ABN రాధాకృష్ణ చిల్లర కథనాలు.. రికార్డింగ్ డాన్సులపై బాబు మౌనమేలా..?
Breaking News
మీరు యాక్టివా.. పాసివా?
Published on Mon, 01/19/2026 - 08:28
స్టాక్ మార్కెట్లపై పెద్దగా అవగాహన లేనివారు... షేర్ల గురించి ఎక్కువగా తెలియని వారు కూడా మ్యూచువల్ ఫండ్లలో ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఎందుకంటే ఏ షేర్లో ఎప్పుడు ఎంత ఇన్వెస్ట్ చేయాలో, ఎప్పుడు వెనక్కు తీసుకోవాలో అవన్నీ చూసుకోవటానికి మ్యూచువల్ ఫండ్లలో ఓ పెద్ద వ్యవస్థ ఉంటుంది. అవన్నీ చేస్తూ... ఏడాది తిరిగేసరికల్లా చక్కని రాబడినిస్తాయి కనక మ్యూచువల్ ఫండ్లు చాలామందిని ఆకర్షిస్తుంటాయి. బ్యాంకు వడ్డీని మించి రాబడి సాధించాలన్నా... ద్రవ్యోల్బణాన్ని తట్టుకోవాలన్నా ఇదో మంచి మార్గం. సరే! మరి ఏ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయాలి? అంటే షేర్లలోను, బాండ్లలోను ఇన్వెస్ట్ చేసేయాక్టివ్ ఫండ్స్లోనా? లేక ఇండెక్స్‌లో మాత్రమే పెట్టుబడి పెట్టే పాసివ్ ఫండ్స్లోనా? ఏది బెటర్? దీన్ని వివరించేదే ఈ ‘వెల్త్ స్టోరీ’...
భారతదేశ మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ ఏకంగా రూ.81 లక్షల కోట్లకు చేరిందిపుడు, ఒకరకంగా ఇది రికార్డు స్థాయి. ఇందులో పాసివ్ ఫండ్స్ విలువ దాదాపు రూ.14 లక్షల కోట్లు. మిగిలిన విలువ యాక్టివ్ ఫండ్స్‌ది. అసలు మనదేశంలో ఇండెక్స్‌లో మాత్రమే ఇన్వెస్ట్ చేసే పాసివ్ ఫండ్ల విలువ రూ.14 లక్షల కోట్లకు చేరుతుందని ఎవరైనా ఊహించారా? మున్ముందు ఇది ఇంకా పెరుగుతుందనేది నిపుణుల మాట. దీంతో పాసివ్ ఫండ్లు మంచివా... లేక యాక్టివ్ ఫండ్సా అనే చర్చ మళ్లీ జోరందుకుంది. నైపుణ్యం, అనుభవం ఉన్న ఫండ్ మేనేజర్లు మాత్రమే, నిరంతరం మార్కెట్‌ని మించి రాబడులు అందించగలరనే భావన కొన్నాళ్ల కిందటిదాకా ఉండేది. కానీ, ఇపుడు చాలా మంది ఇన్వెస్టర్లు క్రమంగా ఖర్చులను ఆదా చేసే, సరళంగా ఉండే, దీర్ఘకాలికంగా విశ్వసనీయంగా ఉండే పాసివ్ విధానంవైపు మళ్లుతున్నారు. ఈ రెండింట్లో ఉండే సానుకూల, ప్రతికూలాంశాలు చూస్తే...
ఇండెక్స్ వర్సెస్ యాక్టివ్ ఫండ్స్..
ఇండెక్స్ ఫండ్స్ అంటే, సెన్సెక్స్, నిఫ్టీ50, నిఫ్టీ– 500 లాంటి నిర్దిష్ట మార్కెట్ సూచీని ప్రతిబింబించేవి పాసివ్ ఫండ్స్. ఇవి ఆ సూచీలోని స్టాక్స్‌లో, అదే పరిమాణంలో ఇన్వెస్ట్ చేస్తాయి. ప్రత్యేకంగా షేర్లను ఎంచుకోవడం, మంచి సమయం కోసం వేచి ఉండటంలాంటిది ఉండదు. ఈ తరహా ఫండ్స్‌లో ఖర్చులు చాలా తక్కువ. దాదాపు సదరు ఇండెక్స్ స్థాయిలో పనితీరు కనపరుస్తాయి (కొంత వ్యయాలు పోగా).
అదే యాక్టివ్ ఫండ్స్‌ని తీసుకుంటే బెంచ్‌మార్క్‌కి మించిన రాబడులను అందించేలా వీటిని ప్రొఫెషనల్స్ నిర్వహిస్తుంటారు. ఇందుకోసం అధ్యయనం, షేర్ల ఎంపిక, వ్యూహాత్మకంగా సర్దుబాట్లు చేయడంలాంటి హడావిడి ఉంటుంది. ఈ తరహా ఫండ్లు ప్రామాణిక సూచీలకు మించిన పనితీరు సాధించే అవకాశం ఉంటుంది. వీటిల్లో పరిశోధనలు, ట్రేడింగ్ యాక్టివిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే, ఖర్చుల నిష్పత్తి కూడా ఎక్కువే.
ఏవి ఎలా ఉంటాయ్..
ఇండెక్స్ ఫండ్స్ పూర్తి పారదర్శకంగా ఉంటాయి. ఏదో ఒక్క మేనేజరు మీదే ఆధారపడాల్సిన పరిస్థితి ఉండదు. మార్కెట్ హెచ్చుతగ్గులపరమైన ప్రభావమే తప్ప నిర్దిష్ట స్టాక్పరమైన ప్రతికూల ప్రభావం ఉండదు. మరోవైపు, యాక్టివ్ ఫండ్స్ విషయానికొస్తే ఇవి నిర్దిష్ట సాధనాల్లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేయడం వల్ల, తీవ్ర ఒడిదుడుకులు ఏర్పడితే పెట్టుబడిపైనా తీవ్ర ప్రభావం పడుతుంది. తప్పుడు నిర్ణయాలు తీసుకున్న పక్షంలో ఫండ్ పనితీరు దెబ్బతినే అవకాశాలూ ఉంటాయి.
వాస్తవ పరిస్థితి
ఆర్థిక సమాచార సేవల సంస్థ ఎస్ అండ్ పీకి చెందిన ఎస్పీఐవీఏ ఇండియా నివేదిక ప్రకారం (2025 మధ్య, అంతకు ముందు ట్రెండ్స్) దాదాపు 65–66 శాతం లార్జ్ క్యాప్ యాక్టివ్ ఫండ్స్, 2025లో తమ తమ బెంచ్‌మార్క్ సూచీలకన్నా తక్కువ రాబడులను అందించాయి. దీర్ఘకాలికంగా అంటే పదేళ్ల పైగా వ్యవధిలో చూస్తే సుమారు 80 శాతం మిడ్, స్మాల్ క్యాప్ యాక్టివ్ ఫండ్స్ వెనుకబడ్డాయి. అయితే, కొన్ని యాక్టివ్ ఫండ్లు తీవ్ర హెచ్చుతగ్గుల మార్కెట్లలో కూడా రాణించగలిగే విధంగా ఉంటాయి. మరోవైపు, పాసివ్ ఫండ్స్ అనేవి కొంత రిస్కు తక్కువ వ్యవహారంగా విశ్వసనీయమైన స్థాయిలో రాబడులు అందించేందుకు అవకాశం ఉంది.
ఎవరికి .. ఏవి అనువు..
ఇండెక్స్ ఫండ్స్: తొలిసారి ఇన్వెస్ట్ చేస్తున్నవారు, దీర్ఘకాలిక సిప్ ఇన్వెస్టర్లు, రిటైర్మెంట్ ప్రణాళికల్లో ఉన్నవారు. పెట్టుబడుల ప్రక్రియ సరళంగా ఉండాలనుకునేవారు. ప్రతి రోజూ మార్కెట్లను, పెట్టుబడులను చూస్తూ కూర్చోవడానికి ఇష్టపడని వారు.
యాక్టివ్ ఫండ్స్: పనితీరును సమీక్షించుకోవడానికి ఇష్టపడే అనుభవజ్ఞులైన ఇన్వెస్టర్లు, నిర్దిష్ట రంగాలు/థీమ్‌ల్లో పెట్టుబడుల ద్వారా భారీ లాభాలను కోరుకునేవారు.
ఖర్చులు కీలకం..
ఇండెక్స్ ఫండ్స్‌కి సంబంధించిన పెద్ద సానుకూల అంశం ఖర్చులు తక్కువగా ఉండటం. డైరెక్ట్ ప్లాన్లయితే సాధారణంగా 0.1 శాతం నుంచి 0.3 శాతం వరకు ఉంటాయి. మరోవైపు, యాక్టివ్ ఫండ్లు సాధారణంగా 1.5 – 2.5 శాతం శ్రేణిలో చార్జీలు విధిస్తాయి. కాలక్రమేణా ఈ చార్జీలన్ని కలిపితే తడిసి మోపెడవుతుంది. దీర్ఘకాలంలో ఇదొక సైలెంట్ వెల్త్ కిల్లర్లాంటిది. 20–25 ఏళ్ల వ్యవధిలో చూస్తే ఆఖర్లో ఈ వ్యయాల భారం పెట్టుబడి, నిధిని బట్టి లక్షలు, కోట్లల్లోనూ ఉంటుంది. ఆ మేరకు రాబడీ తగ్గుతుంది.
హైబ్రిడ్ వ్యూహంతో మేలు..
చాలా మంది నిపుణులు ప్రస్తుతం పెట్టుబడులకు సంబంధించి హైబ్రిడ్ వ్యూహమైన ‘కోర్–శాటిలైట్’ విధానాన్ని సూచిస్తున్నారు. అంటే 60–70 శాతం మొత్తాన్ని (కోర్) తక్కువ వ్యయాలతో కూడుకుని ఉండే ఇండెక్స్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు. వీటి నిర్వహణ వ్యయాలు తక్కువగా ఉంటాయి, పోర్ట్‌ఫోలియోకి స్థిరత్వం లభిస్తుంది. ఇక 30–40 శాతం మొత్తాన్ని అనుబంధంగా (శాటిలైట్), అధిక లాభాలను ఆర్జించి పెట్టే అవకాశమున్న నిర్దిష్ట యాక్టివ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు.
అయితే, ఇక్కడో విషయం గుర్తుంచుకోవాలి. అందరికీ ఒకే రకం పెట్టుబడి వ్యూహం ఉపయోగపడకపోవచ్చు. ఇండెక్స్ ఫండ్లతో ఖర్చులు ఆదా అవుతాయి. రాబడులు కాస్త అంచనాలకు అందే విధంగా ఉంటాయి. దీర్ఘకాలికంగా కాంపౌండింగ్ ప్రయోజనాలు దక్కుతాయి. ముఖ్యంగా నిలకడగా మార్కెట్‌ని మించి రాబడులను సాధించడం కష్టంగా ఉండే లార్జ్–క్యాప్ సెగ్మెంట్‌కి సంబంధించి ఇవి అనువైనవిగా ఉంటాయి. యాక్టివ్ ఫండ్స్ అనేవి అధిక రాబడుల ఆశలు కలి్పస్తాయి, కానీ ఫీజులు, రిసు్కలు అధికంగా ఉంటాయి. ఏదైతేనేం.. వీలైనంత ముందుగా పెట్టుబడులను ప్రారంభించాలి. యాంఫీ, ఫండ్ ఫ్యాక్ట్ షీట్లు, విశ్వసనీయమైన ప్లాట్‌ఫాంల ద్వారా ఫండ్‌ని క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. మీ రిస్క్ ప్రొఫైల్, లక్ష్యాలకు అనువుగా ఉండే దాన్ని ఎంచుకోవాలి. క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేయాలి.
ఇదీ చదవండి: డేటా పంచుకోలేం.. కోర్టును ఆశ్రయించిన గూగుల్!
Tags : 1