నేరచరిత లేనివారిని బైండోవర్‌ చేయొద్దు | Sakshi
Sakshi News home page

నేరచరిత లేనివారిని బైండోవర్‌ చేయొద్దు

Published Thu, May 23 2024 1:50 AM

నేరచరిత లేనివారిని బైండోవర్‌ చేయొద్దు

అనంతపురం: నేరచరిత లేని వారిని బైండోవర్‌ చేయరాదని వైఎస్సార్‌ సీపీ నేతలు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుధవారం ఎస్పీ గౌతమి శాలిని కలిసి విజ్ఞప్తి చేశారు. అనంతరం అనంతపురం పార్లమెంట్‌ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మాలగుండ్ల శంకరనారాయణ విలేకరులతో మాట్లాడుతూ తాడిపత్రిలో జరిగిన సంఘటనలను ఆధారంగా చేసుకుని ప్రజలను ఇబ్బందులకు గురి చేయరాదన్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో నేరచరిత లేని వారిని సైతం బైండోవర్లు చేస్తుండడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారన్నారు. మళ్లీ తమ పార్టీనే అధికారంలోకి రాబోతోందని, సీఎంగా వైఎస్‌ జగన్‌ రెండో దఫా ప్రమాణం చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రాప్తాడు ఎమ్మెల్యే అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్‌ రెడ్డి మాట్లాడుతూ గత ఎన్నికల సమయంలో పోలింగ్‌ కేంద్రాల వద్ద అవాంఛనీయ ఘటనలకు పాల్పడ్డ వారిని మాత్రమే బైండోవర్‌ చేయాలని కోరారు. నేరచరిత లేని వారు, ఎన్నికల సమయంలో ఆటంకాలు సృష్టించని వారిని బైండోవర్లు చేయకూడదని ఎస్పీని కోరినట్లు పేర్కొన్నారు. అనంతపురం జిల్లా ప్రశాంతతకు మారు పేరని, గతంలో ఒక హోంగార్డు, ఒక పోలీసుతోనే నాలుగు పోలింగ్‌ బూత్‌ల నిర్వహణ చేపట్టారంటేనే ఈ విషయం అర్థం చేసుకోవచ్చన్నారు. ఉరవకొండ అభ్యర్థి వై. విశ్వేశ్వర రెడ్డి మాట్లాడుతూ ఒక్కో పల్లెలో 10 మందిని బైండోవర్‌ చేస్తుండడంతో ప్రజలు, రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు. తిరునాళ్లు, జాతరలు జరిగే కాలం ఇదని, ఈ నేపథ్యంలో ఆంక్షలను సడలించాలని విజ్ఞప్తి చేశారు. కౌంటింగ్‌ ప్రక్రియకు ఆటంకం కలగకుండా చూడాలన్నారు. కౌంటింగ్‌కు ఏజెంట్లుగా ఉన్న వారిని ఇబ్బందులకు గురి చేయరాదన్నారు. కౌంటింగ్‌ కూడా ప్రశాంతంగా ముగియాలని ఆకాంక్షించారు. శింగనమల వైఎస్సార్‌సీపీ అభ్యర్థి వీరాంజనేయులు మాట్లాడుతూ జిల్లాలో సాధారణ పౌరుల స్వేచ్ఛకు భంగం కలిగేలా వ్యవహరించరాదన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ లీగల్‌ సెల్‌ జిల్లా అధ్యక్షుడు గాజుల ఉమాపతి, జనరల్‌ సెక్రటరీ ఈ. వెంకట రాముడు, ఉపాధ్యక్షుడు జూటూరు సుధాకర్‌ రెడ్డి, కమిటీ సభ్యులు టి. గోకుల్‌ కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

జిల్లా ఎస్పీకి వైఎస్సార్‌ సీపీ నేతల వినతి

Advertisement
 
Advertisement
 
Advertisement