మనకు అండగా నిలబడిన ఫ్రాన్స్‌తో మన అనుబంధం మరింత బలపడింది. ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమాన్యుయేల్‌ మెక్రాన్‌ భారత పర్యటన సందర్భంగా రక్షణ, ఆరోగ్యం, అత్యంతా ధునాతన సాంకేతికత, సంప్రదాయేతర ఇంధన వనరులు, అరుదైన ఖనిజాలు సహా పలు అంశాల్లో ఇరు దేశాలకూ లబ్ధి చేకూర్చే 21 ఒప్పందాలపై మంగళవారం సంతకాలు కావటంతోపాటు ఇప్పుడున్న ద్వైపాక్షిక బంధాన్ని ప్రత్యేక ప్రపంచ స్థాయి వ్యూహాత్మక భాగస్వామ్యానికి విస్తరించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ, మెక్రాన్‌లు నిర్ణయించటం చరిత్రాత్మకం. 

పరస్పర గౌరవం, ఇచ్చిపుచ్చుకొనే ధోరణి ఉంటే దేశాల మధ్య స్నేహం చిగురించటం, విస్తరించటం కష్టమేమీ కాదు. కానీ చుట్టూ గడ్డు పరిస్థితులున్నా, అనిశ్చితి ఆవరించినా కూడా ఆ బంధం మరింత దృఢపడటం గొప్ప విషయం. మోదీ అన్నట్టు ఇరు దేశాల మధ్యా దశాబ్దాలుగా ఉన్న ‘సరిహద్దులు లేని’ చెలిమి వల్లనే ఇదంతా సాధ్యమైంది. 1988లో పోఖ్రాన్‌లో అప్పటి వాజ్‌పేయి నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం అణుపరీక్ష నిర్వహించినప్పుడు ఏం జరిగిందో అందరికీ గుర్తుంది. 

అప్పటికే తమ అమ్ములపొదిలో వందల సంఖ్యలో అణుబాంబులు పెట్టుకున్న అమెరికా, బ్రిటన్, చైనా తదితర దేశాలన్నీ మనపై విరుచుకుపడ్డాయి. సుద్దులు చెప్పేందుకు సిద్ధమ య్యాయి. యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ) శిఖరాగ్ర సదస్సు ఆంక్షలు విధించేందుకు సిద్ధమైంది. అప్పుడు భారత్‌ను గట్టిగా సమర్థించి, ఆంక్షలు విధించే తీర్మానాన్ని ‘వీటో’ చేస్తామని ఫ్రాన్స్‌ హెచ్చరించటంతో అది కాస్తా సద్దుమణిగింది. ఆ తర్వాత కూడా అణు రియాక్టర్ల సాంకేతికత మొదలు అధునాతన ఆయుధాలు అందించటం వరకూ ఆ దేశం మనకెంతో తోడ్పాటునందించింది. 

ప్రపంచ దేశాలను బతిమాలి, ఒత్తిడి తెచ్చి మూడు దశాబ్దాల క్రితం తానే తీసు కొచ్చిన ప్రపంచీకరణ విధానాలకు హఠాత్తుగా తిలోదకాలిచ్చిన అమెరికా... ఇప్పుడు ఒంటెత్తు పోకడలతో, బెదిరింపులతో, దబాయింపులతో అందరినీ పాదాక్రాంతం చేసుకోవాలని చూస్తోంది. అంతర్జాతీయ దౌత్య సంప్రదాయాలకూ, మర్యాదలకూ ఆ దేశాధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ చెల్లుచీటీ ఇచ్చారు. 

ఈ కల్లోల స్థితిలో భారత్‌–ఫ్రాన్స్‌ల మధ్య ఇప్పుడు కుదిరిన ఒప్పందాలు ఏదోమేర సుస్థిరత ఏర్పడటానికి దోహద పడతాయి. వర్తమాన ప్రపంచ పరిణామాలపై ఇరు దేశాల వైఖరులూ ఒకటే. అన్ని దేశాలూ నిబంధనలకు కట్టుబడి ఉన్నప్పుడే అందరూ సమానంగా అభివృద్ధి సాధించగల మెరుగైన ప్రపంచం ఏర్పడుతుందని రెండు దేశాలూ విశ్వసిస్తాయి. ఇలాంటి సారూప్యతల కారణంగానే ప్రగాఢమైన సాన్నిహిత్యం సాధ్యమైంది. 

మన రక్షణ కొనుగోళ్లలో రష్యా తర్వాత ఫ్రాన్స్‌దే రెండో స్థానం. ఆ రంగంలో మనం స్వావలంబన సాధించాలనీ, విదేశాలపై ఆధారపడటం తగ్గాలనీ అందరూ కోరుకుంటున్నదే. కానీ ఈలోగా మన భద్రతకూ, రక్షణకూ విశ్వసించదగ్గ భాగస్వాములు ఎంతో అవసరం. రష్యాతోపాటు ఫ్రాన్స్‌ దాన్ని నెరవేర్చగలుగుతోంది. 

మన వైమానిక దళానికీ, నావికాదళానికీ మరిన్ని రఫేల్‌ యుద్ధ విమానాల కోసం మనం ఒప్పందం కుదుర్చుకోగా, వాటిలో కొన్నిటిని ఇక్కడే ఉత్పత్తి చేసేందుకు ఫ్రాన్స్‌ అంగీకరించింది. అలాగే ఎవరెస్టు శిఖరం కన్నా ఎత్తులో ఎగిరే ఎయిర్‌బస్‌ హెచ్‌ 125 హెలికాప్టర్ల తయారీ సైతం మొదలైంది. వాటిని ప్రపంచ వ్యాప్తంగా ఎగుమతి చేస్తామని మోదీ ప్రకటించారు. 

ప్రపంచం తూర్పు, పడమరలుగా... ఉత్తర, దక్షిణాలుగా విడివడి ఉంది. మనం పాశ్చాత్య దేశాలుగా పిలుచుకునే వాటిలో సైతం భిన్న ధోరణులు కనబడుతున్నాయి. ఇలాంటి ప్రపంచంలో పరస్పర సహకారం, గౌరవం, ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉంటే ఏ రెండు పక్షాల మధ్యనైనా అవగాహన కష్టం కాదని ఇప్పుడు ఫ్రాన్స్‌తో కుదిరిన ఒప్పందాలైనా, ఇంత క్రితం బ్రిటన్, ఈయూలతో కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలైనా రుజువు చేశాయి. 

ఎప్పటికీ ఏకధ్రువ ప్రపంచమే కొనసాగాలనీ, తమ ఆధిపత్యమే శాశ్వతంగా వర్ధిల్లాలనీ, అన్యులెవరూ ఎదగరాదనీ భావిస్తున్న అమెరికా... బహుళ ధ్రువ ప్రపంచం తన కళ్లముందే నిర్మాణమవుతున్న వైనాన్ని ఇకనైనా గ్రహించటం మంచిది.  

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)