ఏడాది పీజీ కోర్సులు

Post graduate courses in three designs - Sakshi

యూజీసీ ప్రతిపాదన 

మూడు డిజైన్లలో పోస్టు గ్రాడ్యుయేట్‌ కోర్సులు 

ఏడాది పీజీ, రెండేళ్ల పీజీతో పాటు సమీకృత ఐదేళ్ల యూజీ/పీజీ 

ఇప్పుడున్న రెండేళ్ల పీజీలో ఏడాది తర్వాత విద్యార్థి వైదొలగేందుకు అవకాశం 

అలాంటి వారికి పీజీ డిప్లొమా డిగ్రీ 

స్టెమ్‌ కోర్సులు చేసిన వారికి సైతం ఎంఈ, ఎంటెక్‌లో ఏడాది పీజీ 

సాక్షి, అమరావతి: దేశంలో తొలిసారిగా ఏడాది పీజీ కోర్సును పీజీ డిప్లొమా పేరుతో అందించేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ ప్రతిపాదించింది. నూతన జాతీయ విద్యా విధానంలో భాగంగా పీజీ కోర్సుల కాలపరిమితి, క్రెడిట్స్, కరిక్యులమ్‌తో కూడిన కొత్త నిబంధనల ముసాయిదాను రూపొందించింది. ఇందులో పీజీ కోర్సులను మూడు విధాలుగా డిజైన్‌ చేసింది. ఏడాది, రెండేళ్ల పీజీ, సమీకృత ఐదేళ్ల పీజీ ప్రోగ్రామ్‌లను తీసుకొస్తోంది.

ఆనర్స్‌–రీసెర్చ్‌ కాంపోనెంట్‌తో నాలుగేళ్ల బ్యాచి­లర్‌ డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు ఏడాది మాస్టర్స్‌ ప్రోగ్రామ్‌ చేయొచ్చు. మూడేళ్ల బ్యాచిలర్‌ డిగ్రీ చేసిన విద్యార్థులు రెండేళ్ల పీజీ ప్రోగ్రామ్‌ను కొనసాగించవచ్చు. ఇక్కడ పీజీలో రెండో సంవత్సరం పూర్తిగా పరిశోధనపై దృష్టి సారించేలా కరిక్యులమ్‌­లో మార్పులు చేసింది. పీజీ మొదటి సంవత్సరం తర్వాత ప్రోగ్రామ్‌ నుంచి విద్యార్థులు వైదొలగాలి అనుకుంటే వారికి పీజీ డిప్లొమా అందిస్తుంది. ఇక సమీకృత ఐదేళ్ల బ్యాచిలర్, మాస్టర్స్‌ ప్రోగ్రామ్‌ పెట్టాలని యూడా యూజీసీ సూచించింది. 

నచ్చిన సబ్జెక్ట్‌లో పీజీ 
నాలుగేళ్ల యూజీ ప్రోగ్రామ్‌లో ఒక విద్యార్థి భౌ­తికశాస్త్రం మేజర్‌గా, ఆర్థిక శాస్త్రం మైనర్‌ సబ్జెక్టుగా తీసుకుంటే.. కొత్త విధానం ప్రకారం ఈ విద్యార్థి మేజర్, మైనర్‌లో దేనిలోనైనా పీజీలో చేరవచ్చు. మరోవైపు ఒకేసారి రెండు పీజీ కోర్సులు అభ్యసించే సౌలభ్యాన్ని కూడా యూజీసీ కలి్పస్తోంది. ఇందు కోసం ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌/దూరవిద్య లేదా ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌ మోడ్‌లతో ఏర్పడిన హైబ్రీడ్‌ విధానాల్లో చదువుకునేలా ప్రతిపాదించింది.

మెషిన్‌ లెర్నింగ్, మల్టిడిసిప్లినరీ ఫీల్డ్‌ వంటి కోర్‌ ఏరియాలలో కృత్రిమ మేధ కాంబినేషన్‌లో వ్యవసాయం, వైద్యం, న్యాయ విద్యలో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్‌లను అందించాలని సిఫార్సు చేసింది. ఇక స్టెమ్‌ సబ్జెక్టులు అభ్యసించిన విద్యా­ర్థు­లు సైతం ఎంఈ, ఎంటెక్‌ వంటి సాంకేతిక డిగ్రీల్లో ‘ఏడాది పీజీ’లో చేరేందుకు అర్హు­లని ప్రకటించింది. ఈ అంశాలపై వివిధ వర్గాలు, పౌరుల నుంచి అభిప్రాయం సేకరిస్తున్నట్టు యూజీసీ తెలిపింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top