Vijayawada : చెవిరెడ్డి రిలీజ్.. జైలు వద్ద YSRCP సంబరాలు
Breaking News
లెక్కలు తప్పయితే.. చిక్కులు తప్పవు!
Published on Thu, 01/29/2026 - 07:30
ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి పార్లమెంటులో బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నారు. దేశ ఆర్థిక గమనాన్ని నిర్దేశించే ఈ కీలక ప్రకటన కోసం దేశవ్యాప్తంగా సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఆదాయపు పన్ను రాయితీలు పెరుగుతాయా? నిత్యావసరాల ధరలు తగ్గుతాయా? గృహ రుణ గ్రహీతలకు ఊరట లభిస్తుందా? అన్నవి ఇప్పుడు ప్రజల ముందున్న ప్రశ్నలు.
అయితే, కేంద్ర బడ్జెట్ కేవలం టీవీల్లో చూసే అంకెలు మాత్రమే కాదు; అది నేరుగా మీ ఇంట్లో, మీ పిల్లల చదువులపై, మీ పొదుపుపై ప్రభావం చూపే అంశం. అందుకే, ప్రభుత్వ బడ్జెట్‌తో పాటు మీ ‘ఇంటి బడ్జెట్’ను ఎలా ప్లాన్ చేసుకోవాలి? పన్ను మార్పులను ఎలా అందిపుచ్చుకోవాలి? అసలు ఆర్థిక క్రమశిక్షణ ఎందుకు ముఖ్యం? వంటి అంశాలతో కూడిన ప్రత్యేక కథనం ఇదిగో..
పన్ను మార్పులు..
ఈసారి కొత్త పన్ను విధానంలో (New Tax Regime) మరిన్ని మార్పులు లేదా సెక్షన్ 80C కింద మినహాయింపు పరిమితిని రూ.1.5 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచే అవకాశం ఉందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. బడ్జెట్ ప్రసంగం తర్వాత మీ వార్షిక ఆదాయం ఏ పన్ను స్లాబ్‌లోకి వస్తుందో లెక్కించుకుని, దానికి అనుగుణంగా పెట్టుబడులను ప్లాన్ చేసుకోండి.
ఖర్చుల అంచనా
బడ్జెట్లో కొన్ని వస్తువులపై కస్టమ్స్ డ్యూటీ తగ్గించడం లేదా పెంచడం జరుగుతుంది. మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్స్, బంగారం లేదా గృహోపకరణాల ధరల్లో మార్పులు ఉండవచ్చు. మీ ఇంట్లో కొనుగోలు చేయాల్సిన వస్తువుల జాబితా ఉంటే బడ్జెట్ తర్వాత ధరల హెచ్చుతగ్గులను బట్టి నిర్ణయం తీసుకోవడం ఉత్తమం.
పొదుపు మంత్రం
బడ్జెట్లో మౌలిక సదుపాయాలు, తయారీ రంగాలకు పెద్దపీట వేయడం వల్ల దీర్ఘకాలంలో స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్‌పై ప్రభావం ఉంటుంది. మీ భవిష్యత్తు అవసరాల కోసం (పిల్లల చదువు, పెళ్లిళ్లు) ఎంత మేర కేటాయించాలో బడ్జెట్ ఫలితాలను బట్టి నిర్ణయించుకోవాలి.
‘ఇంటి బడ్జెట్’ ఎందుకు?
ప్రభుత్వం దేశం కోసం ఎలాగైతే ప్రణాళికలు సిద్ధం చేస్తుందో ప్రతి ఇంట్లో కూడా అలాగే ఆర్థిక క్రమశిక్షణ పాటించాలి. ఎందుకంటే..
అనుకోని ఆరోగ్య సమస్యలు లేదా ఉద్యోగ మార్పులు ఎదురైనప్పుడు ఎమర్జెన్సీ ఫండ్ అవసరం ఉంటుంది. బడ్జెట్ వేసుకుంటేనే మన దగ్గర ఎంత మిగులు ఉందో తెలుస్తుంది. దాన్ని ఎమర్జెన్సీ ఫండ్‌లోని మళ్లించవచ్చు.
ఆదాయానికి మించిన ఖర్చులు చేస్తే క్రెడిట్ కార్డులు, పర్సనల్ లోన్ల ఊబిలో చిక్కుకుపోయే ప్రమాదం ఉంది. బడ్జెట్ వల్ల అనవసరపు ఖర్చులకు అడ్డుకట్ట వేయవచ్చు.
సొంత ఇల్లు కొనాలన్నా, కొత్త కారు తీసుకోవాలన్నా, పిల్లల చదువులు సాగాలన్నా.. కచ్చితమైన ప్లానింగ్ అవసరం. నెలకు ఎంత పొదుపు చేస్తున్నామో తెలిస్తేనే లక్ష్యం చేరువవుతుంది.
బడ్జెట్ కోసం సింపుల్ టిప్: 50-30-20 రూల్
మీ ఆదాయాన్ని మూడు భాగాలుగా విభజించండి. మొత్తం నెలవారీ రాబడిలో..
50%: అవసరాలు (అద్దె, కిరాణా, ఫీజులు)
30%: కోరికలు (సినిమాలు, విహారయాత్రలు, షాపింగ్)
20%: పొదుపు, పెట్టుబడులు
కేంద్ర బడ్జెట్ 2026 దేశానికి ఒక రోడ్ మ్యాప్ అయితే, మీరు వేసుకునే ఇంటి బడ్జెట్ మీ కుటుంబ ఆర్థిక భరోసాకు పునాది. ఫిబ్రవరి 1న వెలువడే అధికారిక ప్రకటనలను బట్టి మీ ఆర్థిక వ్యూహాన్ని సిద్ధం చేసుకోండి.
ఇదీ చదవండి: కొత్త వాహనం.. అయినా టైరు పేలొచ్చు!
Tags : 1