ఇక అమెరికా పనైపోయింది..? ఈ యుద్ధం ఆగదు..
Breaking News
ట్రంప్ పాచిక పారేనా?
Published on Sat, 04/04/2026 - 09:39
పశ్చిమాసియాలో రోజురోజుకూ ముదురుతున్న యుద్ధ మేఘాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుత పరిస్థితుల్లో ఇరాన్‌తో నెలకొన్న ఉద్రిక్తతల నుంచి సులభంగా నిష్క్రమించగలరా? అనే ప్రశ్న వస్తోంది. ఈ అనిశ్చితుల నేపథ్యంలో చాలా కాలంగా స్తబ్దుగా ఉన్న మార్కెట్లు విలువ పరంగా ఇటీవల కొంత ఆశాజనకంగా కనిపిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో భౌగోళిక రాజకీయ పరిణామాలు మాత్రం ఇందుకు భిన్నమైన సంకేతాలను ఇస్తున్నాయి.
వ్యూహాత్మక ఆధిపత్యం: ఇరాన్ ఎందుకు కీలకం?
గత కొంతకాలంగా ఇజ్రాయెల్-అమెరికా కూటమి గాజా, సిరియా, ఇరాక్ ప్రాంతాల్లో తమ వ్యతిరేక శక్తులను క్రమపద్ధతిలో బలహీనపరుస్తూ వస్తున్నాయి. గల్ఫ్ దేశాలు పాలస్తీనాకు సానుభూతి తెలుపుతున్నట్లు కనిపిస్తున్నా లోలోపల అమెరికా రక్షణ గొడుగు కిందకే చేరుతున్నాయి. గల్ఫ్ దేశాల సంపద అమెరికా ట్రెజరీ బాండ్లలో పెట్టుబడిగా మారుతూ యూఎస్ ఆర్థిక ఆధిపత్యాన్ని బలపరుస్తోంది.
అయితే, ఈ పూర్తిస్థాయి ఆధిపత్యానికి అడ్డుగా నిలిచింది ఇరాన్, దాని ప్రాక్సీలు (హిజ్బుల్లా, హౌతీలు). హార్మూజ్ జలసంధిపై పట్టు సాధించడం ద్వారా చైనా వంటి ఆసియా దేశాల ఇంధన సరఫరాను నియంత్రించే ‘ట్రంప్ కార్డ్’ అమెరికాకు ఇక్కడే దొరుకుతుంది. అందుకే ఈ దశలో యుద్ధం నుంచి వైదొలగడం అంటే ఇరాన్ సామీప్య శక్తులకు తలవంచడమే అవుతుందని విశ్లేషకుల అభిప్రాయపడుతున్నారు. అమెరికా చర్యలను ఇరాన్ ప్రతిఘటిస్తుండడం అగ్రరాజ్యానికి మింగుడుపడడం లేదు. దాంతో యూఎస్ మరింత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. అందులో భాగంగానే ఇటీవల ఇరాన్‌లోని మౌలిక సదుపాయాలపై దాడి చేసింది. అందుకు తప్పకుండా ప్రతికారం తీర్చుకుంటామని ఇరాన్ చెప్పింది.
ఆర్థిక సంక్షోభం
ఈ పరిణామాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బదీస్తున్నాయి. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) మాజీ ఆర్థికవేత్త కెన్నెత్ రోగోఫ్ హెచ్చరించినట్లుగా, ఐదు దశాబ్దాల్లో ప్రపంచం చూడని అతిపెద్ద స్టాగ్ఫ్లేషనరీ ముప్పు (ఆర్థిక మందగమనం + అధిక ద్రవ్యోల్బణం) దిశగా ఈ యుద్ధం దారితీస్తోంది. మార్చి నెల జేపీ మోర్గాన్ గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్ ఇండెక్స్ ప్రకారం, ఇన్‌పుట్ ధరల ద్రవ్యోల్బణం 44 నెలల గరిష్టానికి చేరింది. ఇది వడ్డీ రేట్ల తగ్గింపు ఆశలపై నీళ్లు చల్లింది. భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం, చమురు, ఎరువుల సరఫరాలో అంతరాయం, లాజిస్టిక్స్ ఖర్చులు పెరగడం, గల్ఫ్ నుంచి వచ్చే రెమిటెన్స్‌లు తగ్గడం వంటి అంశాలు రూపాయి విలువను మరింత పాతాళానికి నెట్టే ప్రమాదం ఉంది. ఇందుకు ప్రతిచర్యగా ఆర్‌బీఐ ఇటీవల కొన్ని చర్యలు తీసుకుంది.
భారత మార్కెట్లు - రంగాల వారీ విశ్లేషణ
విమానయానం, ఆటోమొబైల్, నిర్మాణ రంగాలు పెరిగిన ఇంధన, ముడిసరుకు ధరల వల్ల ఇబ్బందులు ఎదుర్కోనున్నాయి.
రక్షణ రంగం కొత్త పుంతలు తొక్కనుంది. యుద్ధతంత్రంలో మారుతున్న సాంకేతికతను అందిపుచ్చుకునే భారతీయ రక్షణ కంపెనీలకు ఇది కలిసొచ్చే అంశం.
రసాయన, సిరామిక్ రంగాల్లో కొన్ని బలహీనమైన సంస్థలు నిష్క్రమించి, పటిష్టమైన కంపెనీలకు మార్కెట్ వాటా పెరిగే అవకాశం ఉంది.
ట్రంప్ ఏం చేయబోతున్నారు?
ప్రముఖ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. ట్రంప్ ఈ యుద్ధాన్ని ఎంత దారుణంగా నిర్వహించినా చివరకు తనే గెలిచినట్లు ప్రకటించుకుని వైదొలిగే అవకాశం ఉంది. ఆయనకు ఓటమిని అంగీకరించే అలవాటు లేదు. యుద్ధం ముగిసినా దాని వల్ల కలిగే ఆర్థిక పర్యవసానాలు మాత్రం దశాబ్దాల పాటు ప్రపంచాన్ని వెంటాడుతూనే ఉంటాయి. ఇలాంటి అనిశ్చిత సమయంలో పెట్టుబడిదారులు తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం కంటే వేచి చూసే ధోరణి ఉత్తమం.
ఇదీ చదవండి: వైద్యరంగానికి ‘సహకారి’ కరవు
Tags : 1