
కేజ్రీ..రాజీనామా
కాంగ్రెస్‌తో ఆమ్ ఆద్మీ పార్టీ కలహాల కాపురానికి తెరపడింది. అధికారం చేపట్టినప్పటి నుంచీ దినదిన గండంగానే నెట్టుకొచ్చిన ఆప్ మైనారిటీ ప్రభుత్వం కాడి పారేసింది.
' సీఎం పదవి నుంచి తప్పుకున్న కేజ్రీవాల్
ఢిల్లీ అసెంబ్లీ రద్దుకు, ఎన్నికలకు సిఫార్సు
జన్‌లోక్‌పాల్‌ను తిరస్కరించిన అసెంబ్లీ
బిల్లు పెట్టలేకపోవడంతో తప్పుకుంటున్నా
కార్యకర్తల సమక్షంలో ప్రకటించిన కేజ్రీ
అంబానీతో కుమ్మక్కై కాంగ్రెస్, బీజేపీ సర్కారును కూల్చేశాయంటూ విమర్శలు
కాంగ్రెస్ పార్టీ ముకేశ్ దుకాణమని ధ్వజం
న్యూఢిల్లీ: కాంగ్రెస్‌తో ఆమ్ ఆద్మీ పార్టీ కలహాల కాపురానికి తెరపడింది. అధికారం చేపట్టినప్పటి నుంచీ దినదిన గండంగానే నెట్టుకొచ్చిన ఆప్ మైనారిటీ ప్రభుత్వం కాడి పారేసింది. వెరసి ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ (45) నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ వివాదాస్పద పాలన 49 రోజుల్లోనే ముగిసింది. జన్ లోక్‌పాల్ బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందకపోతే రాజీనామా చేస్తానని ముందునుంచీ చెబుతూ వస్తున్న కేజ్రీవాల్ చివరికి అన్నంత పనీ చేశారు. శుక్రవారం సభలో బిల్లు పెట్టేందుకు ప్రయత్నించి భంగపడటంతో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. రాత్రి ఇద్దరు మంత్రివర్గ సహచరులతో పాటు వెళ్లి లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్‌ను కలిసి రాజీనామా లేఖ సమర్పించారు. అసెంబ్లీని రద్దు చేసి తాజాగా ఎన్నికలు జరపాలంటూ సిఫార్సు లేఖను కూడా దాంతోపాటే అందించారు. అసెంబ్లీని రద్దు చేసి లోక్‌సభతో పాటే ఎన్నికలు జరిపించడమా, లేక ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధించడమా అనే అంశాలపై కేంద్రానికి జంగ్ శనివారం నివేదిక ఇవ్వనున్నారు.
అంతకుముందు అసెంబ్లీలో జరిగిన ఓటింగ్‌లో ఓటమి పాలు కాగానే కేజ్రీవాల్ నేరుగా సచివాలయానికి వెళ్లి మంత్రివర్గంతో అత్యవసరంగా సమావేశమయ్యారు. తర్వాత పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరుకుని కార్యకర్తల సమక్షంలో రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు. అవినీతిపై తమ పోరాటం ఇకముందు కూడా కొనసాగుతూనే ఉంటుందని కార్యకర్తల హర్షధ్వానాల నడుమ ప్రకటించారు. అవినీతి అంతానికి సీఎం పదవిని వెయ్యిసార్లు వదులుకోవాల్సి వచ్చినా, చివరికి తన జీవితాన్నే త్యాగం చేయాల్సి వచ్చినా అదృష్టంగానే భావిస్తానన్నారు.
అధికారం కోసం రాలేదు: కాంగ్రెస్, బీజేపీలపై ఈ సందర్భంగా కేజ్రీవాల్ విరుచుకుపడ్డారు. ‘‘నా ప్రభుత్వాన్ని కూల్చేందుకు కాంగ్రెస్, బీజేపీ రెండూ రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీతో కుమ్మక్కయ్యాయి. జన్ లోక్‌పాల్ బిల్లుకు వ్యతిరేకంగా ఒక్కటయ్యాయి. అంబానీపై ఎఫ్‌ఐఆర్ నమోదుకు మేం ఆదేశించడమే అందుకు కారణం’’ అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ‘‘గత పదేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అంబానీయే నడిపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నిజానికి అంబానీ దుకాణం. అందులో ఆయన ఎప్పుడంటే అప్పుడు ఏదంటే అది కొనుక్కోగలరు. అంబానీ, మొయిలీల తర్వాతి వంతు కేంద్ర మంత్రులు శరద్ పవార్, కమల్‌నాథ్‌లదే.
అందుకే వాళ్లు భయపడి నన్ను తొలగించారు. నా స్థాయెంత? నేను చాలా చిన్నవాణ్ణి. నేనిక్కడికి అధికారం కోసం రాలేదు’’ అన్నారు. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీనీ కేజ్రీవాల్ విడిచిపెట్టలేదు. ఏడాదిగా అంబానీయే మోడీని వెనకుండి నడిపిస్తున్నారని ఆరోపించారు. ‘‘లేదంటే మోడీ దేశమంతటా హెలికాప్టర్లలో ఎలా తిరుగుతున్నారు? అంతంత ఖర్చు పెట్టి బహిరంగ సభలెలా పెడుతున్నారు? వాటన్నింటికీ డబ్బులెక్కడివి?’’ అని ప్రశ్నించారు. ‘‘మేం పాలించలేమన్నారు. కానీ 40 రోజుల్లోనే అవినీతిని అరికట్టాం. ఇది పాలన కాకపోతే మరేమిటి? జన్ లోక్‌పాల్ రాజ్యాంగ విరుద్ధమంటున్నారు. మరి సభల్లో మైకులు విరగ్గొట్టడం రాజ్యాంగబద్ధమా? లోక్‌సభలో ఎంపీల తీరు, ఢిల్లీ అసెంబ్లీలో బీజేపీ, కాంగ్రెస్ సభ్యుల తీరు సిగ్గుచేటు. పార్లమెంటు దేవాలయమని వారే అంటారు. ఎవరైనా గుడికి వెళ్లి విగ్రహాలను పగలగొడతారా?’’ అంటూ దుయ్యబట్టారు. రాజ్యాంగం కోసం ప్రాణత్యాగానికీ తాను సిద్ధమంటూ భావోద్వేగంతో మాట్లాడారు. దేశం కోసం త్యాగాలు చేసే అవకాశమివ్వాల్సిందిగా దేవుణ్ని ప్రార్థిస్తున్నానంటూ ప్రసంగాన్ని ముగించారు.
ఉదయం నుంచే ‘ఏర్పాట్లు’?
రాజీనామాకు శుక్రవారం ఉదయం నుంచే కేజీవ్రాల్ పకడ్బందీగా ఏర్పాట్లు చేసుకున్నారు! పార్టీ కార్యాలయానికి తరలి రావాల్సిందిగా ఆప్ కార్యకర్తలందరికీ ముందుగానే మూకుమ్మడి ఎస్సెమ్మెస్‌లు వెళ్లాయి. ఆ మేరకు వారంతా భారీ సంఖ్యలో వచ్చి గుమిగూడారు. అసెంబ్లీలో కేజ్రీవాల్ ప్రసంగాన్ని చూసేందుకు అక్కడ అప్పటికే తెర కూడా ఏర్పాటు చేశారు. ఎన్నికల్లో విజయానంతరం మాట్లాడిన వేదిక నుంచే సీఎంగా ఆయన తన ‘చివరి’ ప్రసంగం చేశారు. కేజ్రీవాల్ రాజీనామా చేసి జాతీయ రాజకీయాల్లోకి వెళ్లి ప్రధాని కావాలంటూ కార్యకర్తలంతా నినదించారు. ఏకంగా 350 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తామని ఆప్ ఇప్పటికే ప్రకటించడం తెలిసిందే.
పాలనను కేజ్రీవాల్ సీరియస్‌గా తీసుకోలేదు: కాంగ్రెస్
కేజ్రీవాల్ పరిపాలనను ఎన్నడూ సీరియస్‌గా తీసుకోలేదని, ఆయన రాజీనామా ముందుగా ఊహించినదేనని కాంగ్రెస్ ప్రతినిధి సందీప్ దీక్షిత్ పేర్కొన్నారు. ‘కేజ్రీవాల్ కోతలరాయుడు. అబద్ధాలకోరు. సమస్య నుంచి పారిపోయేందుకు సాకుల కోసం వెతికే వ్యక్తి. రాజ్యాంగాన్ని నాశనం చేసేందుకు ప్రయత్నించారు. ఆయన సహజంగానే వ్యతిరేక స్వభావి’ అని దుయ్యబట్టారు. కేజ్రీవాల్ పక్కా పథకం ప్రకారమే రాజీనామా చేశారని ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ అర్వీందర్‌సింగ్ లవ్లీ ఆరోపించారు. కేజ్రీవాల్ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చే సి, రాజ్యాంగం ప్రకారం బిల్లు తెస్తే మద్దతిస్తామని ఢిల్లీ కాంగ్రెస్ ప్రతినిధి ముఖేశ్ శర్మ అన్నారు.
వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే రాజీనామా: బీజేపీ
ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయిన కేజ్రీవాల్ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే రాజీనామా చేశారని బీజేపీ ప్రతినిధి సుధాంశు మిశ్రా ధ్వజమెత్తారు.
దురదృష్టకరం: హజారే
కేజ్రీవాల్ రాజీనామా, జన్‌లోక్‌పాల్ బిల్లు అసెంబ్లీలో పాస్ కాకపోవడం దురదృష్టకరమని అన్నా హజారే అన్నారు.
అసెంబ్లీలో నాటకీయ పరిణామాలు
అంతకుముందు అసెంబ్లీలో శుక్రవారం నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ద్రవ్య బిల్లులను ఢిల్లీ అసెంబ్లీలో ప్రవేశపెట్టాలంటే లెఫ్టినెంట్ గవర్నర్ సిఫార్సు తప్పనిసరి. కేంద్రం అనుమతి, తన సిఫార్సు లేని జన్ లోక్‌పాల్ బిల్లును సభలో ప్రవేశపెట్టడం చట్టవిరుద్ధమని పేర్కొంటూ అసెంబ్లీకి జంగ్ లేఖ పంపారు. ఆ బిల్లును పరిగణనలోకి తీసుకోవద్దని సలహా ఇచ్చారు. ఆయన లేఖను స్పీకర్ ఎంఎస్ ధీర్ సభలో చదివి విన్పించారు. ఇదేమీ పట్టించుకోకుండానే బిల్లును సభలో పెట్టేందుకు కేజ్రీవాల్ ప్రయత్నించగా బీజేపీ, కాంగ్రెస్ సహా విపక్షాలన్నీ తీవ్రంగా వ్యతిరేకించాయి. దీనిపై ఓటింగ్‌కు డిమాండ్ చేశాయి. గందరగోళం మధ్య సభ వాయిదా పడింది. తిరిగి సమావేశమయ్యాక బిల్లు పెట్టే అంశంపై స్పీకర్ ఓటింగ్ చేపట్టారు. 70 మంది సభ్యులున్న సభలో 27 మంది ఆప్ సభ్యులు మాత్రమే మద్దతుగా ఓటేశారు. బీజేపీ, కాంగ్రెస్ సహా 42 మంది దాన్ని వ్యతిరేకించడంతో తీర్మానం వీగిపోయింది. దాంతో బిల్లును ప్రవేశపెట్టడం లేదని స్పీకర్ ప్రకటించారు. అనంతరం సభనుద్దేశించి కేజ్రీవాల్ క్లుప్తంగా ప్రసంగించి నిష్ర్కమించారు. ఆప్‌కు 28 మంది ఎమ్మెల్యేలుండగా ఇటీవల ఒకరిని (బిన్నీ) సస్పెండ్ చేయడం తెలిసిందే. 8 మంది ఎమ్మెల్యేలున్న కాంగ్రెస్ బయటి నుంచి ఇస్తున్న మద్దతుతో ఆప్ ప్రభుత్వం మనుగడ సాగించింది. కేజ్రీవాల్ 2013 డిసెంబర్ 28న సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు.
‘ఆప్’ ప్రభుత్వ విజయాలు
మీటరు కనెక్షన్ల ద్వారా ప్రతి కుటుంబానికి రోజుకు 667 లీటర్ల ఉచిత మంచినీరు నెలకు 400 యూనిట్ల కంటే తక్కువ వాడే కుటుంబాలకు కరెంటు బిల్లుపై 50 శాతం రాయితీ వీఐపీ సంస్కృతి నిర్మూలనలో భాగంగా అధికారుల వాహనాలపై ఎరుపు, నీలి బుగ్గల తొలగింపు మరమ్మతుల కోసం ప్రతి స్కూలుకు రూ.1 లక్ష కేటాయింపు అవినీతి నిర్మూలన కోసం హెల్ప్‌లైన్ల ఏర్పాటు కామన్వెల్త్ క్రీడల స్కాంలో మాజీ సీఎం షీలా దీక్షిత్‌పై ఎఫ్‌ఐఆర్. కృష్ణా-గోదావరి(కేజీ) బేసిన్‌లో ఉత్పత్తయ్యే గ్యాస్ ధరల నిర్ణయంలో కుమ్మక్కయ్యారన్న ఆరోపణపై కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీ, కేంద్ర మాజీ మంత్రి మురళీ దేవరా, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీలపై ఎఫ్‌ఐఆర్. మూడు ప్రవేట్ విద్యు త్ పంపిణీ సంస్థల లావాదేవీలపై ఆడిట్‌కు ఆదేశం.