Breaking News

రెండేళ్ల బాబు పాలన.. ప్రసంగాలకే పరిమితం!

Published on Fri, 06/12/2026 - 10:03

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం రోజురోజుకు బలహీనపడుతోంది. ప్రజలలో విశ్వాసం కోల్పోతున్న ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తరచు చేస్తున్న వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనంగా కనిపిస్తాయి. నిత్యం హెలికాఫ్టర్ వేసుకుని ఎక్కడో చోటకు వెళ్లి ప్రసంగం చేయకపోతే ఆయనకు నిద్రపట్టదేమో తెలియదు. ఒకవైపు దుబారా వ్యయం అదుపు చేయాలని ఆయన ప్రభుత్వం ఆదేశాలు ఇస్తుంది.

స్వయంగా సీఎం గారే అవసరం ఉన్నా, లేకపోయినా హెలికాఫ్టర్లు, ప్రత్యేక విమానాలలో పర్యటిస్తూ లక్షలు, కోట్ల రూపాయలు నీళ్లమాదిరి వ్యయం చేస్తుంటారు. పోనీ ప్రసంగాలలో ఏమైనా నిజాయితీ, ఆదర్శం, నిబద్ధత కనిపిస్తాయా అంటే అదేమీ ఉండదు. ఆయన స్పీచ్ ఇచ్చినంతసేపు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ను, మాజీ సీఎం జగన్‌ను దూషించడమే పనిగా పెట్టుకుంటారు. మాట్లాడితే గొడ్డలి పార్టీ అని, విధ్వంసం అని రకరకాల పదజాలాలతో ప్రజలను విసిగిస్తుంటారు. లేదంటే తాను చాలా చేసేసినట్లు అతిశయోక్తులు చెప్పి ప్రజలు విస్తుపోయేలా చేస్తుంటారు. తత్ఫలితంగా ఆయన సీనియారిటీ అంతా ఇలా ప్రత్యర్ధులపై బురద జల్లడానికే సరిపోతుంది. అందువల్లే ఆయన ప్రజలలో గౌరవం పెంచుకోలేకపోతున్నారు.

మరోవైపు చంద్రబాబు ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా వైసీపీ ప్రత్యేక నిరసన కార్యక్రమాలు చేపట్టింది. వెన్నుపోటుకు రెండేళ్లు పేరుతో చేపడుతున్న ఈ నిరసనలలో వైసీపీవారు లేవనెత్తుతున్న అంశాలకు చంద్రబాబు కాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాని, కీలక మంత్రి లోకేష్ గాని సూటిగా జవాబు ఇచ్చే పరిస్థితి లేదు. ఈ రెండేళ్లలో సాగిన అరాచకాలు, హామీల ఎగవేత మొదలైన అంశాలను వీరు ప్రస్తావిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా బుక్ లెట్ కూడా విడుదల చేశారు. వీటిని వైసీపీ నేతలు చదివి వినిపిస్తున్నారు. గ్రామ, మండల కేంద్రాలలో నిరసనలు చేపట్టారు.

12వ తేదీన నియోజకవర్గ కేంద్రాలలో భారీ ర్యాలీలు తీసి ఎన్నికల సమయంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు ఇచ్చిన బాండ్లను దహనం చేయ సంకల్పించారు. ఇది సహజంగానే చంద్రబాబుకు చికాకుగా ఉంటుంది. ఆ బాండ్లలో ఉన్న హామీలు ఏ మేరకు తీర్చింది? ఇంకెన్ని నెరవేర్చాలి? అందుకు ఇంకెంత సమయం తీసుకుంటారు? మొదలైన వాటి గురించి చంద్రబాబు, పవన్, లోకేష్‌లు చెప్పలేకపోతున్నారు. తాము ఇచ్చిన ఎన్నికల మానిఫెస్టోని ప్రజల ముందు పెట్టి ధైర్యంగా ఇవి చేశాం అని చెప్పగలిగితే చంద్రబాబు మాటలకు విలువ ఉంటుంది. అలాకాకుండా సూపర్ సిక్స్ చేసేశాం అని దబాయించితే సరిపోతుందా! వృద్దాప్య పెన్షన్లు వెయ్యి రూపాయలు పెంచడం మినహా మరే హామీని పూర్తిగా నెరవేర్చినట్లు కనిపించదు.

వృద్దాప్య పెన్షన్లలో కొన్ని లక్షల మందికి కోత పెట్టారన్న విమర్శ ఉంది. అలాగే కొన్ని లక్షలమంది కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు. వారికి ఎప్పటికి ఇస్తారో తెలియదు. కాకపోతే ఎల్లో మీడియా అది జరిగిపోతుంది.. ఇది జరిగిపోతుంది అని ప్రజలలో భ్రమలు కల్పించడానికి నానా పాట్లు పడుతోంది. సూపర్ సిక్స్ లోని ముఖ్యమైన ఆడబిడ్డ నిధి హామీ గురించి చంద్రబాబు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు. ఆ మద్య పీ-4 ద్వారా వీరికి ఏదో చేసేశామని చెప్పే యత్నం చేశారు. కాని జనం దానిని అసలు స్వీకరించలేదు. ఆ విషయాన్ని గుర్తించారేమో పీ-4 గురించి పెద్దగా మాట్లాడడం లేదు. నిరుద్యోగ భృతి కింద నెలకు మూడువేలు ఇస్తామన్న హామీని అలాగే గాయబ్ చేశారు. పైగా 24 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేసినట్లు, 24 లక్షల ఉద్యోగాలు వచ్చేస్తున్నట్లు మభ్య పెట్టే యత్నం చేస్తున్నారు. అది కూడా ప్రజలలో ఆగ్రహానికి కారణం అవుతోంది.

బీసీలకు ఏభై ఏళ్లకే పెన్షన్ ఇస్తామని బాండ్ రాసిచ్చారు. కాని దాని ఊసే ఎత్తడం లేదు. ఇలా అనేక హామీలను నెరవేర్చలేకపోయారు. చంద్రబాబు కొత్తగా నాగలి బాధలు గొడ్డలికి తెలియవు అంటూ చిత్రమైన వ్యాఖ్య చేశారు. ఒక వ్యక్తి చేసిన దుర్మార్గానికి రాష్ట్రాన్ని దారిలో పెట్టడానికి మూడేళ్లు పడుతుందని సెలవిచ్చారు. ఇంతకీ జగన్ టైమ్‌లో జరిగిన దుర్మార్గం ఏమిటో మాత్రం చెప్పరు. అప్పుడు జరిగిన విధ్వంసం ఏమిటో వివరించలేరు. జగన్ రెండేళ్ల కరోనా సంక్షోభ ఉన్నప్పటికీ, ఐదేళ్లలో చేసిన అప్పు మూడున్నర లక్షల కోట్లు అయితే, రెండేళ్లలోనే అంత చంద్రబాబు సర్కార్ ఎలా చేసిందని ఎవరు అడిగినా జవాబు ఇవ్వరు. పైగా జగన్ ప్రభుత్వం పది లక్షల కోట్ల అప్పు చేసిందని పచ్చి అబద్ధాన్ని చెప్పడం ఆయన వయసుకు తగినదేనా?

జగన్ కంటే ఎక్కువ సంక్షేమ స్కీమ్‌లు అమలు చేస్తామని చెప్పారా? లేదా? మరి ఎందుకు అమలు చేయడం లేదు? ఏకకాలంలో లక్షన్నర ఉద్యోగాలు ఇచ్చిన జగన్ నిరుద్యోగులకు అన్యాయం చేశారట. రెండున్నర లక్షలమంది వలంటీర్లను నియమించి అటు ప్రజలకు సేవలు, ఇటువారికి స్థానికంగా ఉపాది కల్పించిన జగనేమో ఏమీ చేయలేదట. వలంటీర్లకు ఐదువేలు కాదు.. పదివేలు ఇస్తానని హామీ ఇచ్చి మొత్తానికి మంగళం పలికిన ఆయన పాలనేమో గొప్పదట. సచివాలయ ఉద్యోగులపై రకరకాల భారాలు పెడుతూ వారిని వేధిస్తున్న సంగతి అంతా గమనిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులను విపక్షంలో ఉన్నప్పుడు రెచ్చగొట్టి, ఆకాశమే హద్దుగా వాగ్ధానాలు చేసి, పవర్ చేతికి వచ్చాక వాటన్నిటిని గాలికి వదలివేసిన దానిపై ప్రభుత్వ ఉద్యోగులు నోరు విప్పుతున్నారు. మరి అందుకు జవాబు ఏది?

వైసీపీవారిపై ఏది పడితే మాట్లాడతారు. గంజాయి బాచ్ అంటారు. తీరా చూస్తే ఆయన పార్టీ ఎంపీ పుట్టా మహేశ్ యాదవ్ డ్రగ్ కేసులో పట్టుబడిన సంగతి మాత్రం కనుమరుగు చేయాలని చూస్తారు. ఇది రైతు ప్రభుత్వం అని చెబుతారు. కాని అన్నదాత సుఖీభవ కింద ఎంత ఇస్తామని చెప్పారు? ఎంత ఇచ్చారు. అసలు ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరం ఎన్ని స్కీములను ఎగవేసింది ప్రజలకు తెలియదా? మాట్లాడితే గొడ్లలి పార్టీ అని అంటే సరిపోతుందా? ప్రజలకు కడుపు నిండుతుందా? హామీల బాండ్ల గురించి జనం మర్చిపోతారా?

జగన్ 17 మెడికల్ కాలేజీలు ప్రభుత్వరంగంలో తీసుకువస్తే, వాటిని ప్రైవేటీకరించడమే లక్ష్యంగా చంద్రబాబు పెట్టుకున్నారు. దానిని కదా విధ్వంసం అనాల్సింది. నాలుగు పోర్టులను జగన్ టైమ్‌లో నిర్మించే కృషి ఆరంభించారు. వాటిని ప్రైవేటురంగానికి అప్పగించడానికి ఆలోచన చేస్తున్నారు. దానిని కదా ప్రజల సంపదను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేడం అనేది. ఆర్టీసీని నీరుకార్చి ప్రైవేటురంగానికి ఆస్తిగా మార్చుతున్నారన్న అభిప్రాయం కార్మికులలో ఏర్పడింది. దానిని కదా దోపిడీ అనాల్సింది. అమ్మకానికి మున్సిపల్ ఆస్తులు, పట్టణ సేవలన్నిటిని ప్రైవేటీకరించడం, తద్వారా ప్రజలపై విపరీత భారం వేసే యోచనను కదా ప్రజా వ్యతిరేక పాలన అని అనాల్సింది. బీచ్‌లలో బార్లు, మద్యం షాపులను ఏర్పాటు చేయడాన్ని కదా వినాశన విధానాలు అని అనాల్సింది.

మద్యం విచ్చలవిడిగా పారిస్తూ ఆంధ్ర సమాజాన్ని పాడు చేస్తున్న ప్రభుత్వంగా చంద్రబాబు సర్కార్ రికార్డు సృష్టిస్తోంది. ఎమ్మెల్యేలు సరిగా పనిచేయడం లేదని చంద్రబాబే చెబుతారు. అధికారులు ఆశించిన రీతిలో స్పందించలేదని ఆయనే అంటారు. అయినా ప్రభుత్వం బ్రహ్మాండం అని జనానికి చెబితే ఎలా నమ్మాలి. అంతెందుకు కుప్పంలో జరుగుతున్న అక్రమాలపై వస్తున్న ఫిర్యాదులపై ఆయనే భయపడిపోయి, తాను ఇన్‌చార్జీగా పెట్టిన వ్యక్తినే మార్చేసుకున్నారే! ఈ నేపథ్యంలోనే సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఈ రెండేళ్లలో కూటమి పాలన గాడితప్పిందని అన్నారు. ఏమి సాధించారని ప్రజలలోకి వెళతారని, స్వర్ణాంధ్ర కాదు.. విషాదాంధ్రగా మార్చారని ధ్వజమెత్తారు.

ఇక గొడ్డలి అంటూ చంద్రబాబు చేసే అర్థం, పర్ధం లేని వాఖ్యలను వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి తిప్పికొట్టారు. జగన్ హీరో, చంద్రబాబు విలన్ అని, అందుకే రాజకీయంగా చంద్రబాబు పాలనను అంతం చేసే గొడ్డలి జగన్ చేతిలో ఉందని ఆయన భయపడుతున్నారని సజ్జల బదులిచ్చారు. పరశురాముడి గొడ్డలి అన్యాయం, అక్రమాలపై వేటు వేసిందని, అలాగే చంద్రబాబు అరాచక పాలనను అంతం చేయడమే తమ పార్టీ లక్ష్యం అని ఆయన అన్నారు. ఏది ఏమైనా చంద్రబాబు తాను ఇచ్చిన హామీల మేరకు ఏమి పూర్తి చేసింది చెబితే ఉపయోగం తప్ప, గొడ్డలి, విధ్వంసం అంటూ పిచ్చి డైలాగులు చెబితే తమకు ఏమి లాభం అని ప్రజలు భావించే పరిస్థితి ఏర్పడిందన్న అభిప్రాయం కలుగుతుంది.


- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)