ఆకర్షణీయ నగరం.. విశాఖ | Sakshi
Sakshi News home page

ఆకర్షణీయ నగరం.. విశాఖ

Published Thu, Nov 9 2023 12:22 AM

మాట్లాడుతున్న కార్మెల్‌ మేయర్‌ జేమ్స్‌ బ్రెయినార్డ్‌ - Sakshi

● కార్మెల్‌ మేయర్‌ జేమ్స్‌ బ్రెయినార్డ్‌

బీచ్‌ రోడ్డు: విశాఖ అందర్నీ ఆకట్టుకునే ఆకర్షణీయ నగరమని, ఇతర దేశాలకు ఆదర్శంగా ఉందని అమెరికాలోని ఇండియానా రాష్ట్రానికి చెందిన కార్మెల్‌ నగర మేయర్‌ జేమ్స్‌ బ్రెయినార్డ్‌ కితాబునిచ్చారు. జీవీఎంసీ ఆధ్వర్యంలో ఆర్‌కే బీచ్‌లో ని కాళీమాత ఆలయం వద్ద బుధవారం ‘స్వచ్ఛత ఎకో అవార్డుల ప్రారంభోత్సవం’, ‘స్వచ్ఛ దీపావళి సిగ్నేచర్‌ క్యాంపైన్‌’ నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్‌ గొలగాని హరివెంకటకుమారితో కలిసి జేమ్స్‌ స్వచ్ఛత ఎకో–వైజాగ్‌ అవార్డు లోగో, బ్రోచర్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విశాఖ నగరం ప్రకృతి పరంగా పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోందన్నారు. జీవీఎంసీ అమలు చేస్తున్న స్వచ్ఛత ఎకో వైజాగ్‌ కార్యక్రమాలతో విశాఖకు ప్రపంచ స్థాయిలో కూడా గుర్తింపు వస్తోందన్నారు. మేయర్‌ గొలగాని మాట్లాడుతూ జీవీఎంసీ పరిధిలో ఆరోగ్యవంతమైన పోటీతత్వాన్ని పెంపొందించి స్వచ్ఛ వార్డులుగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. థర్డ్‌ పార్టీ ఏజెన్సీస్‌ ద్వారా సర్వే నిర్వహించిన అనంతరం ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన వార్డులకు వరసగా రూ.20 లక్షలు, రూ.10 లక్షలు, రూ.5 లక్షలు నగదు బహుమతులు అందిస్తామని చెప్పారు. మినిస్ట్రీ ఆఫ్‌ హౌసింగ్‌ అండ్‌ అర్బన్‌ అఫైర్స్‌ మార్గదర్శకాల ప్రకారం కాలుష్య రహితంగా, ప్లాస్టిక్‌ రహితంగా, పర్యావరణ హితమైన వస్తువులతో హరిత దీపావళిని జరుపుకోవాలన్నారు. స్వచ్ఛ దీపావళి–శుభ దీపావళి సెల్ఫీ బూత్‌లో ఫొటో తీసుకుని క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయాలన్నారు. డిప్యూటీ మేయర్‌ జియ్యాని శ్రీధర్‌, కార్పొరేటర్లు పెద్దింటి ఉషశ్రీ, రెయ్యి వెంకటరమణ, బిపిన్‌ కుమార్‌ జైన్‌, భీశెట్టి వసంత, జీవీఎంసీ అదనపు కమిషనర్‌ శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement