EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి
Breaking News
ఏపీ ‘సర్’పై వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు
Published on Wed, 07/01/2026 - 13:10
సాక్షి, తాడేపల్లి: ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) పేరుతో పెద్ద కుట్ర జరుగుతోందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ప్రజాస్వామ్యానికి మూలస్తంభమైన ఓటు హక్కును రాజకీయ ప్రయోజనాల కోసం లక్ష్యంగా చేసుకోవడం అత్యంత ప్రమాదకరమని అన్నారు. పేదల ఓట్లను తొలగించడం ద్వారా వారి హక్కులను హరించే ప్రయత్నం జరుగుతోందని అన్నారాయన .
ఎన్యుమరేషన్ ప్రక్రియలో భారీ అవకతవకలు జరుగుతున్నాయని బుధవారం మీడియా సమావేశంలో జగన్ వ్యాఖ్యానించారు. ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారాలు ఇవ్వకుండానే ఇచ్చినట్లుగా రికార్డుల్లో నమోదు చేస్తున్నారని అన్నారు. దీంతో వేలాది మంది ఓటర్ల పేర్లు జాబితా నుంచి తొలగించే అవకాశాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. "చంద్రబాబుకు మానవత్వం ఉందా? స్వార్థ రాజకీయాల కోసం పేదవాడి ఓటునే తొలగిస్తారా?" అని ప్రశ్నించారు.
పేదల ఓటు తొలగిస్తే వారు సంక్షేమ పథకాల లబ్ధిదారులుగా ఎలా కొనసాగుతారని జగన్ ప్రశ్నించారు. ప్రజలను ఓటు హక్కు లేనివారిగా మార్చే ప్రయత్నం జరుగుతోందని, ఇది పౌరసత్వాన్ని నిర్వీర్యం చేసే చర్యలతో సమానమని విమర్శించారు.
ఇక.. టీడీపీ ప్రత్యేక యాప్ను ఉపయోగించి ఓటర్ల జాబితాలో జోక్యం చేసుకుంటున్నారని జగన్ ఆరోపించారు. తమకు అనుకూలంగా ఉన్న వారి ఓట్లను నమోదు చేయించి, వ్యతిరేకంగా ఓటు వేసే అవకాశం ఉన్న వారి పేర్లను తొలగించే ప్రయత్నం జరుగుతోందని అన్నారు. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్య వ్యవస్థను బలహీనపరుస్తాయని, ఎన్నికల ప్రక్రియ విశ్వసనీయతను దెబ్బతీస్తాయని వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా మంత్రి నారాయణ, ఓ మున్సిపల్ కమిషనర్ మధ్య జరిగినట్లు పేర్కొన్న ఫోన్ సంభాషణ ఆడియోను జగన్ మీడియా సమావేశంలో వినిపించారు. ఓటర్ల నమోదు ప్రక్రియలో అధికార యంత్రాంగంపై రాజకీయ ఒత్తిళ్లు ఎలా పనిచేస్తున్నాయో ఈ సంభాషణ వెల్లడిస్తోందని ఆయన చెబుతున్నారు.
Tags : 1