ఎప్పటికప్పుడు జనన, మరణాల ధ్రువీకరణ | Sakshi
Sakshi News home page

ఎప్పటికప్పుడు జనన, మరణాల ధ్రువీకరణ

Published Thu, Oct 14 2021 4:28 AM

Certification of births and deaths from time to time Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు తీసుకోవాల్సిన ఆవశ్యకతపై ప్రజల్లో అవగాహన పెరిగింది. గడిచిన 53 మాసాల్లో 34.87 లక్షల బర్త్‌ సర్టిఫికెట్లు, 19.86 లక్షల డెత్‌ సర్టిఫికెట్లు తీసుకున్నట్లు తాజా గణాంకాల్లో వెల్లడైంది. పుట్టిన తర్వాత చట్టబద్ధమైన గుర్తింపు కోసం జనన ధ్రువీకరణ పత్రం తప్పనిసరి. ఇందులో శిశువు జన్మించిన తేదీ, సమయం, ప్రాంతం, లింగం తదితర వివరాలుంటాయి. అలాగే ప్రభుత్వ పథకాల లబ్ధి చేకూరడానికి మృతి చెందిన వారికి మరణ ధ్రువీకరణ పత్రం కూడా తప్పనిసరి. అందుకే రాష్ట్రంలో జనన మరణ ధ్రువీకరణ విధిగా చేయాలని ఇప్పటికే అన్ని శాఖలకు ఆదేశాలు వెళ్లాయి.

ప్రతి ప్రైవేటు ఆస్పత్రిలో సైతం జనన మరణాల ధ్రువీకరణకు సంబంధించిన పర్యవేక్షణ ఉంటోంది. అందుకే కరోనా లాంటి విపత్తుల సమయంలోనూ రికార్డు స్థాయిలో జనన, మరణ ధ్రువీకరణ పత్రాలను ప్రజలు తీసుకున్నారు. కేవలం 2020లోనే 7,14,017 మంది జనన ధ్రువీకరణ పత్రాలు తీసుకోగా, 2021 ఏప్రిల్‌ నుంచి ఆగస్ట్‌ వరకూ 4,39,402 మంది పుట్టినట్టు జనన ధ్రువీకరణ పత్రాలను బట్టి తేలింది. పుట్టిన 7 రోజుల్లోనే బర్త్‌ సర్టిఫికెట్, మృతి చెందిన మూడు రోజుల్లో డెత్‌ సర్టిఫికెట్‌ జారీ అవుతోంది. 

అప్పుడే పుట్టిన పిల్లలకు ఆధార్‌..
రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రిలో శిశు ఆధార్‌ ప్రాజెక్టు అమలు కావాలని అన్ని ఆస్పత్రులకు ఆదేశాలు వెళ్లాయి. ఈ రోజుల్లో ప్రతీ ప్రభుత్వ పథకానికి, అవసరానికి ఆధారం తప్పనిసరిగా మారింది. అందుకే చిన్నారికి 1 రోజు వయస్సు ఉన్నా కూడా ఆధార్‌ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని యుఐడీఏఐ తెలిపింది. ఇందు కోసం శిశువు జనన ధ్రువీకరణ పత్రం అవసరం. అందుకే అటు బర్త్‌ సర్టిఫికెట్, ఇటు ఆధార్‌ వెనువెంటనే వచ్చేలా ప్రతి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రిలో ఏర్పాట్లు చేశారు. చిన్నారుల నుంచి ఎలాంటి ఫింగర్‌ ఫ్రింట్‌ తీసుకోకుండా మొదట ఆధార్‌ జారీ చేస్తారు.

ఆ తర్వాత పిల్లలకు 5 సంవత్సరాల వయస్సు వచ్చినప్పుడు ఆ బయోమెట్రిక్‌ వివరాలను అప్‌ డేట్‌ చేసుకోవచ్చు. అలాగే నెలవారీ హెచ్‌ఎంఐఎస్‌ (హెల్త్‌ మేనేజ్‌మెంట్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టం), ఆర్సీహెచ్‌ (రీప్రొడక్టివ్‌ ఛైల్డ్‌ హెల్త్‌) పోర్టల్‌కు అనుసంధానించే వారి పేర్లు ఎప్పటికప్పుడు పరిశీలించాలని అధికారులు ఆదేశించారు. జీవనశైలి జబ్బుల వివరాలు కూడా హెచ్‌ఎంఐఎస్‌ పోర్టల్‌కు అనుసంధానించారు.

అత్యధికంగా కర్నూలు జిల్లాలో..
గత ఏడాది అంటే 2020 ఏప్రిల్‌ నుంచి 2021 మార్చి 31 వరకూ అత్యధికంగా కర్నూలు జిల్లాలో 90,450 మందికి జనన ధ్రువీకరణ పత్రాలు జారీచేశారు. తూర్పుగోదావరి జిల్లాలో 72,775 మందికి జారీచేసి రెండో స్థానంలో నిలిచింది. మరణ ధ్రువీకరణ పత్రాల జారీలో తూర్పుగోదావరి జిల్లా మొదటిస్థానంలో నిలిచింది. 2020లో ఆ జిల్లాలో 55,656 పత్రాలు జారీచేశారు. 48,965 డెత్‌ సర్టిఫికెట్లు జారీచేసి గుంటూరు జిల్లా రెండో స్థానంలో నిలిచింది.

విజయనగరం జిల్లాలో అత్యల్పంగా 20,509 మాత్రమే డెత్‌ సర్టిఫికెట్లు జారీచేశారు. 2021 ఏప్రిల్‌ నుంచి ఆగస్ట్‌ 30 వరకూ కర్నూలు జిల్లాలో అత్యధికంగా 50,116 బర్త్‌ సర్టిఫికెట్లు జారీ కాగా, ఇదే సమయంలో తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 48,742 డెత్‌ సర్టిఫికెట్లు జారీ చేశారు. ఇవి పక్కాగా నమోదు అయినవి మాత్రమే అని, కొన్ని నమోదు కావాల్సినవి కూడా ఉంటాయని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. 

Advertisement
 
Advertisement