దేవయానిని వదిలేసే ప్రసక్తే లేదు | Sakshi
Sakshi News home page

దేవయానిని వదిలేసే ప్రసక్తే లేదు

Published Sat, Dec 21 2013 1:58 AM

దేవయానిని  వదిలేసే ప్రసక్తే లేదు - Sakshi

వాషింగ్టన్: వీసా అక్రమాల అభియోగాలపై అరెస్టు చేసిన భారత దౌత్యవేత్త దేవయాని ఖోబ్రాగడేపై కేసును ఉపసంహరించుకోవాలని, ఆమెను అవమానించినందుకు క్షమాపణలు చెప్పాలని భారతదేశం చేసిన డిమాండ్లను అమెరికా తోసిపుచ్చింది. దేవయానిపై వచ్చిన ఆరోపణలు చాలా తీవ్రమైనవని, ఆమెను విచారించకుండా వదిలిపెట్టే ప్రసక్తే లేదని శుక్రవారం స్పష్టంచేసింది. దేవయానిని ఐక్యరాజ్యసమితిలోని భారత శాశ్వత దౌత్య కార్యాలయానికి తరలించిన తర్వాత ఆమెకు పూర్తిస్థాయి దౌత్య రక్షణ ఉంటుందనటం.. అక్కడికి పంపించకముందు ఉన్న కేసులకు వర్తించదని విదేశాంగ శాఖ ప్రతినిధి మారీహార్ఫ్ శుక్రవారం వాషింగ్టన్‌లో మీడియాతో పేర్కొన్నారు. న్యూయార్క్‌లో భారత డిప్యూటీ కౌన్సిల్ జనరల్‌గా పనిచేస్తున్న దేవయానిని ఈ నెల 12వ తేదీన అత్యంత అగౌరవంగా నడిరోడ్డుపై సంకెళ్లు వేసి అరెస్ట్ చేయటమే కాక, తనిఖీల పేరుతో కూడా తీవ్రంగా అవమానించిన విషయం తెలిసిందే. 
 
 దీనిపై భారత్ ఆగ్రహం వ్యక్తంచేస్తూ దేశంలోని అమెరికా దౌత్య కార్యాలయాలు, దౌత్యాధికారులకు అందిస్తున్న భద్రతను, ప్రత్యేక సదుపాయాలను తగ్గించిన విషయమూ విదితమే. దేవయానిపై కేసును ఉపసంహరించాలని, బేషరతుగా క్షమాపణ చెప్పాలని అమెరికాను భారత్ డిమాండ్ చేసింది. అయితే.. ‘‘దేవయానిపై ఆరోపణలను మేం చాలా తీవ్రంగా పరిగణిస్తున్నాం. ఈ ఆరోపణలపై కానీ, అభియోగాలపై కానీ మేం వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు. ఇది చట్టపరమైన అంశం’’ అని మారీహార్ఫ్ ఉద్ఘాటించారు. ఒకవేళ దేవయానిపై ఆమె పనిమనిషి ఫిర్యాదును ఉపసంహరించుకున్నప్పటికీ తమ ప్రభుత్వం ఆమెపై అభియోగాలను ఉపసంహరించుకుంటుందని తాను చెప్పలేనన్నారు. ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు అమెరికా విదేశాంగ మంత్రి జాన్‌కెర్రీతో తన సంభాషణకు సమయాన్ని నిర్ణయించనున్నారని భారత విదేశీ వ్యవహారాల మంత్రి సల్మాన్‌ఖుర్షీద్ చేసిన ప్రకటనతో హార్ఫ్ విభేదించారు. అటువంటి ప్రణాళిక ఏదీ ఇప్పటివరకూ లేదన్నారు. జాన్‌కెర్రీ ఫోన్ చేసినపుడు తాను అందుబాటులో లేనని, నేడో రేపో ఆయనతో తాను మాట్లాడతానని ఖుర్షీద్ మీడియాతో పేర్కొన్న విషయం తెలిసిందే. కానీ.. కెర్రీ కుటుంబంతో కలసి సెలవులు గడపటం కోసం ఫిలిప్పీన్స్‌లో ఉన్నారని.. సెలవులు పూర్తయ్యాకే ఆయన వాషింగ్టన్ తిరిగి వస్తారని హార్ఫ్ వివరించారు. 
 
 జూలై నుంచి భారత్‌తో చర్చిస్తున్నాం...
 చట్టాన్ని నిర్వచించటంలో అమెరికా, భారత్‌ల మధ్య తేడాలు ఉన్నాయని మారీహార్ఫ్ అంగీకరించారు. అయితే.. దేవయానిపై ఆమె పనిమనిషి సంగీత రిచర్డ్స్ చేసిన ఆరోపణల్లో భారత్ దర్యాప్తు వివరాలను తమకు తెలియజేయాలని, ఆరోపణలపై చర్చించేందుకు దేవయానిని తమకు అందుబాటులో ఉంచాలని తాము చేసిన డిమాండ్లను భారత్ నెరవేర్చలేదని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో అమెరికా ప్రభుత్వం తమను సంప్రదించలేదన్న భారత్ ఆరోపణను ఆమె తిరస్కరించారు. సంగీత తన యజమాని దేవయానికి చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయి, తన న్యాయవాదితో కలసి విదేశాంగ శాఖకు ఫిర్యాదు చేసిన జూలై నెల నుంచి ఈ అంశమై ఇరు దేశాల ప్రభుత్వాల మధ్యా చర్చ నడుస్తోందని హార్ఫ్ పేర్కొన్నారు. అయితే.. పని మనిషి చేసిన ఆరోపణలు వివరిస్తూ, వీటిపై దర్యాప్తు చేయాలంటూ సెప్టెంబర్ 4వ తేదీన అమెరికా నుంచి ఒక లేఖ తప్పితే మరెలాంటి సమాచారమూ తమకు అందలేదని వాషింగ్టన్‌లోని భారత దౌత్యకార్యాలయం స్పష్టంచేసింది. సంగీత గురించి తాము అమెరికా ప్రభుత్వానికి చెందిన న్యూయార్క్ పోలీసు విభాగం, విదేశాంగ విభాగం, న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయాలను పలుమార్లు సంప్రదించినప్పటికీ.. ఏ విభాగమూ స్పందించలేదని ఆరోపించింది. 
 
 దర్యాప్తు మొదలైనందునే సమాధానం ఇవ్వలేదు... 
 ఈ విషయాన్ని విలేకరులు ప్రస్తావించగా మారీహార్ఫ్ బదులిస్తూ.. విదేశాంగ శాఖలోని బ్యూరో ఆప్ డిప్లొమాటిక్ సెక్యూరిటీ దర్యాప్తు ప్రారంభించటం.. ఆ విభాగంతో పాటు, ఇతర విభాగాల అధికారులను కూడా.. భారత ప్రభుత్వం, ఆ దేశ విదేశాంగ శాఖ, ఆ దేశ రాయబార కార్యాలయం అడిగిన సమాచారం ఇవ్వకుండా నిరోధించిందని పేర్కొన్నారు. ‘‘బాధితురాలు (సంగీత)కు చెందిన న్యాయవాది నుంచి.. వీసా అక్రమాలు, ఇతర ఆరోపణలతో  జూలై 9వ తేదీన మాకు నోటిఫికేషన్ అందింది. ఆ సమయంలో బ్యూరో ఆఫ్ డిప్లొమాటిక్ సెక్యూరిటీ ఈ ఆరోపణలపై తన దర్యాప్తు ప్రారంభించాల్సిన బాధ్యత ఉంది. ఒకసారి దర్యాప్తు మొదలైతే.. మేం ప్రయివేటుగా కానీ, బహిరంగంగా కానీ ఏం చెప్పాలనేదానిపై పరిమితులు ఉంటాయి. మేం చట్టాన్ని సంపూర్ణంగా పాటించాలి’’ అని ఆమె వ్యాఖ్యానించారు.

Advertisement
Advertisement