ఏపీలో రోడ్లు అధ్వానం టీడీపీ ఎమ్మెల్యే బాబుకు షాక్
Breaking News
కృత్రిమ మేధ భవిష్యత్తుకు భారత్ దిక్సూచి
Published on Thu, 02/19/2026 - 14:57
ప్రపంచ కృత్రిమ మేధ (ఏఐ) ముఖచిత్రంలో భారత్ కేవలం వినియోగదారు మాత్రమే కాదని, రాబోయే కాలంలో ఏఐ భవిష్యత్తును శాసించే ప్రధాన శక్తిగా అవతరించబోతోందని ఆంత్రోపిక్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ డారియో అమోదే ఆశాభావం వ్యక్తం చేశారు. గురువారం న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో జరిగిన ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్’లో పాల్గొన్న ఆయన భారత్‌లోని సాంకేతిక నైపుణ్యం, ఏఐ రంగంలో దేశం చూపిస్తున్న వేగాన్ని ప్రశంసించారు. అమెరికా వెలుపల ఆంత్రోపిక్ తన ఉనికిని వేగంగా విస్తరిస్తున్న తరుణంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
భారత్ - ఆంత్రోపిక్.. వ్యూహాత్మక భాగస్వామ్యం
టోక్యో తర్వాత ఆసియాలోనే రెండో కార్యాలయాన్ని బెంగళూరులో ప్రారంభించిన కొద్ది రోజులకే అమోదే ఈ సదస్సులో ప్రసంగించారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆంత్రోపిక్ క్లాడ్ ఏఐ వినియోగంలో 5.8% వాటాతో భారత్ రెండో అతిపెద్ద మార్కెట్‌గా ఉంది. టెక్ రంగ నిపుణురాలు ఇరినా ఘోష్‌ను ఆంత్రోపిక్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమించింది. ఇన్ఫోసిస్ వంటి దిగ్గజ సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఎక్స్-స్టెప్ ఫౌండేషన్, ప్రథమ్, సెంట్రల్ స్క్వేర్ ఫౌండేషన్ వంటి స్వచ్ఛంద సంస్థలతో కలిసి విద్య, వ్యవసాయం, ఆరోగ్య రంగాల్లో ఏఐ వినియోగంపై దృష్టి సారించింది.
అపార అవకాశాలు
2023 బ్లెచ్లీ పార్క్ సమ్మిట్ నుంచి ఏఐ సాధించిన పురోగతి అద్భుతమని అమోదే అన్నారు. ఏఐ సామర్థ్యం గురించి వివరిస్తూ ‘మనం డేటా సెంటర్లను ఏర్పాటు చేసే దిశగా ఉన్నాం. ఇవి మానవాతీత వేగంతో పనిచేయగల ఏఐ ఏజెంట్లు. వేల ఏళ్లుగా పీడిస్తున్న వ్యాధులను నయం చేయగలవు. కోట్ల మందిని పేదరికం నుంచి విముక్తులను చేయగలవు. ఎన్నో అవకాశాలు సృష్టించగలవు’ అన్నారు.
సామర్థ్యంతో పాటు ఏఐ వల్ల కలిగే ప్రమాదాలను కూడా అమోదే స్పష్టం చేశారు. స్వయంప్రతిపత్తిలోని పరివర్తన, ఉద్యోగాల కోత, సాంకేతిక దుర్వినియోగం వంటి సవాళ్లను ఎదుర్కోవడంలో భారత్ నాయకత్వం వహించాలని ఆయన కోరారు.
అమోదే ప్రసంగంలోని ముఖ్యాంశాలు
భారత్‌లో అభివృద్ధి చేసే ఏఐ నమూనాలు ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఆదర్శంగా నిలుస్తాయి.
భారతీయ భాషల్లో ఏఐ మోడళ్లను పరీక్షించేందుకు స్థానిక సంస్థలతో ఆంత్రోపిక్ సహకరిస్తోంది.
ప్రపంచ ఏఐ భద్రతా ప్రమాణాలను రూపొందించడంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారత్ పాత్ర కీలకం.
ఏఐ వల్ల ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతుంది. అయితే ఆటోమేషన్ వల్ల కలిగే సామాజిక మార్పులను ప్రభుత్వం, కంపెనీలు కలిసి సమన్వయం చేసుకోవాలి.
ఇదీ చదవండి: ‘భారత్‌లో ఏఐ స్పీడ్ చూస్తే విస్మయం కలుగుతుంది’
Tags : 1