అలిగిన కోడళ్లకు గెలవగానే శుభవార్త: కేటీఆర్‌ | BRS Leader KTR Comments On Congress Party In Moinabad Road Show Ahead Of Telangana Elections - Sakshi
Sakshi News home page

అలిగిన కోడళ్లకు గెలవగానే శుభవార్త: కేటీఆర్‌

Published Fri, Nov 17 2023 4:39 AM

BRS Leader KTR Comments On Congress Party - Sakshi

వికారాబాద్, మొయినాబాద్‌: ‘అందరికీ ఏదో ఒకటి ఇచ్చిండ్రు.. మాకే ఏమీ ఇవ్వలేదని కోడళ్లు కొంచం మా మీద అలిగిండ్రు.. గెలవగానే కోడళ్లకు శుభ వార్త చెప్తాం. తెల్ల రేషన్‌కార్డు ఉన్న కోడళ్లందరికీ నెలకు రూ.3 వేల పెన్షన్‌ ఇస్తాం. కోడళ్లకు, అత్తలకు అంతేనా అని అలగొద్దు.. అత్తలకు ఇస్తున్న పింఛన్‌ను రూ.5 వేలకు పెంచుతాం..’అని మంత్రి కేటీఆర్‌ హామీ ఇచ్చారు. ప్రచారంలో భాగంగా గురువారం ఆయన వికారాబాద్, మర్పల్లి, మొయినాబాద్‌లో రోడ్‌ షోలు నిర్వహించారు. కారు గుర్తుకు ఓటేసి కాలె యాదయ్య(చేవెళ్ల)ను, ఆనంద్‌ (వికారా బాద్‌)ను మరోసారి గెలిపించాలని కోరారు. ‘మన జుట్టు ఢిల్లీ వాని చేతికివ్వొద్దు.. ఇన్నాళ్లు పాలించింది వారే.. మళ్లీ ఒక్క చాన్స్‌ అని వస్తున్నరు.

స్వాతంత్య్రం వచ్చాక కాంగ్రెస్‌కు 11 చాన్స్‌లు ఇచ్చిండ్రు.. అప్పుడేమీ చేయని పార్టీ ఇప్పుడేం చేస్తుంది..?’అని కేటీఆర్‌ ప్రశ్నించారు. 52కిలోల బక్క కేసీఆర్‌ను కొట్టనీకి ఢిల్లీతో పాటు పక్క రాష్ట్రాల నుంచి గుంపులుగా వస్తున్నా రని ధ్వజమెత్తారు. బీజేపీ నుంచి మోదీ, అమిత్‌షాతో పాటు 15 మంది సీఎంలు, 15 మంది కేంద్ర మంత్రులు, కాంగ్రెస్‌ నుంచి పక్క రా ష్ట్రాల పెద్ద మనుషులు బయలుదేరానని తెలిపారు. అయినా ఏమీ చేయలేరని, తెలంగాణ బిడ్డ కేసీఆర్‌ సింహం లాంటోడని, సింహం సింగిల్‌గానే వస్తద ని, గుంపులు గుంపులుగా వచ్చేటోళ్లను ఏమంటా రో మీకే తెలుసంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.  

భూములు లేని పేదలకు కేసీఆర్‌ బీమా.. 
‘స్వతంత్ర భారత చరిత్రలో కేసీఆర్‌ను మించిన నేత లేడు. 75 ఏళ్ల చర్రితలో రైతుబంధు, రైతు బీమా ఇచ్చిన సీఎం, పీఎం ఎవరైనా ఉన్నారా..? రాష్ట్రంలో 46 లక్షల మందికి పింఛన్లు, 75 లక్షల మంది రైతులకు రైతుబంధు, 13.5 లక్షల మందికి కల్యాణలక్ష్మి, 15 లక్షల మందికి కేసీఆర్‌ కిట్లు ఇచ్చిన ఘనత కేసీఆర్‌ది కాదా?..’అని కేటీఆర్‌ ప్రశ్నించారు. ‘ఎన్నికలు రాగానే ఆగమాగం కావద్దు.. ఆనంద్‌ మళ్లీ సీఎం అవుతారు..’(వెంటనే సవరించు కుని మళ్లీ కేసీఆర్‌ సీఎం అవుతారు) అని అన్నారు. మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు కాగానే భూములు లేని పేదలకు కేసీఆర్‌ బీమా అమలు చేస్తామన్నారు.

తెల్లకార్డున్న వారందరికీ సన్న బియ్యం ఇస్తామని తెలిపారు. రూ.400కే గ్యాస్‌ సిలిండర్‌ ఇస్తామని ప్రకటించారు. మైనార్టీ సంక్షేమానికి కేసీఆర్‌ ప్రభుత్వం కట్టుబడి ఉందంటూ.. బీఆర్‌ఎస్‌ పాలనలో హైదరాబాద్‌లో ఒక్కసారి కూడా గొడ వలు కాలేదన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 111 జీఓను ఎత్తేశామని కేటీఆర్‌ చెప్పారు. గంగిగోవు లాంటి ఎమ్మెల్యే కాలె యాదయ్య కావాలా.. ఆయుధాలు సరఫరా చేసే కాంగ్రెస్‌ అభ్యర్థి కావాలా..? ప్రజలు తేల్చుకోవా లని సూచించారు. కార్యక్రమంలో మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, ఎంపీ రంజిత్‌రెడ్డి పాల్గొన్నారు. 

కరెంటు కావాలా.. కాంగ్రెస్‌ కావాలా..?  
ఇక్కడి కాంగ్రెస్‌ నాయకులకు చేవ లేదు, సత్తాలేదని మంత్రి విమర్శించారు. అందుకే ఢిల్లీతో పాటు పక్క రాష్ట్రాల నుంచి నాయకులను తెచ్చుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఊర్లల్ల ఎవరైనా చచ్చిపోతే స్నానాలు చేయడానికి ఓ అరగంట కరెంటు వదలండని కరెంటోళ్ల కాళ్లు మొక్కిన రోజులు ఇంకా మనం మ ర్చిపోలేదన్నారు. కరెంటు కావాలా.. కాంగ్రెస్‌ కావాలా..? ప్రజలు తేల్చుకోవాలని పిలుపునిచ్చారు. గులిగితే మామీద గులగండి.. ఓట్లు కూడా మాకే గుద్దండి అని కోరారు.  

Advertisement
Advertisement