ఎక్స్‌ట్రా ఇన్‌కమ్‌ కోసం ఆశపడితే మొదటికే మోసం! బ్యాంక్‌ మేనేజర్‌కి జరిగింది ఇదే..

Pune bank manager fell prey to an online task fraud losing over Rs 15 lakh - Sakshi

ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆన్‌లైన్‌, సైబర్‌ మోసాలు ఎక్కువయ్యాయి. సామాన్యులే కాకుండా బ్యాంక్‌ మేనేజర్‌ వంటి అవగాహన ఉన్న ఉన్నత ఉద్యోగులు కూడా ఈ మోసాల బారిన పడుతున్నారు. రూ.లక్షల్లో డబ్బును పోగొట్టుకుంటున్నారు. 

పుణేలో ఓ బ్యాంక్ మేనేజర్ ఇలాగే ఆన్‌లైన్ టాస్క్‌ల మోసానికి గురయ్యారు. మొదట ఫారమ్‌లను నింపడం, వీడియోలను చూడటం వంటి చిన్న చిన్న టాస్క్‌లను ఇచ్చిన మోసగాళ్లు పూర్తయిన తర్వాత వెంటనే అతని బ్యాంక్ ఖాతాకు డబ్బును జమ చేశారు. బాధితుడు వారిని విశ్వసించడం ప్రారంభించిన తర్వాత "టాస్క్ యాక్టివేషన్ ఫీజు" అడగడం ప్రారంభించారు. ఇలా రూ. 15 లక్షలకు పైగా అతని నుంచి రాబట్టారు. బాధితుడు ఆన్‌లైన్‌ వారిచ్చిన 27 టాస్క్‌లను పూర్తి చేసినా వాటికి డబ్బు మాత్రం చెల్లించలేదు.

పార్ట్‌టైమ్ ఉద్యోగం పేరుతో ఎర
టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా నివేదిక ప్రకారం.. పార్ట్‌టైమ్ ఉద్యోగం పేరుతో స్కామర్‌లు బ్యాంక్‌ మేనేజర్‌కు ఎర వేశారు. ఈ మేరకు బాధితుడి ఫోన్‌కు మెసేజ్‌ పంపించారు. ఇది నిజమేనని నమ్మిన బ్యాంక్‌ మేనేజర్‌ స్కామర్‌లను సంప్రదించాడు. ఖాళీ సమయంలో ఇంటి నుంచి పని చేయడం ద్వారా అద్భుతమైన రాబడి వస్తుందని వారు ఆయన్ను నమ్మించారు. తర్వాత ఒక గ్రూపులో నమోదు చేసుకోవాలని చెప్పి టాస్క్‌లు ఇవ్వడం ప్రారంభించారు. మొదట్లో కొన్ని టాస్క్‌లు పూర్తి చేసిన  కొంత డబ్బు వచ్చింది. ఆ తర్వాత టాస్క్‌లను యాక్టివ్‌ చేయడానికి బాధితుడి నుంచి డబ్బు తీసుకోవడం ప్రారంభించారు.

మొదట్లో వెంటనే డబ్బు
అలా ఒక టాస్క్‌లో భాగంగా అతన్ని 27 విమాన టిక్కెట్లు బుక్ చేయమని అడిగారు. ఈ టాస్క్‌ను యాక్టివేట్ చేయడానికి రూ. 10,000 డిపాజిట్ చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఈ డబ్బును డిపాజిట్ చేసి టాస్క్‌ పూర్తి చేసిన బాధితుడి బ్యాంకు ఖాతాలో రూ. 16,321 జమయ్యాయి. 

దీని తరువాత టాస్క్‌ల యాక్టివేషన్‌ కోసం బ్యాంక్‌ మేనేజర్‌ వారికి డబ్బు పంపడం ప్రారంభించాడు. వారిచ్చిన  27 టాస్క్‌లు పూర్తి చేశాడు. వాటి మీద వచ్చిన సొమ్మును ఉపసంహరించుకోవడానికి ప్రయత్నించగా మరో మూడు టాస్క్‌లు పూర్తి చేయాల్సి ఉంటుందని స్కామర్లు అతనికి చెప్పారు. అంతే కాదు వాటిని యాక్టివేట్ చేసేందుకు మరో రూ.20 లక్షలు డిపాజిట్ చేయాలని కోరారు. దీంతో మోసపోయానని గ్రహించిన బ్యాంక్‌ మేనేజర్‌ పోలీసులను ఆశ్రయించాడు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top