అనూహ్య పరిణామం.. ఎన్‌సీఎల్‌ఏటీ సభ్యులకు కోర్టు ధిక్కార నోటీసులు

Supreme Court Issues Contempt Notice To NCLAT Members - Sakshi

ఢిల్లీ: దేశసర్వోన్నత న్యాయస్థానంలో బుధవారం అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ సభ్యులిద్దరికి సుప్రీం కోర్టు కోర్టు ధిక్కారం కింద షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. నవంబర్‌ 30వ తేదీన వాళ్లిద్దరిని తమ ఎదుట హాజరు కావాలని సీజేఐ ధర్మాసనం ఆ నోటీసుల్లో ఆదేశించింది. 

ఫినోలెక్స్‌ కేబుల్స్‌ వార్షిక సమావేశానికి సంబంధించిన వ్యవహారంలో అక్టోబర్‌ 13వ తేదీన ‘స్టేటస్‌ కో’(యధాతథ స్థితి) ఆదేశాలు ఇచ్చింది సుప్రీం కోర్టు. అయితే ఆ ఆదేశాలతో సంబంధం లేకుండా.. ఎన్‌సీఎల్‌ఏటీ జ్యూడీషియల్‌ సభ్యుడు రాకేశ్‌ కుమార్‌,  టెక్నికల్‌ మెంబర్‌ డాక్టర్‌ అలోక్‌ శ్రీవాస్తవలు ఈ వ్యవహారంపై దాఖలైన అప్పీల్‌పై తీర్పు ఇచ్చారు. ఈ విషయాన్ని సంబంధిత లాయర్లు సుప్రీం కోర్టు దృష్టికి తీసుకెళ్లగా.. న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది.   

ఈ విషయంపై దర్యాప్తు జరపాలని ఎన్‌సీఎల్‌ఏటీ చైర్‌పర్సన్‌ జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌ను సుప్రీం కోర్టు ఆదేశించింది. సుప్రీం కోర్టు స్టేటస్‌ కో ఆదేశాల గురించి తమకు తెలియదని ఆ ఇద్దరు సభ్యులు చైర్‌పర్సన్‌ ముందు వివరణ ఇచ్చారు. ఇదే విషయాన్ని దర్యాప్తు నివేదికలో పొందుపరిచారు చైర్‌పర్సన్‌.  అయితే దర్యాప్తు నివేదిక ఇవాళ సుప్రీం కోర్టుకు చేరింది.

దానిని భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం పరిశీలించింది. అయితే.. సుప్రీం కోర్టు ఆదేశాలు తెలిసి కూడా ఎన్‌సీఎల్‌ఏటీ తీర్పు వెల్లడించినట్లు ప్రాథమికంగా ధర్మాసనం గుర్తించింది. ఆ ఇద్దరు సభ్యులను అక్టోబర్‌ 30వ తేదీన తమ ఎదుట వ్యక్తిగతంగా  హాజరు కావాలని ఆదేశించింది. అంతేకాదు సుప్రీం స్టేటస్‌ కో ఆదేశాల్ని ఉల్లంఘిస్తూ ఎన్‌సీఎల్‌ఏటీ ట్రిబ్యునల్‌ ఇచ్చిన తీర్పును సైతం పక్కనపెట్టేసిన సుప్రీం ధర్మాసనం..  ఈ అంశాన్ని చైర్‌పర్సన్‌ జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌ ముందుకు బదిలీ చేసింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top