11 వ రోజుకు చేరిన యుద్ధం.. అమెరికా మిత్ర పక్షాలపై ఇరాన్ దాడులు
Breaking News
భాగ్యనగరంలో భలే జోరు
Published on Wed, 03/11/2026 - 00:34
వేసవి మొదలైపోయింది. ఎండలు కూడా అప్పుడే మండుతున్నాయ్. అయినా ఏమాత్రం లెక్క చేయకుండా షూటింగ్‌లతో బిబీ బిజీగా ఉంటున్నారు నటీనటులు. కొన్ని సినిమాలు ఇండోర్‌లో (స్టూడియోల్లో) షూటింగ్స్ జరుపుకుంటుండగా... మరికొన్ని మూవీస్ షూటింగ్స్ కోసం హైదరాబాద్ సమీపంలోని పలు ప్రాంతాల్లో ప్రత్యేకమైన సెట్స్ వేసి చిత్రీకరణలు జరుపుతున్నారు మేకర్స్.
ప్రస్తుతం భాగ్యనగరంతో (హైదరాబాద్) పాటు పరిసర ప్రాంతాల్లో సినిమా షూటింగ్‌లు భలే జోరుగా సాగుతున్నాయి. నాగార్జున, వెంకటేశ్, రవితేజ, ప్రభాస్, రామ్‌చరణ్, నాని, గోపీచంద్, శర్వానంద్, అఖిల్ వంటి పలువురు హీరోలు హైదరాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో తమ సినిమాల షూటింగ్లో హుషారుగా పాల్గొంటున్నారు. ఆ విశేషాలేంటో చూద్దాం...
మూసరంబాగ్లో...
నాగార్జున కెరీర్లో వందో చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఆయన ప్రయాణంలో ఓ మైలురాయిగా నిలవనున్న ఈ సినిమాని తమిళ దర్శకుడు కార్తీక్ తెరకెక్కిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్‌పై నాగార్జున భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్, యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతోన్న ఈ సినిమాకు ‘కింగ్ 100, కింగ్ 100 నాటౌట్’ వంటి టైటిల్స్‌ను మేకర్స్ పరిశీలిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇటీవల కర్నాటకలోని మైసూర్ షెడ్యూల్‌ని పూర్తి చేసుకుని హైదరాబాద్ తిరిగొచ్చింది యూనిట్.
ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్‌లోని మూసరాంబాగ్లో జరుగుతోంది. నాగార్జునపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు కార్తీక్. నాగార్జున కెరీర్లో ఓ మైలురాయిగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని అన్ని వాణిజ్య అంశాలతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారట దర్శకుడు. ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు ఉంటారని తెలుస్తోంది. కాగా ఈ మూవీలో సీనియర్ నటి టబు–నాగార్జున కలిసి నటిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో నాగార్జున తనయులు నాగచైతన్య, అఖిల్ అతిథి పాత్రల్లో మెరవనున్నారని టాక్. అక్కినేని నాగేశ్వర రావు, నాగార్జున, నాగచైతన్య, అఖిల్ (గెస్ట్ అప్పీయరెన్స్) కలిసి ‘మనం’ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. మరోసారి తండ్రీ కొడుకులు స్క్రీన్ షేర్ చేసుకోనున్నారనే వార్తలతో అక్కినేని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ వార్తలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. నాగార్జున నటిస్తున్న ఈ వందో చిత్రంపై ఇండస్ట్రీ వర్గాల్లో, ప్రేక్షకుల్లో, అక్కినేని అభిమానుల్లో చాలా ఆసక్తి నెలకొంది.
అన్నపూర్ణలో...
‘సంక్రాంతికి వస్తున్నాం’ (2025) వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత వెంకటేశ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం. 47’. ఈ మూవీకి త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నారు. హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతోంది. వెంకటేశ్‌తో పాటు ఇతర ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారట.
వెంకటేశ్ ఇమేజ్‌కి తగ్గట్టు అద్భుతమైన కుటుంబ కథాంశం నేపథ్యంలో ఈ మూవీని రూపొందిస్తున్నారని తెలిసింది. ‘కేజీఎఫ్’ మూవీ ఫేమ్ శ్రీనిధీ శెట్టి హీరోయిన్గా నటిస్తున్నారు. అక్టోబరులో సినిమాని విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. ఈ చిత్రానికి ‘యానిమల్’ మూవీ ఫేమ్ హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత వెంకటేశ్ నటిస్తున్న ఈ సినిమాపై ఇండస్ట్రీలో, ప్రేక్షకుల్లో ఫుల్ క్రేజ్ నెలకొంది.
శంకర్‌పల్లిలో ఇరుముడి...
వరుస సినిమాలతో బిజీగా దూసుకెళుతున్నారు రవితేజ. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఇరుముడి’. ఈ సినిమాకి శివ నిర్వాణ దర్శకుడు. ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటిస్తుండగా, రవితేజ కుమార్తె పాత్రను బేబీ నక్షత్ర పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం శంకర్‌పల్లిలో జరుపుకుంటోంది.
ఆధ్యాత్మిక ప్రాముఖ్యత నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమాలో అయ్యప్ప మాలధారిగా కనిపించనున్నారు రవితేజ. దర్శకుడు శివ నిర్వాణ పవర్ఫుల్ స్క్రిప్ట్‌ను రూపొందించారట. ‘‘రవితేజ మునుపెన్నడూ చేయని భిన్నమైన పాత్రని ‘ఇరుముడి’లో చేస్తున్నారు. ఈ సినిమా కోసం ఆయన పూర్తిగా మేకోవర్ అయ్యారు. ఇందులో తండ్రీకూతుళ్ల మధ్య వచ్చే బలమైన భావోద్వేగాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి’’ అని యూనిట్ పేర్కొంది. ఈ మూవీకి సంగీతం: జీవీ ప్రకాశ్‌కుమార్.
ఆర్ఎఫ్సీలో...
వరుస పాన్ ఇండియన్ సినిమాలతో దూసుకెళుతున్న ప్రభాస్ హీరోగా రూపొందుతోన్న తాజా చిత్రం ‘ఫౌజీ’. హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఇమాన్వీ హీరోయిన్. జయప్రద, అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, భాను చందర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. టి–సిరీస్ గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు.
పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ‘ఫౌజీ’ షూటింగ్ ప్రస్తుతం ఆర్ఎఫ్సీలో జరుగుతోంది. ఈ తాజా షెడ్యూల్లో ప్రభాస్ పాల్గొంటున్నారట. ఆయనపై ముఖ్య సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని తెలిసింది. ప్రభాస్‌ని ఇంతకు ముందు ఎప్పుడూ చూడని పవర్ఫుల్ పాత్రలో చూపించనున్నారట హను రాఘవపూడి. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ భాషల్లో దసరా పండగకి ‘ఫౌజీ’ని గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఈ సినిమాకి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు.
శంకర్‌పల్లిలో కల్కి...
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్, దీపికా పదుకోన్, దిశా పటానీ ఇతర పాత్రలు పోషించారు. వైజయంతీ మూవీస్‌పై సి. అశ్వినీదత్ నిర్మించిన ఈ సినిమా 2024 జూన్ 27న విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ మూవీకి సీక్వెల్‌గా ‘కల్కి 2898 ఏడీ 2’ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ సమీపంలోని శంకర్‌పల్లిలో జరుగుతోంది.
‘కల్కి 2898 ఏడీ’లో అశ్వద్ధామ పాత్రలో నటించిన అమితాబ్ బచ్చన్, సుప్రీమ్ యాస్కిన్ పాత్ర చేసిన కమల్‌హాసన్ ఈ షెడ్యూల్లో పాల్గొంటున్నారు. తొలి భాగంలో అమితాబ్, కమల్‌కి ఎలాంటి కాంబినేషన్ సీన్స్ లేవు. కానీ, ‘కల్కి 2898 ఏడీ 2’లో మాత్రం వీరిద్దరి కాంబినేషన్లో వచ్చే సన్నివేశాలు చాలా కీలకం అట. ఈ నేపథ్యంలోనే శంకర్‌పల్లిలో వేసిన ప్రత్యేక సెట్లో ప్రస్తుతం అమితాబ్, కమల్ కలయికలో వచ్చే సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారట.
అజీజ్ నగర్లో...
రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న తాజా పాన్ ఇండియన్ ఫిల్మ్ ‘పెద్ది’. బుచ్చిబాబు సానా ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రామ్‌చరణ్‌కి జోడీగా జాన్వీ కపూర్ నటిస్తున్నారు. ఈ మూవీలో జగపతిబాబు, శివ రాజ్‌కుమార్, దివ్యేందు శర్మ, బొమన్ ఇరానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. విలేజ్ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతోన్న ఈ సినిమా తాజా షెడ్యూల్ రెండు చోట్ల జరుగుతోంది.
హైదరాబాద్‌లో సమీపంలోని అజీజ్ నగర్లో, అదే విధంగా గచ్చిబౌలి సమీపంలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో రెండు యూనిట్లతో ఈ మూవీ షూటింగ్ జరుపుతున్నారు మేకర్స్. అజీజ్ నగర్లో రామ్‌చరణ్‌పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. అదే విధంగా అల్యూమినియం ఫ్యాక్టరీలో సినిమాలోని ముఖ్య తారాగణంపైనా పలు సీన్స్ తీస్తున్నారట. మార్చి 27న రామ్‌చరణ్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమాని విడుదల చేయనున్నట్లు యూనిట్ తొలుత ప్రకటించింది. అయితే ఆ తేదీకి వాయిదా పడి ఏప్రిల్ 30కి ఫిక్స్ అయింది. ఈ మూవీకి సంగీతం: ఏఆర్ రెహమాన్.
ముచ్చింతల్‌లో...
నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘దసరా’. ఈ మూవీని ఎస్ఎల్వీ సినిమాస్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. 2023 మార్చి 30న విడుదలైన ఈ మూవీ బ్లాక్‌బస్టర్ అందుకుంది. ‘దసరా’ వంటి హిట్ మూవీ తర్వాత హీరో నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల, నిర్మాత సుధాకర్ చెరుకూరి కాంబినేషన్లో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘ది ప్యారడైజ్’. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ మూవీలో మంచు మోహన్‌బాబు, రాఘవ్ జుయల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్‌లో జరుగుతోంది.
ఈ షెడ్యూల్లో నానీతో పాటు చిత్రంలోని ప్రధాన తారాగణం పాల్గొంటోంది. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రంలో జడల్ అనే మాస్ పాత్రలో నాని కనిపించనున్నారు. ఈ సినిమాని తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ, ఇంగ్లిష్, స్పానిష్ భాషల్లో ఈ నెల 26న విడుదల చేయనున్నట్లు యూనిట్ తొలుత ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే రిలీజ్ పోస్ట్‌పోన్ అయింది. ఫైనల్‌గా ఆగస్టు 21న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రానికి సంగీతం: అనిరుధ్.
అజీజ్ నగర్లో...
గోపీచంద్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘గోపీచంద్ 33’ (వర్కింగ్ టైటిల్). సంకల్ప్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో రీతూ వర్మ హీరోయిన్గా నటిస్తున్నారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. హిస్టారికల్ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్ సమీపంలోని అజీజ్ నగర్లో జరుగుతోంది. ఈ షెడ్యూల్లో గోపీచంద్, రీతూ వర్మ, ఇతర నటీనటులపై ముఖ్య సన్నివేశాలను చిత్రీకస్తున్నారట. ‘‘హిస్టారికల్ నేపథ్యంలో భారీ స్థాయిలో రూపొందుతోన్న చిత్రం ‘గోపీచంద్ 33’.
ఈ సినిమాలో గోపీచంద్ ఇప్పటివరకు చేయని సరికొత్త పాత్రలో కనిపించబోతున్నారు. ఈ క్యారెక్టర్ కోసం ఆయన పూర్తిగా మేకోవర్ అయ్యారు. గోపీచంద్ కెరీర్లోనే అత్యంత భారీ చిత్రాల్లో ఒకటిగా ఈ మూవీ రూపొందుతోంది. ఈ సినిమాలో సత్యవతిగా రీతూ వర్మ అద్భుతంగా నటిస్తున్నారు. భారత చరిత్రలో వెలుగులోకి రాని ఒక శక్తివంతమైన అధ్యాయాన్ని ఈ మూవీ ద్వారా ఆవిష్కరించబోతున్నారు సంకల్ప్ రెడ్డి. ఈ చిత్రం విజువల్ వండర్‌గా ఉంటుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. మరోవైపు పోస్ట్ ప్రోడక్షన్ పనులు కూడా కొనసాగుతున్నాయి’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ మూవీకి అనుదీప్ దేవ్ సంగీతం అందిస్తున్నారు.
అన్నపూర్ణలో లెనిన్...
అఖిల్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘లెనిన్’. ‘వినరో భాగ్యము విష్ణుకథ’ చిత్ర దర్శకుడు మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్ప్రైజెస్ ఎల్ఎల్పీ, సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై నాగార్జున, నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ 7ఎకర్స్ స్టూడియోలో చిత్రీకరణ జరుగుతోంది.
అఖిల్, భాగ్యశ్రీ బోర్సేలతో పాటు చిత్రంలోని ప్రధాన తారగణంపై ముఖ్యమైన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారట మురళీ కిశోర్. రాయలసీమ నేపథ్యంలో సాగే రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రం కోసం పొడవాటి జుట్టు, గెడ్డంతో ఫుల్ మాస్ లుక్‌లోకి మారిపోయారు అఖిల్. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్‌కి మంచి స్పందన వచ్చింది. అదే విధంగా ఎస్ఎస్ తమన్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ‘వారెవా వారెవా...’ అంటూ సాగే లిరికల్ సాంగ్‌ను విడుదల చేయగా మంచి రెస్పాన్స్ దక్కింది. చిత్రీకరణ చివరి దశకు చేరుకున్న ‘లెనిన్’ ఈ వేసవిలో విడుదల కానుంది.
ముచ్చింతల్‌లో భోగి
శర్వానంద్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘భోగి’. ‘ఎ బ్లడ్ ఫెస్ట్’ అన్నది ట్యాగ్‌లైన్. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో డింపుల్ హయతి, అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌పై కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. హై ఓల్టేజ్ పీడియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ‘భోగి’ షూటింగ్ ప్రస్తుతం శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్‌లో జరుగుతోంది. ఈ షెడ్యూల్లో శర్వానంద్‌పై ముఖ్యమైన సన్నివేశాలను రూపొందిస్తున్నారట సంపత్ నంది.
ఫిబ్రవరి 6న శర్వానంద్ బర్త్‌డే సందర్భంగా ‘భోగి’ నుంచి విడుదల చేసిన ఆయన బర్త్ డే పోస్టర్‌కి మంచి స్పందన వచ్చింది. ‘‘భారీ పాన్–ఇండియన్ పీరియాడిక్ మూవీగా ‘భోగి’ని రూపొందిస్తున్నాం. 1960లో ఉత్తర తెలంగాణ–మహారాష్ట్ర ప్రాంతం నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతోంది. ఈ చిత్రం శర్వానంద్ కెరీర్లో ప్రతిష్టాత్మకమైన వెంచర్లలో ఒకటిగా ఉంటుంది. ఈ చిత్రంలో శర్వానంద్ ఇప్పటివరకు కనిపించని రస్టిక్, ఇంటెన్స్ పాత్రలో కనిపించనున్నారు. ఆగస్టు 28న రక్షా బంధన్ సందర్భంగా ఈ సినిమాని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్ సిసిరోలియో.
తుక్కుగూడలో...
‘విరూపాక్ష’, ‘బ్రో’ వంటి హిట్ సినిమాల తర్వాత సాయిదుర్గా తేజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఎస్వైజీ’ (సంబరాల ఏటిగట్టు). ఈ సినిమా ద్వారా రోహిత్ కేపీ దర్శకునిగా పరిచయమవుతున్నారు. ఈ సినిమాలో ఐశ్వర్యా లక్ష్మి హీరోయిన్గా నటిస్తున్నారు. ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్పై ‘హను–మాన్’ (2024) వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తెరకెక్కించిన కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ సినిమా నిర్మిస్తున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ సమీపంలోని తుక్కుగూడలో జరుగుతోంది. ఈ చిత్రం కోసం ప్రత్యేకంగా తీర్చిదిద్దిన సెట్లో సాయిదుర్గా తేజ్‌తో పాటు ప్రధాన తారాగణంపై ముఖ్యమైన సీన్స్ తీస్తున్నారు రోహిత్. ఈ సినిమా 2025 సెప్టెంబరు 25న తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కావాల్సి ఉన్నప్పటికీ వాయిదా పడింది. అయితే కొత్త రిలీజ్ డేట్‌ని మాత్రం మేకర్స్ ప్రకటించ లేదు.
పైన పేర్కొన్నటువంటి సినిమాలే కాదు. మరికొన్ని సినిమాలు కూడా హైదరాబాద్‌లో, పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటున్నాయి. – డేరంగుల జగన్ మోహన్
Tags : 1