D.K. Shivakumar
-
డీకే శివకుమార్ అనే నేను.. కర్ణాటక నూతన సీఎంగా ...!
-
సీఎంగా నేడే డీకేఎస్ ఎంపిక
సాక్షి బెంగళూరు: కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పుపై పూర్తిస్థాయి స్పష్టత రావడంతో గందరగోళానికి తెరపడింది. సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేయడంతో ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కర్ణాటక ప్రభుత్వ పగ్గాలు చేపట్టడం దాదాపుగా ఖరారైంది. ఇందుకు అవసరమైన ప్రక్రియను కాంగ్రెస్ పార్టీ ప్రారంభించింది. కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై కసరత్తు సాగుతోంది. సిద్ధరామయ్య, డీకే శివకుమార్ వేర్వేరుగా ఢిల్లీకి చేరుకున్నారు. మంత్రివర్గంలో తమ అనుచర వర్గానికి చోటు కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. శనివారం సాయంత్రం 4 గంటలకు బెంగళూరు విధానసౌధలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధ్యక్షతన కాంగ్రెస్ శాసనసభాపక్ష(సీఎల్పీ) సమావేశం జరగనుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలతోపాటు కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రణదీప్ సింగ్ సూర్జేవాలా తదితరులు పాల్గొంటారు. కాంగ్రెస్ అధిష్టానం సూచన మేరకు డీకే శివకుమార్‌ను సీఎల్పీ నేతగా ఎన్నుకోనున్నట్లు సమాచారం. ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ అభ్యర్థిత్వాన్ని కర్ణాటక కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి రణదీప్ సింగ్ సూర్జేవాలా ప్రతిపాదించనున్నారు. ఈ ప్రతిపాదనకు పార్టీ ఎమ్మెల్యేలు ఆమోదం తెలపాల్సి ఉంది. సీఎల్పీ నేతను ఎన్నుకున్న తర్వాత ఎమ్మెల్యేల మద్దతు లేఖను లోక్‌భవన్‌లో గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్‌కు అందజేస్తారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని గవర్నర్‌కు తెలియజేస్తారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ గవర్నర్ ఆహ్వానిస్తే.. సోమవారం విధానసౌధ వద్ద కొత్త ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ప్రమాణ స్వీకార శుభముహూర్తం కోసం ఆయన ఇప్పటికే జ్యోతిష్యులను సంప్రదించినట్లు సమాచారం. సోమవారం మంచి ముహూర్తం ఉందని వారు సూచించినట్లు తెలిసింది. విధానసౌధ ఎదుట ప్రమాణ స్వీకారానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఢిల్లీలో సిద్ధరామయ్య, డీకేఎస్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన అనంతరం సిద్ధరామయ్య ఢిల్లీకి చేరుకున్నారు. శుక్రవారం ఉదయం అగ్రనేతలు సోనియా గాం«దీ, రాహుల్ గాం«దీ, మల్లికార్జున ఖర్గేను కలుసుకొని ధన్యవాదాలు తెలియజేశారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటు, మంత్రివర్గం కూర్పుపై సుమారు గంటకు పైగా చర్చించారు. అలాగే సిద్ధరామయ్య రాజకీయ భవిష్యత్తుపైనా చర్చ జరిగినట్లు తెలిసింది. జాతీయ రాజకీయాల్లోకి రావాల్సిందిగా ఆయనను మరోసారి ఆహ్వానించినట్లు సమాచారం. ఈ సందర్భంగా సిద్ధరామయ్య వెంట ఆయన కుమారుడు యతీంద్ర, సీనియర్ మంత్రి కేజే జార్జ్ కూడా ఉన్నారు. ముఖ్యమంత్రిగా ఇప్పటివరకు తనకు అవకాశం కల్పించినందుకు, సహకరించినందుకు అధిష్టానం పెద్దలకు సిద్ధరామయ్య కృతజ్ఞతలు తెలిపారు. డీకే శివకుమార్ సైతం పార్టీ అగ్రనేతలను కలుసుకున్నారు. మంత్రివర్గంలో తన వర్గం ఎమ్మెల్యేలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన కోరినట్లు తెలుస్తోంది. రాజీనామాకు గవర్నర్ ఆమోదం సిద్ధరామయ్య రాజీనామాకు గవర్నర్ గెహ్లాట్ శుక్రవారం ఉదయం ఆమోదం తెలిపారు. రాజీనామా తక్షణమే అమల్లోకి వస్తున్నట్లు గవర్నర్ ప్రకటించారు. ఈ మేరకు గెజిట్ విడుదల చేశారు. నూతన సీఎం ప్రమాణస్వీకారం చేసేదాకా ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని సిద్దరామయ్యను గవర్నర్ కోరారు. శనివారం జరిగే సీఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలందరూ తప్పనిసరిగా పాల్గొనాలని కేపీసీసీ ఆదేశించింది. ఢిల్లీలో ఉన్న సిద్ధరామయ్య, డీకే శివకుమార్, రణదీప్ సింగ్ సూర్జేవాలా శుక్రవారం రాత్రి బెంగళూరుకు తిరిగి వచ్చారు. మంత్రి పదవుల కోసం లాబీయింగ్ కొత్తగా ఏర్పడనున్న మంత్రివర్గంలో చోటు కోసం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లాబీయింగ్ ప్రారంభించారు. చాలామంది ఎమ్మెల్యేలు ఢిల్లీకి చేరుకుని అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కాబోయే ముఖ్యమంత్రి డీకే శివకుమార్, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హైకమాండ్‌తో మంత్రివర్గ కూర్పుపై సంప్రదింపులు జరుపుతున్నారు. ఒకట్రెండు రోజుల్లో మంత్రుల జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది. తమ సన్నిహిత ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు దక్కేలా సిద్ధరామయ్య, డీకే శివకుమార్ అధిష్టానం వద్ద పావులు కదుపుతున్నారు. తమ వర్గానికి అత్యధిక మంత్రి పదవులు దక్కించుకునేందుకు ఇరువురు నేతలు పోటీ పడుతున్నారు. ఈసారి మంత్రివర్గంలో కొత్తముఖాలకు ఎక్కువగా ప్రాధాన్యం దక్కుతుందని ఊహాగానాలు సాగుతున్న తరుణంలో సీనియర్ మంత్రులు, ముఖ్యంగా సిద్ధరామయ్య వర్గీయుల్లో టెన్షన్ పెరుగుతోంది. 40 మందికి పైగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రివర్గంలో చోటు కోసం ప్రయతి్నస్తున్నారు. సిద్ధరామయ్యపై డీకేఎస్ పొగడ్తల వర్షం డీకే శివకుమార్ ‘ఎక్స్’లో సిద్ధరామయ్యపై పొగడ్తల వర్షం కురిపించారు. ‘‘దేవుడు వరం ఇవ్వడు, శాపం కూడా ఇవ్వడు, అవకాశం మాత్రం ఇస్తాడు. ఆ అవకాశంతో ఏం సాధిస్తామనేది ముఖ్యం’’ అంటూ వేదాంత ధోరణిలో స్పందించారు. అవకాశాలను అందిపుచ్చుకుని విజయం సా«ధించిన వారిలో ముఖ్యుడు సిద్ధరామయ్య అని కొనియాడారు. మైసూరు జిల్లాలోని ఓ కుగ్రామంలో జన్మించి, పోరాటం ద్వారా రాజకీయాల్లోకి వచ్చి, సామాజిక న్యాయం అందిస్తూ, పేదల పెన్నిధిగా, కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య సేవలందించారని డీకే శివకుమార్ ప్రశంసించారు. కర్ణాటక రాజకీయ చరిత్రలో అత్యంత విజయవంతంగా, దీర్ఘకాలంగా ముఖ్యమంత్రిగా పనిచేసి సామాన్య ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకున్నారని ఉద్ఘాటించారు. నూతన మంత్రివర్గ ఏర్పాటుపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఢిల్లీలో డీకే శివకుమార్ తెలిపారు. -
సిద్ధరామయ్య రాజీనామా
సాక్షి బెంగళూరు: కర్ణాటకలో అధికార మార్పిడికి అడ్డంకులు తొలగిపోయాయి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సూచనల మేరకు పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఆయన గురువారం మధ్యాహ్నం బెంగళూరులోని లోక్‌భవన్‌కు చేరుకున్నారు. గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ అందుబాటులో లేకపోవడంతో లోక్‌భవన్ ప్రత్యేక కార్యదర్శి ప్రభుశంకర్‌కు రాజీనామా లేఖను అందజేశారు. ఈ సందర్భంగా సిద్ధరామయ్య వెంట ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా ఉన్నారు. శుక్రవారం సాయంత్రంలోగా గవర్నర్ లోక్‌భవన్‌కు తిరిగి వస్తారని, వీలైతే ఒకసారి వచ్చి రాజీనామా విషయాన్ని స్వయంగా గవర్నర్‌కు తెలియజేయాలని ప్రభుశంకర్ కోరారు. గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ వ్యక్తిగత కారణాలతో అత్యవసరంగా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు పయనమయ్యారు. బెంగళూరుకు తిరిగి వచ్చిన తర్వాత సిద్ధరామయ్య రాజీనామాను అధికారికంగా ఆమోదించే అవకాశాలు ఉన్నాయి. రాజీనామా సమర్పించిన లోక్‌భవన్ నుంచి బయటకు వచ్చిన సిద్ధరామయ్యకు ఊహించని పరిణామం ఎదురయ్యింది. వందలాది మంది అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు ఆయనకు మద్దతుగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. రాజీనామా చేయవద్దని కోరారు. సిద్ధరామయ్య కారుకు అడ్డుతగిలారు. రాజీనామాను ఉపసంహరించుకోవాలని కోరుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. రాష్ట్ర రాజకీయాల్లోనే కొనసాగుతా.. రాజీనామా సమర్పించిన అనంతరం సిద్ధరామయ్య మీడియాతో మాట్లాడారు. రాజ్యసభకు పంపిస్తామంటూ కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఆఫర్ వచ్చిందని తెలిపారు. తనకు జాతీయ రాజకీయాలపై ఆసక్తి లేదని వినమ్రంగా ఆ వినతిని తోసిపుచ్చినట్లు చెప్పారు. రాష్ట్ర రాజకీయాల్లోనే కొనసాగుతానని, ప్రజలు తమకు ఐదేళ్లపాటు పదవీకాలం ఇచ్చారని, ఇంకా రెండేళ్ల కాలం మిగిలి ఉందని, అప్పటివరకు వారి కోసం కోసం పని చేయాల్సి ఉందని అధిష్టానానికి చెప్పినట్లు వెల్లడించారు. తనపై ఎలాంటి ఒత్తిడి లేదని, పార్టీ పెద్దల ఆదేశాల మేరకు మనస్ఫూర్తిగా రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు. తదుపరి ముఖ్యమంత్రి ఎవరనేది పార్టీ హైకమాండ్ నిర్ణయిస్తుందని తెలిపారు. పార్టీ ఎమ్మెల్యేలు, హైకమాండ్ నిర్ణయం మేరకు నూతన ముఖ్యమంత్రి ఎంపిక జరుగుతుందన్నారు. ఢిల్లీ బదులు జైపూర్‌కు సిద్ధరామయ్య విమానం రాజీనామా అనంతరం సిద్ధరామయ్య తన కుమారుడు యతీంద్ర, కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి రణదీప్ సూర్జేవాలాతోపాటు తన వర్గం మంత్రులు, నాయకులతో కలిసి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరారు. అయితే, ప్రతికూల వాతావరణం కారణంగా ఈ విమానాన్ని రాజస్తాన్‌లోని జైపూర్‌లో ల్యాండ్ చేసినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంఓ) ప్రకటించింది. తదుపరి సీఎం ఎంపికతోపాటు కేబినెట్ ఏర్పాటు గురించి అధిష్టానం పెద్దలతో మాట్లాడేందుకు సిద్ధరామయ్య ఢిల్లీకి పయనమైనట్లు సమాచారం. తన వర్గం ఎమ్మెల్యేలకు గరిష్ట సంఖ్యలో మంత్రి పదవులు ఇప్పించుకోవాలని ఆయన యోచిస్తున్నారు. సిద్ధరామయ్య శుక్రవారం ఢిల్లీకి చేరుకొనే అవకాశం ఉంది. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా మరో విమానంలో గురువారం రాత్రి ఢిల్లీకి బయలుదేరారు. శుక్రవారం ఢిల్లీలోనే మకాం వేయనున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత ఎన్నిక, కొత్త ప్రభుత్వ ఏర్పాటు, అధిష్టానం పెద్దలతో చర్చించనున్నారు. ప్రభుత్వ ఏర్పాటుపై శుక్రవారం స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా అభిమానుల ఆందోళన సీఎం పదవికి రాజీనామా చేసిన సిద్ధరామయ్యకు మద్దతుగా ఆయన అనుచరులు, అభిమానులు రాష్ట్రవ్యాప్తగా ఆందోళనకు దిగారు. నిరసన కార్యక్రమాలు చేపట్టారు. తమ నాయకుడికి అనుకూలంగా నినాదాలు చేశారు. కాంగ్రెస్ అధిష్టానం వైఖరిపై మండిపడ్డారు. సిద్ధరామయ్యతో బలవంతంగా రాజీనామా చేయించారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. అలాగే కురుబ సామాజిక వర్గం నాయకులు సైతం సిద్ధరామయ్య రాజీనామాను వ్యతిరేకిస్తూ ప్రదర్శనలు నిర్వహించారు. రాజీనామాను వెనక్కి తీసుకోవాలని, పదవిలో కొనసాగాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆదేశాల ప్రకారమే సిద్ధరామయ్య రాజీనామా చేసినట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. సిద్ధరామయ్యకు డీకే శివకుమార్ పాదాభివందనం రాజీనామాకు ముందు సీఎం సిద్ధరామయ్య గురువారం ఉదయం సహచర మంత్రులకు తన అధికారిక నివాసం ‘కావేరి’లో అల్పాహార విందు ఏర్పాటు చేశారు. సుమారు గంటన్నర పాటు ఈ కార్యక్రమం జరిగింది. ఇప్పటివరకు పాలనలో తనకు సహకరించిన మంత్రులకు సిద్ధరామయ్య ధన్యవాదాలు తెలియజేశారు. హైకమాండ్ ఆదేశాలను శిరసావహిస్తూ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పారు. రాజీనామాకు గల కారణాలను వివరించారు. 2023లో ప్రభుత్వ ఏర్పాటు సమయంలో జరిగిన అంతర్గత ఒప్పందంతోపాటు ఇచ్చిన మాట ప్రకారం ప్రస్తుతం అధిష్టానం సూచనల మేరకు రాజీనామా చేయాల్సి వస్తోందని స్పష్టంచేశారు. ఇకపైనా ప్రజలకు మంచి పాలన అందించాలని, సంక్షేమ పథకాలను సరిగ్గా అమలు చేయాలని సహచర మంత్రులకు సూచించారు. రానున్న రెండేళ్లు డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా కొనసాగుతారని, ఆయనకు అందరూ పూర్తి సహకారం అందించాలని సిద్ధరామయ్య కోరినట్లు తెలిసింది. ఈ అల్పాహార విందులో డీకే శివకుమార్ సైతం పాల్గొన్నారు. సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌లు పక్కపక్కనే కూర్చొన్నారు. సిద్ధరామయ్యను చూసిన వెంటనే డీకే శివకుమార్ ఆయనకు పాదాభివందనం చేశారు. డీకే శివకుమార్‌ను సిద్ధరామయ్య పైకి లేపి ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సమయంలో సిద్ధరామయ్య నవ్వుతూ కనిపించగా, డీకే శివకుమార్ కొద్దిగా భావోద్వేగానికి గురైనట్లు కనిపించింది. ఇరువురు నేతలు దాదాపు అరగంట పాటు ప్రత్యేకంగా మాట్లాడుకున్నారు. అయితే, సిద్ధరామయ్య రాజీనామా సమర్పించిన అనంతరం కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం జరుగుతుందని, నూతన సీఎల్పీ నేతగా డీకే శివకుమార్‌ను ఎన్నుకుంటారని తొలుత ప్రచారం జరిగింది. కానీ, సీఎల్పీ భేటీ జరగకపోవడం గమనార్హం. -
డీకేఎస్కే పట్టం
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు జాతీయస్థాయిలో ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారాయి. గత కొన్ని నెలలుగా ఉత్కంఠభరితంగా మారిన ముఖ్యమంత్రి మార్పు అంశం ఒక కొలిక్కి వచ్చింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవికి గురువారం రాజీనామా చేయనున్నారు. ఉప ముఖ్యమంత్రి డి.కె.శివకుమార్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించనున్నారు. కాంగ్రెస్ అధిష్టానంతో మంగళవారం సుదీర్ఘంగా జరిగిన చర్చల అనంతరం సిద్ధరామయ్య పదవి నుంచి తప్పుకోవడానికి అంగీకరించిన సంగతి తెలిసిందే. ఢిల్లీలో వరుస సమావేశాల అనంతరం మంగళవారం రాత్రి బెంగళూరుకు తిరిగివచ్చారు. బుధవారం మీడియా సమావేశం నిర్వహించి తన రాజీనామాను ప్రకటిస్తారని వార్తలొచ్చాయి. కానీ, మీడియా సమావేశాన్ని గురువారానికి వాయిదా వేసుకున్నారు. చివరిసారిగా ముఖ్యమంత్రి హోదాలో తన సహచర మంత్రులు, ఎమ్మెల్యేలకు గురువారం ఉదయం 8.45 గంటలకు అల్పాహార విందు ఇవ్వబోతున్నారు. అనంతరం 10.30 గంటలకు లోక్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్‌కు తన రాజీనామా లేఖను అందిస్తారు. సీఎం రాజీనామా తర్వాత కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. ఈ భేటీలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్, కర్ణాటక కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి రణదీప్ సుర్జేవాలా కూడా పాల్గొంటారు. పార్టీ హైకమాండ్ తీర్మానాన్ని ఎమ్మెల్యేలకు వివరించనున్నారు. నూతన శాసనసభాపక్ష నేతను ఎన్నుకుంటారు. అధిష్టానం సూచనల మేరకు ఉప ముఖ్యమంత్రి డి.కె.శివకుమార్‌ను సీఎల్పీ నాయకుడిగా ఎన్నుకోనున్నట్లు సమాచారం. సీఎల్పీ ఆమోదం అనంతరం ఆ నిర్ణయాన్ని గవర్నర్‌కు తెలియజేస్తారు. నూతన ముఖ్యమంత్రిగా డి.కె.శివకుమార్ ప్రమాణ స్వీకారం చేయడం లాంఛనమేనని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్ర ప్రజలకు వీడ్కోలు సందేశం ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేస్తారన్న వార్తలను ఆయన వర్గం నేతలు, అనుచరులు జీర్ణించుకోలేకపోతున్నారు. దీనిపై స్పష్టత కోరుతూ ఆయన ఇంటికి పరుగులు పెట్టారు. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు సిద్ధరామయ్యను కలుసుకొని తదుపరి కార్యాచరణపై చర్చించారు. ప్రస్తుత పరిణామాలపై వారంతా ఆందోళన వ్యక్తం చేయగా, సిద్ధరామయ్య మాత్రం మౌనం వహించినట్లు సమాచారం. రాజీనామా చేయవద్దని బుజ్జగించే ప్రయత్నం చేసినప్పటికీ సిద్ధరామయ్య స్పందించకుండా మిన్నకుండిపోయారు. బుధవారం ఆయన ‘ఎక్స్’లో చేసిన ట్వీట్ హాట్‌టాపిక్‌గా మారింది. సీఎంగా తన వీడ్కోలు సందేశాన్ని రాష్ట్ర ప్రజలకు ఇచ్చారు. కర్ణాటక ప్రజల ఆశీర్వాదంతో అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తి చేసుకున్నట్లు, ఈ సమయంలో తమ ప్రభుత్వం గ్యారంటీ స్కీమ్ హామీలతో పాటు అనేక ప్రజాకర్షక పథకాలు అమలు చేసినట్లు తెలిపారు. ఈ విజయాన్ని ప్రతి ఒక్క కన్నడిగుడికి అంకితం ఇస్తున్నామని వెల్లడించారు. ఏ ఒక్కరూ ఆకలితో ఉండకూడదనే సంకల్పంతో అన్నభాగ్య పథకాన్ని తీసుకొచ్చినట్లు ఉద్ఘాటించారు. ఢిల్లీలో హైకమాండ్‌తో జరిగిన సమావేశం, చర్చల వివరాలను గురువారం వెల్లడిస్తానని సిద్ధరామయ్య స్పష్టం చేశారు. ప్రమాణ స్వీకారం ఏర్పాట్లు ఆరంభం ప్రమాణ స్వీకార శుభ ముహూర్తం కోసం డి.కె.శివకుమార్ సన్నిహితులు ఇప్పటికే పురోహితులను సంప్రదించినట్లు తెలిసింది. శివకుమార్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి భారీగా ఏర్పాట్లు ఆరంభమయ్యాయి. బెంగళూరు కంఠీరవ స్టేడియం లేదా విధానసౌధ ముందు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగే అవకాశం ఉంది. మరోవైపు సీఎం సిద్ధరామయ్య ఢిల్లీ పర్యటన ముగించుకుని మంగళవారం రాత్రి బెంగళూరుకు చేరుకోగా, డి.కె.శివకుమార్ మాత్రం బుధవారం కూడా అక్కడే మకాం వేశారు. గురువారం ఉదయం ఢిల్లీ నుంచి బెంగళూరుకు చేరుకొని, సిద్ధరామయ్య ఇచ్చే అల్ఫాహార విందులో ఆయన పాల్గొంటారు. సీఎం మార్పు నిర్ణయంపై కాంగ్రెస్ అధిష్టానం వెనక్కి తగ్గకుండా జాగ్రత్త పడేందుకు డి.కె.శివకుమార్ఢిల్లీలోనే ఉన్నట్లు తెలిసింది. ఈ నెల 30న ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు ప్రచారం సాగుతోంది. -
బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ తర్వాత సంయుక్త మీడియా సమావేశం
-
విషాదం నడుమే.. ఆర్సీబీ జట్టుకు కర్ణాటక ప్రభుత్వ సన్మానం (ఫొటోలు)
-
కర్ణాటకలో నందిని Vs అమూల్
-
కర్నాటక మంత్రివర్గంలోకి 'అవినీతి' ఎమ్మెల్యేలు
కర్నాటక మంత్రివర్గంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి చోటు కల్పించడంపై నిరసన వ్యక్తమవుతోంది. నూతన సంవత్సరం సందర్భంగా కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య మంత్రివర్గాన్ని విస్తరించారు. తాజా మంత్రివర్గ విస్తరణలో అక్రమ మైనింగ్ కేసులో అరోపణలు ఎదుర్కొంటున్న డికే శివకుమార్, భూకబ్జా కు పాల్పడ్డారనే విమర్శలు వస్తున్న ఆర్ రోషన్ బేగ్ లకు చోటు దక్కింది. శివకుమార్, బేగ్ ల చేత గవర్నర్ హెచ్ ఆర్ భరద్వాజ్ తన అధికార నివాసంలో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి సిద్దరామయ్య, పీసీసీ అధ్యక్షులు జి పరమేశ్వర్, ఇతర మంత్రులు హాజరయ్యారు. కర్నాటకలోని రామనగరం జిల్లాలోని కనకపుర నియోజకవర్గానికి శివ కుమార్, శివాజీనగర్ నియోజకవర్గానికి బేగ్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు.


