అడవివరంలో 20 ఎకరాలపై కన్నేసిన కబ్జాదారులు

- - Sakshi

సాక్షి, విశాఖపట్నం : అది సింహాచలం దేవస్థానానికి చెందిన అటవీ ప్రాంతం.. తాము అక్కడ నివాసముంటున్నామని పలువురు.. ప్రభుత్వ సర్వేయర్లు ఇచ్చిన రిపోర్టుతో న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అఫిడవిట్‌ చూసిన జాయింట్‌ కలెక్టర్‌ స్వయంగా పరిశీలించారు. అక్కడ నివాసం కాదు.. పూర్తి చెట్లతో నిండిన అడవి ఉందని గుర్తించారు. రూ.కోట్ల భూమిని కొట్టేసేందుకు వేసిన ఎత్తుగడకు సహకరించిన ప్రభుత్వాధికారులపై క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించారు.

అడవివరం గ్రామంలో సర్వే నెంబర్‌ 275లో 20.39 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న భూమికి సంబంధించి హద్దులు నిర్ణయించడంతో పాటు అక్కడ ఏళ్ల తరబడి నివాసం ఉంటున్న నేపథ్యంలో రెవెన్యూ రికార్డులో తమ పేరుతో మార్చేందుకు ఉత్తర్వులు ఇవ్వాలని బి.మంగతల్లితో పాటు మరో ఆరుగురు హైకోర్టులో రిట్‌పిటిషన్‌ వేశారు. పిటిషనర్‌ దరఖాస్తుపై నెల రోజుల్లో తగిన చర్యలు తీసుకోవాలని హైకోర్టు విశాఖ రూరల్‌ తహసీల్దార్‌కు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సర్వే విభాగం అధికారులు సదరు భూమికి సర్వే నిర్వహించారు.

1903 సేల్‌ ప్రకారం అడవివరం గ్రామంలో సర్వే నెంబర్‌ 275లో ఉన్న 20.39 ఎకరాల భూమి మంగతల్లి కుటుంబ సభ్యుల ఆధీనంలోనే ఉందని, వారు పొజిషన్‌లు ఉన్నారని నిర్ధారిస్తూ నివేదిక సమర్పించారు. సర్వే అధికారుల నివేదిక ఆధారంగా ఆ భూమి తమదేనని, సింహాచలం దేవస్థానం అధికారులు ఈ భూమి విషయంలో జోక్యం చేసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని మరోసారి మంగతల్లి మరో ఆరుగురు హైకోర్టులో మరో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై కోర్టు స్టాటస్‌ కో ఇచ్చింది.

సర్వే నివేదిక తప్పంటూ దేవస్థానం పిటిషన్‌
సర్వే విభాగం ఇచ్చిన నివేదికను సవాల్‌ చేస్తూ సింహాచలం దేవస్థానం అధికారులు 2021, అక్టోబర్‌ 20న రివిజన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. సదరు నివేదిక సక్రమంగా లేదని, సర్వే నెంబర్‌ 275లో మొత్తం 5,279.57 ఎకరాల భూమి దేవస్థానం పరిధిలోనే ఉందని, ఈ సర్వే నంబర్‌కు సంబంధించి ఎలాంటి సబ్‌ డివిజన్లు లేవని పిటిషన్‌లో స్పష్టం చేశారు. అదేవిధంగా ఈ విస్తీర్ణం మొత్తం 22ఏ జాబితాలో చేర్చడం జరిగిందని, ఆ భూమిలో దేవస్థానం కాంపౌండ్‌ వాల్‌ నిర్మాణం కూడా ఉందని న్యాయస్థానానికి విన్నవించారు. ఈ పిటిషన్‌పై స్పందించిన జాయింట్‌ కలెక్టర్‌ కేఎస్‌ విశ్వనాథన్‌.. జాయింట్‌ సర్వే బృందానికి, సర్వే, భూరికార్డుల శాఖ అధికారులకు నోటీసులు జారీ చేశారు. అప్పుడే సర్వే బృందం అవకతవకలు బయటపడ్డాయి.

స్వయంగా పరిశీలించిన జేసీ
2021లో సర్వే చేసిన విశాఖ రూరల్‌ మండలం అప్పటి సర్వేయర్‌, ప్రస్తుత గోపాలపట్నం సర్వేయర్‌ డి.జగదీశ్వరరావు, సింహాచలం దేవస్థానం అప్పటి సర్వేయర్‌ కె.హరీష్‌కుమార్‌, అప్పటి గోపాలపట్నం సర్వేయర్‌, ప్రస్తుతం యలమంచిలి సర్వేయర్‌ సత్యనారాయణ, డీఐవోఎస్‌ కె.వేణుగోపాల్‌ను అధికారులు విచారించి వారి స్టేట్‌మెంట్లను రికార్డు చేశారు. అదేవిధంగా ఈ ఏడాది మే 15న భీమిలి ఆర్డీఓ భాస్కర్‌రెడ్డి, సింహాచలం దేవస్థానం స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌, సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ ఏడీ, ఇతర అధికారులతో కలిసి జేసీ కేఎస్‌ విశ్వనాథన్‌ స్వయంగా ఆ భూమిని పరిశీలించి విస్తుపోయారు. పిటిషన్‌ వేసిన వారి భూ పత్రాల్లో సదరు భూమి గోపాలపట్నం మండలం మాధవధారలో ఉంది.

కానీ వారు చూపిస్తున్న భూమి, వారి డాక్యుమెంట్‌లో ఉన్న భూమికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టమైంది. దీని ప్రకారం సర్వే నెంబర్‌ 275లో ఉన్న భూమి సింహాచలం దేవస్థానం ఆధీనంలో ఉందని గుర్తించారు. ఆ భూమిలోనే పొజిషన్‌లో ఉన్నట్లు సర్వేయర్లు ఇచ్చిన నివేదిక తప్పు అని బట్టబయలైంది. ఈ కేసులో ప్రమేయం ఉన్న సర్వే ఏడీ విజయ్‌కుమార్‌, డీఐవోఎస్‌ వేణుగోపాల్‌, ముగ్గురు సర్వేయర్లపై క్రమశిక్షణ చర్యలకు జాయింట్‌ కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. ఆ భూమిని సింహాచలం దేవస్థానానికి అప్పగించినట్లు ఆయన తెలిపారు.

Read latest Visakhapatnam News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top