5 రోజుల్లో రూ.663 కోట్లు! బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న రామాయణం
Breaking News
ఎన్విడియా గుట్టు విప్పిన యువకుడు.. ఒక్క రిపోర్ట్‌తో సంచలనం!
Published on Thu, 11/12/2026 - 12:57
ప్రపంచంలోనే అత్యంత విలువైన టెక్ కంపెనీల్లో ఒకటైన ఎన్విడియా గురించి.. ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈ చర్చ ఈసారి కంపెనీ సాధించిన విజయాల గురించి కాదు.. దాని చుట్టూ నెలకొన్న వివాదాల గురించి.
ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఎన్విడియాకు చైనా విషయంలో సమస్యలు రావచ్చని ఆరు నెలల క్రితమే ఓ 31 ఏళ్ల యువకుడు హెచ్చరించాడు. అప్పట్లో అతడి మాటలను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు అదే నివేదికపై ప్రపంచవ్యాప్తంగా మాట్లాడుకుంటున్నారు.
ముందే హెచ్చరించిన లమార్కో
ఎన్విడియాకు సమస్యలు వచ్చే అవకాశం ఉందని చెప్పిన ఆ యువకుడి పేరు క్రిస్టియన్ లమార్కో. అమెరికాకు చెందిన కుల్పర్ రీసెర్చ్ అనే షార్ట్ సెల్లింగ్ సంస్థను ఆయన నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది మేలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో కలిసి ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ చైనా పర్యటనకు వెళ్లిన సమయంలో.. లమార్కో ఓ 40 పేజీల నివేదిక విడుదల చేశారు.
ఎన్విడియాకు చైనా వ్యాపారంతో కొన్ని సమస్యలు వస్తాయని, భవిష్యత్తులో అవే కంపెనీకి ఇబ్బందులు తెచ్చి పెట్టే అవకాశం ఉందని నివేదికలో పేర్కొన్నాడు. అంతేకాదు, సింగపూర్‌కు చెందిన మెగాస్పీడ్ సంస్థలో పనిచేసిన అలిస్ హువాంగ్‌తో జెన్సన్ హువాంగ్‌కు ఉన్న సన్నిహిత సంబంధాల గురించి కూడా ప్రస్తావించారు. అయితే.. అప్పట్లో ఈ నివేదికను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు.
చెప్పినట్లే జరిగిందా?
కానీ.. ఆరు నెలల తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అలిస్ హువాంగ్‌తో తనకు వివాహేతర సంబంధం ఉన్నట్లు జెన్సన్ హువాంగ్ అంగీకరించినట్లు తెలిసింది. అంతే కాకుండా.. అలిస్ హువాంగ్ చైనా నిఘా సంస్థతో సంబంధాలు కలిగి ఉన్నారనే ఆరోపణలు కూడా తెరపైకి వచ్చాయి. ఈ పరిణామాల మధ్య ఎన్విడియా షేర్లు భారీగా పడిపోయాయని, కంపెనీ మార్కెట్ విలువ సుమారు 600 బిలియన్ డాలర్లు తగ్గినట్లు సమాచారం.
దీంతో ఆరు నెలల క్రితం లమార్కో చేసిన హెచ్చరికలను ఇప్పుడు చాలామంది గుర్తుచేసుకుంటున్నారు. ఈ పరిణామాలపై లమార్కో కూడా స్పందించారు. తాము నివేదిక విడుదల చేసినప్పుడు ఎవరూ పట్టించుకోలేదని, కొందరు తమను ఎగతాళి కూడా చేశారని చెప్పారు. కానీ ఇప్పుడు అదే నివేదిక గురించి అందరూ మాట్లాడుతున్నారని తెలిపారు. కొన్నిసార్లు మనం చెప్పే విషయాలకు వెంటనే గుర్తింపు రాకపోయినా, సరైన సమయంలో వాటికి ప్రాధాన్యత వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఎవరీ.. లమార్కో?
ఇక లమార్కో విషయానికి వస్తే.. ఈయన న్యూయార్క్‌లో ఓ పాస్టర్ కుటుంబంలో పెరిగారు. కాలేజీ రోజుల నుంచే పెట్టుబడులపై ఆసక్తి ఏర్పడింది. ఫైనాన్స్ చదివిన తర్వాత 2017లో చికాగోలోని ఓ పెట్టుబడుల సంస్థలో ఉద్యోగం చేశారు. రెండేళ్ల తర్వాత ఆ ఉద్యోగాన్ని వదిలేసి, తన దగ్గరున్న కొద్దిపాటి పొదుపుతో సొంతంగా సంస్థను ప్రారంభించారు. మొదట షాడీసైడ్ అనే పేరుతో వ్యాపారం మొదలుపెట్టినా, తర్వాత అమెరికా స్వాతంత్య్ర పోరాట సమయంలో రహస్య సమాచారాన్ని సేకరించిన కుల్పర్ రింగ్ పేరు మీద కుల్పర్ రీసెర్చ్‌గా మార్చారు.
ప్రస్తుతం ఆయన సంస్థలో కేవలం ముగ్గురు మాత్రమే పనిచేస్తున్నారు. అయినప్పటికీ పెద్ద పెద్ద కంపెనీల వ్యాపార వ్యవహారాలను పరిశీలిస్తూ నివేదికలు విడుదల చేస్తున్నారు. గతంలో.. లైఫ్‌ఎండీ అనే కంపెనీపై నివేదిక విడుదల చేయగా, ఆ తర్వాత దాని షేర్లు భారీగా పడిపోయాయి. మరోవైపు టెక్నోగ్లాస్ అనే కంపెనీకి డ్రగ్ కార్టెల్‌తో సంబంధాలు ఉన్నాయని ఆరోపించగా, ఆ సంస్థ ఆయనపై పరువు నష్టం దావా వేసింది. అంతేకాదు, ఆర్చర్ ఏవియేషన్ కంపెనీపై కూడా ఆయన ప్రతికూల అంచనాలు వ్యక్తం చేశారు. ఆ కంపెనీ ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీలో టీవీ హోస్ట్ జిమ్మీ ఫాలన్ ప్రయాణిస్తే లక్ష డాలర్ల పందెం చెల్లిస్తానని కూడా ప్రకటించారు.
ఇదీ చదవండి: జాబ్ మానేసినా జీతం ఇస్తాం.. CEO సంచలన నిర్ణయం!
Tags : 1