బిహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వండి.. లేదంటే!: కేంద్రానికి సీఎం నితీష్‌ హెచ్చరిక

If Centre Does Not Grant Special Status To Bihar At The Earliest: Nitish Kumar - Sakshi

పాట్నా: కేంద్రలోని బీజేపీ సర్కార్‌కు బిహార్‌ సీఎం నితీష్‌ కుమార్‌ హెచ్చరికలు జారీ చేశారు. బిహార్‌కు అతి త్వరలోనే ప్రత్యేక హోదా ఇవ్వాలని మరోసారి డిమాండ్‌ చేశారు. అలా జరగని నేపథ్యంలో కేంద్రంపై వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని ప్రకటించారు. 

కాగా జేడీయూ అధినేత నితీష్‌ కుమార్‌ గత కొన్నేళ్లుగా బిహార్‌కు ప్రత్యేక హోదా డిమాండ్‌ చేస్తున్నారు. తాజాగా ఈ డిమండ్‌ను మరింత ఉధృతం చేస్తామని వెల్లడించారు. హోదా విషయంలో ముందుకు సాగాలంటే ఇదే సరైన నిర్ణయమని భావిస్తున్నట్లు తెలిపారు. కేంద్రం త్వరగా బీహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వకపోతే రాష్ట్రవ్యాప్త ఉద్యమం ప్రారంభిస్తామన్నారు.  ఉద్యమంలో భాగంగా రాష్ట్రంలోని ప్రతి మూలమూలన ప్రత్యేక హోదా కోసం డిమాండ్ వినిపిస్తుందని పేర్కొన్నారు.

ఎవరైతే ప్రత్యేక హోదా డిమాండ్‌కు మద్దతు ఇవ్వరో.. వారికి రాష్ట్రం అభివృద్ధిని అడ్డుకున్న వారే అవుతారని సీఎం విమర్శించారు. కులాల ఆధారంగా రిజర్వేషన్ల పెంపు బిల్లును ఇటీవలే బిహార్‌ అసెంబ్లీ ఆమోదించిన విషయాన్ని నితీష్‌ ప్రస్తావించారు. ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో ఎస్సీ, ఎస్సీ, ఈబీసీ, ఓబీలకు ఉన్న రిజర్వేషన్లను 50 నుంచి 65 శాతానికి పెంచినట్లు తెలిపారు. రాష్ట్రంలో చేపట్టిన కులగణన ఆధారంగా మొత్తం రిజర్వేషన్లను 75 శాతానికి తీసుకువెళ్లామని వెల్లడించారు. 
చదవండి: కాంగ్రెస్ Vs బీజేపీ: చిన్న పార్టీలతోనే పెద్ద చిక్కు!

సమాజంలో ఆర్థికంగా వెనకబడిన వర్గాల కోసం తాము ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని, దీనికోసం బీహార్ వంటి పేద రాష్ట్రానికి అనేక కోట్ల రూపాయల ఖర్చు అవుతుందని తెలిపారు. వాటిని అయిదేళ్లలో ఖర్చు చేస్తామని చెప్పారు. అయితే బిహార్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తే వచ్చే రెండున్నరేళ్లలో ప్రజలకు ఆ సదుపాయాలను అందించగలుగుతామని చెప్పారు. అందుకే బీహార్‌కు తక్షణమే హోదా అవసరమని తెలిపారు.

ఇటీవల ముగిసిన శీతాకాల సమావేశాల్లో రాష్ట్ర అసెంబ్లీ, మండలిలో ఏకగ్రీవంగా ఆమోదించిన రిజర్వేషన్‌కు సంబంధించిన రెండు బిల్లులను గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ ఆమోదం కోసం పంపినట్లు నితీష్‌ తెలిపారు. రెండు బిల్లులపై గవర్నర్‌ త్వరలో సంతకం చేస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. గవర్నర్‌ ఆమోదం అనంతరం  సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం దీనిని అమలు చేస్తామని చెప్పారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top